గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Feb 06, 2020 , 02:54:51

మళ్లీ నిరాశే..

మళ్లీ నిరాశే..
  • ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం కొంతే..
  • కరీంనగర్‌-కాజీపేట రైల్వేలైన్‌ ఊసే లేదు
  • తీగలగుట్టపల్లె, కునారం వద్ద ఆర్‌వోబీలకు నిధుల్లేవ్‌
  • స్టేషన్ల ఆధునికీకరణకు కేటాయింపుల్లేవ్‌
  • కొత్తపల్లి- మనోహరాబాద్‌కు ఇచ్చింది 235 కోట్లు మాత్రమే
  • ఉప్పల్‌, జమ్మికుంట స్టేషన్లలో కాగజ్‌నగర్‌, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌పై స్పష్టత కరువు
  • రామగుడం-మణుగూరు కోల్‌ లింక్‌లైన్‌ ప్రస్తావన లేదు
  • కేంద్రం తీరుపై విమర్శలు

(కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల ఒకటిన పార్లమెంట్‌లో 2020-2021 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అందులో రైల్వేకు కేటాయించిన మౌలిక వసతులతోపాటు ఇతర నిధులకు సంబంధించి సంగ్రహ స్వరూపం ‘పింక్‌ బుక్‌'ను బుధవారం విడుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన బడ్జెట్‌ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌ రాకేశ్‌ వెల్లడించారు. అయితే ఈ బడ్జెలోనూ ఉమ్మడి జిల్లాకు మొండిచెయ్యే మిగిలింది. జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం రైళ్ల హాల్టింగ్‌, కొత్త రైళ్ల ప్రతిపాదనలు లేకపోవడం నిరాశ పరిచింది.

   

ఎక్స్‌ప్రెస్‌ల జాడ లేదు.. ఆర్‌వోబీకి నిధులు లేవు.. 

ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగిన రైల్వే స్టేషన్లలో ఉప్పల్‌, జమ్మికుంటలున్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో రెండు ప్రధాన రైళ్ల నిలుపుదల కోసం వినోద్‌కుమార్‌ కేంద్రం, రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. ఆ మేరకు ఉప్పల్‌లో కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, జమ్మికుంటలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఆగేవి. దాదాపు ఆరు నెలల పాటు ఈ రైలు ఈ స్టేషన్ల పరిధిలో ఆగాయి. అప్పుడు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని బాగా వినియోగించుకున్నారు. అయితే గత అక్టోబర్‌ నుం చి ఈ రెండు స్టేషన్లలో సదరు రైళ్లు ఆగడం లేదు. దీంతో ప్రయాణికులు అనేక కష్టాలు పడుతున్నారు. గతంలో మాదిరిగానే రెండు స్టేషన్లలో రెండు రైళ్లు ఆగే విధంగా ప్రయత్నించాలని కోరుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఈ ఆంశం పై ఒక స్పష్టత రావచ్చని ఆశించారు. కానీ, ఆ ఊసే లేదు. కనీసం దక్షిణ మధ్య రైల్వే ప్రకటిస్తుందని భావించారు. నేటికీ స్పష్టత లేదు. ఇక సదరు రైళ్లు ఆగుతాయన్న నమ్మకం లేకుండా పోతుంది. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలోని తీగలగుట్టపల్లె వద్ద ఆర్‌వోబీ నిర్మాణం చేయాలన్న డిమాండ్‌ ఉన్నది. అయితే దీనిపై గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా ఫలితం లేకపోయింది. 


ఈ బడ్జెట్‌లో ఎక్కడ నిధులు కేటాయించిన దాఖాలాలు లేవు. నగరానికి ఆనుకొని ఉన్న ఈ లైన్‌ వద్ద రైలు వచ్చినప్పుడు ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నా రు. ఈసారి తప్పకుండా నిధులు వస్తాయని ఆశించారు. కానీ, ఎక్కడా కేటాయింపులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే దక్షిణ భారదేశంలోనే అత్యధిక అదాయాన్ని రైల్వేకు సమకూర్చుతున్న కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో గోడౌన్లను నిర్మాణం చేయాలని కోరుతున్నా, ఈ బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. పెద్దపల్లి జిల్లాలోనూ పరిస్థితి ఇలానే ఉన్నది. ప్రధానంగా పెద్దపల్లి జంక్షన్‌, రామగుండం రైల్వే స్టేషన్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ఆధునీకరణ పనులు మినహా కొత్తగా కేటాయింపులు లేవు. దాదాపుగా 12ఏళ్ల క్రితం ప్రతిపాదించిన రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌ ఊసే లేదు. కునారం వద్ద నిర్మించాల్సిన రైల్వే క్రాసింగ్‌ బ్రిడ్జి ప్రస్తావన చేయలేదు. అదే విధంగా జిల్లాలోని పెద్దంపేట, రాఘవాపురం, కొత్తపల్లి, కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లి రైల్వే స్టేషన్లు ఆధునీకరణకు పెద్దగా నిధుల కేటాయింపు లేదు. కొత్త రైళ్ల జాడ లేదు.  

    

ప్రధానితో శంకుస్థాపన కాబట్టే.. నిధులు 

2004లో కరీంనగర్‌ లోకసభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తపల్లి- మనోహరాబాద్‌ బ్రాడ్‌గేజ్‌  రైల్వైలైన్‌ను తెరపైకి తెచ్చారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ను రాజధానితో అనుసంధానం చేయాలన్న దూరదృష్టితో ఈ లైన్‌ను ప్రతిపాదించారు. కేసీఆర్‌ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నంతసేపు అంటే 2004 నుంచి 2006 వరకు ఈ లైన్‌కు సంబంధించిన ప్రక్రియ బాగానే సాగింది. కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల నాటి రైల్వేరంగం డిటేల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును యుద్ధప్రాతిపదికన తయారు చేసింది. ఆ మేరకు నాటి బడ్జెట్‌లో సర్వే కోసం 10 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల కేసీఆర్‌ 2006లో రాజీనామా చేశారు. తిరిగి 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి ఎంపీగా విజయం సాధించినా, ఆనాటి ప్రభుత్వాలు ఈ లైన్‌ విషయంలో నమ్మిస్తూ మోసం చేస్తూ వచ్చాయి. 2012-13 బడ్జెట్‌లో ఈ మార్గం సర్వేకు 20 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆనాటి రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ ప్రకటించారు. ఆ తదుపరి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఈ మార్గానికి సంబంధించి 10 కోట్లు కేటాయించారు. కానీ, అందులో ఒక్కపైసా విడుదల కాలేదు. తర్వాత కరీంనగర్‌ ఎంపీగా 2014లో విజయం సాధించిన వినోద్‌కుమార్‌ ఈ లైన్‌ సాధనకు నిర్విరామ కృషి చేశారు. ఆమేరకు రైల్వే బోర్డు పలు నిబంధనలు పెట్టింది. ప్రధానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంతో మూడో వంతు భారాన్ని భరించాలనీ, భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడంతోపాటు ఆ భారాన్ని సైతం భరించాలన్న నిబంధనలు పెట్టింది. 


ఆ మేరకు ముఖ్యమంత్రిని వినోద్‌కుమార్‌ ఒప్పించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు నిర్వహణలో ఇబ్బందుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రైల్వేబోర్డు మరో మెలిక పెట్టింది. దీనికి కూడా ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. దీంతో దిగి వచ్చిన రైల్వే శాఖ ప్రాజెక్టుకు కావాల్సిన భూసేకరణ చేయాలని ప్రభుత్వానికి లేఖ లేఖ రాసింది. ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఈ లైన్‌ విషయంలో పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. అయితే.. ఇక్కడ ఆనాటి ఎంపీ వినోద్‌కుమార్‌ తన చతురతను ప్రదర్శించారు. ప్రధాని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల విషయంలో ప్రతి మూడు నెలలకోసారి ప్రధాన మంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులు సమీక్షిస్తారు. కాబట్టి.. నిధుల కేటాయింపునకు ఢోకా ఉండదు. ప్రతిసారి బడ్జెట్‌ కేటాయించాలని కోరాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న.. వినోద్‌కుమార్‌.. 2016 ఆగస్టు 7న మనోహరాబాద్‌- కొత్తపల్లి లైన్‌కు ప్రధానితో శంకుస్థాపన చేయించారు. నిజానికి ముందుగా వాటర్‌ గ్రిడ్‌ పథకం మాత్రమే ప్రధాని జాబితాలో ఉంది. కానీ, కొత్తపల్లి- మనోహర్‌బాద్‌ రైల్వేలైన్‌ను ఆనాడు వినోద్‌కుమార్‌ ప్రధాని జాబితాలో చేర్పించారు. దీంతో ఈ రైల్వేలైన్‌కు నిధులు కొరత ఉండడం లేదు. 2017-18లో 350 కోట్లు, 2018-19లో 150 కోట్లు, 2019-20లో 200 కోట్లు కేటాయించిన కేంద్రం, తాజా బడ్జెట్‌లో 235 కోట్లు కేటాయించింది. మొత్తం 152 కిలోమీటర్లు గల ఈ లైన్‌ పూర్తిచేయడానికి 1160 కోట్లు అవసరం పడుతాయని అంచనా. కాజీపేట- బల్లర్షా మూడో లైన్‌కు 483 కోట్లు కేటాయించింది. కాగా, కొత్తపల్లి- మనోహరాబాద్‌ రైల్వే లైన్‌కు సంబంధించిన కేటాయించిన నిధులతో సిద్దిపేట-సిరిసిల్ల వరకు పనులను కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది.


కరీంనగర్‌-కాజీపేట ఊసే లేదు..

ఉత్తర తెలంగాణకు తలమానికంగా భావిస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు నలువైపులా జాతీయ రహదారులుండాలని ఆనాటి ఎంపీ, నేటి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఇందులో భాగంగా కరీంనగర్‌ నుంచి మానకొండూర్‌, శంకరపట్నం, హుజూరాబాద్‌, ఎల్కతుర్తి మీదుగా వరంగల్‌ వరకు ఉన్న 70 కిలోమీటర్ల రహదారిని ఎన్‌హెచ్‌ 563గా గుర్తించారు. ఈ మార్గం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) తన పరిధిలోకి తీసుకునే విధంగా వినోద్‌కుమార్‌ ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఈ రోడ్డు గుండానే రైలుమార్గం ఉంటే బాగుటుందన్న ఉద్దేశంతో కరీంనగర్‌-హుజూరాబాద్‌- కాజీపేట వరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు 2017-18 బడ్జెట్‌లో సర్వే చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఆ తదుపరి సర్వే కోసం 2 కోట్లను కేటాయించింది. ఆ మేరకు వినోద్‌కుమార్‌ యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహింప జేసి.. ఆ నివేదికను కేంద్రానికి పంపేలా చేశారు. ఇందుకోసం ఆయన పదేపదే రైల్వే అధికారులతో సమావేశమై సర్వే నివేదిక సాధ్యమైనంత తొందరగా కేంద్రానికి వెళ్లేలా కీలకంగా వ్యవహరించారు. నిజానికి ఈమార్గం పూర్తయితే కరీంనగర్‌ నుంచి కాజీపేట వరకు విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లా వాసులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని భావించి ఆనాడు కేంద్రాన్ని ఒప్పించారు. సర్వే నివేదిక వెళ్లింది కాబట్టి.. ఈ సారి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని అంతా ఆశించారు. కానీ.. తాజా బడ్జెట్‌లో ఆ ఊసే లేకపోవడం నిరాశపరిచింది. ఇంత ప్రాధాన్యత గల రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయాన్ని బడ్జెట్‌లో ప్రకటించకపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. 


logo