సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - Feb 05, 2020 , 02:51:20

ధార్మిక క్షేత్రంలో ’అన్నపూర్ణ’

ధార్మిక క్షేత్రంలో ’అన్నపూర్ణ’
  • వేములవాడలో నేటి నుంచి ప్రారంభం
  • మున్సిపల్‌ ఆధ్వర్యంలో పథకం
  • ఎమ్మెల్యే రమేశ్‌ బాబు చొరవతో క్యాంటిన్‌ మంజూరు
  • హరే కృష్ణ ఫౌండేషన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణ
  • రోజుకు 300 మందికి అన్నం
  • హర్షం వ్యక్తంచేస్తున్న ప్రజలు, రాజన్న భక్తులు

వేములవాడ, నమస్తే తెలంగాణ: 5కే పేదలకు కడుపునిండా భోజనం అందించేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మున్సిపల్‌ ఆధ్వర్యంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటుకు సన్నాహాలు చేసింది. ధార్మిక క్షేత్రంలోని ప్రజలు, రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు, వివిధ అవసరాల కోసం పట్టణానికి వచ్చే కూలీలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే రమేశ్‌ బాబు ప్రత్యేక చొరవతో వేములవాడలో ఏర్పాటు చేసింది. రోజుకు 300 మందికి రుచికరమైన భోజనం లభించనున్నది. క్యాంటిన్‌ను నేడు ఎమ్మెల్యే చెన్నమనేని ప్రారంభించనుండగా, సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది.


అన్నార్థుల ఆకలి తీర్చేందుకు వేములవాడలో బుధవారం నుంచి మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ.5 భోజనాన్ని అందించనున్నారు. కూలీలతో పాటు ఇతర పనులను చేసి జీవనోపాధి పొందుతున్న వారికి ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఇప్పటికే మున్సిపల్‌ అధికారులకు సూచించగా బుధవారం నుంచి ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. ప్రతి రోజు అన్నపూర్ణ భోజన పథకం ద్వారా 300 మందికి ఇకపై 5 రూపాయలకే భోజనాన్ని అందించనుండగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేతులమీదుగా ప్రారంభంకానుంది. 


మున్సిపల్‌ ఆధ్వర్యంలో..

వేములవాడ మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు రూ.5 భోజనాన్ని నేటి నుంచి అమలుచేయనున్నారు. ఇప్పటికే మండల పరిషత్‌ కార్యాలయం ముందు సంస్కృత కళాశాల పక్కన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వద్ద మున్సిపల్‌ ఖాళీస్థలంలో ఉన్న భవనాన్ని ఇందుకు అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దారు. వివిధ పనుల కోసం పట్టణానికి వ చ్చే ప్రజలతో పాటు స్థానికంగా ఉండి ఉ పాధి పొందుతున్న వారికి రూ.5కే భోజనం అందించి ఆకలి తీర్చనున్నారు. హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థద్వారా రోజు 300 మందికి ఈ భోజన సదుపాయాన్ని మున్సిపల్‌ అధికారులు కల్పించనున్నారు. 


ఎమ్మెల్యే చొరవతో 

వేములవాడలో నిత్యం ఉపాధి కోసం పనిచేస్తున్న వారి తో పాటు ఇతర అవసరాల కోసం వచ్చే వారికి మధ్యాహ్న భోజనాన్ని అమలుచేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. హైదరాబాద్‌, సిరిసిల్లలో అమలవుతున్న విధానంగా వేములవాడలోనూ రూ. 5లకే భోజనాన్ని అందించాలని రాష్ట్ర మున్సిపల్‌ ఉన్నతాధికారుల ను ఆయన కోరారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికలకు ముందే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రారంభం కాస్త ఆలస్యమైంది.  భోజన ఏర్పాట్లకు కావాల్సిన భవనం పూర్తికాగా అనుమతులు కూడా ఇప్పటికే మం జూరుకావడంతో ఎమ్మెల్యే చేతులమీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.


logo