బుధవారం 03 జూన్ 2020
Rajanna-siricilla - Feb 05, 2020 , 02:49:14

తల్లీ వస్తున్నాం..

తల్లీ వస్తున్నాం..
  • నేటి నుంచే వనదేవతల జాతర
  • నేడు గద్దెకు సారలమ్మ
  • రేపు సమ్మక్క రాక
  • ఎల్లుండి మొక్కులు
  • పూర్తయిన ఏర్పాట్లు
  • తరలివస్తున్న భక్తులు

నేటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతరకు తెరలేవనున్నది. బుధవారం నుంచి శనివారం దాకా ఉమ్మడి జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో జాతర కన్నుల పండువగా జరగనున్నది. ఇందులో 32 జాతరలను దేవాదాయశాఖ గుర్తించి, ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 


నాలుగు రోజుల ఉత్సవాలు..

ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మ జాతర మేడారంతోపాటు అన్ని జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతటా ఉత్సవాలు నాలుగు రోజులపాటు ఒకే తీరున సాగుతాయి. గట్టమతల్లి పూజలు, ఎదురుకోళ్ల సమర్పణ, ఒడి బియ్యం, శివసత్తుల పూనకాలు, బెల్లం తూకాలు, కోయ, గోండు గిరిజన నృత్యాలు, అబ్బియ రాగాలు.. ఇలా అంతటా ఒకే తీరున కనిపిస్తాయి. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను నిర్వహిస్తారు. కోయపూజారులు తమ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుతారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపాన ఉన్న సమ్మక్కను గద్దెకు తీసుకువస్తారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ ఆహ్వానించి ప్రతిష్ఠిస్తారు. మొదటి రోజు నుంచే తరలివచ్చే భక్తులు, మూడో రోజు పెద్దసంఖ్యలో వచ్చి తల్లీబిడ్డలకు మొక్కులు అప్పజెప్పుతారు. నాలుగో రోజు వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.


నెల ముందు నుంచే మొక్కులు.. 

మాఘశుద్ధ పౌర్ణమి నెల మొదలైన రోజు నుంచే వన దేవతలకు మొక్కులు చెల్లిస్తారు. యాటలు, కోళ్లు బలిచ్చి ఎవరింట్లో వాళ్లు సమ్మక్కను కొలుస్తారు. జాతర్లకు వెళ్లే ముందు వేములవాడ రాజన్నను ఆనవాయితీగా దర్శించుకుంటారు. తర్వాత తల్లులకు అతి ప్రీతిపాత్రమైన బంగారం (బెల్లం) అప్పజెప్పుతారు. నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. వీధుల్లో ‘సమ్మక్క బంగారం ఉళ్లో’ అంటూ పంచి పెడుతారు. జాతర ఎక్కడ జరిగితే అక్కడికి కుటుంబాలతో వెళ్లి గద్దెలపై ఉన్న అమ్మవార్లను దర్శించుకుంటారు. తలనీలాలు సమర్పిస్తారు. పుణ్యస్నానాలు చేస్తారు. మహిళలు ఒడిబియ్యంతోపాటు ఇద్దరమ్మలకు కుంకుమ, పసుపు, బంగారం(బెల్లం) సమర్పిస్తారు. పిల్లాపాపను, గొడ్డుగోదను చల్లంగ చూడాలని వేడుకుంటారు. అక్కడే యాటనో, కోడినో కోసుకొని, వంట చేసుకొని భోజనం చేస్తారు. రాత్రి ఆయాచోట్లే నిద్రజేసి, తెల్లారి మొక్కులు అప్పగించాక తిరుగుముఖం పడుతారు. 


జిల్లాలో జాతరలు

ఉమ్మడి జిల్లాలో జాతర కనుల పండువగా జ రుగనున్నది. సుమారు 32 జాతరలను గుర్తించి దేవాదాయశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రధానంగా కరీంనగర్‌ శివారులోని రేకుర్తి, నీరుకుల్ల, హుజూరాబాద్‌, కేశవపట్నం, వీణవంక, గో దావరిఖని, గోలివాడ, ఈసాల తక్కళ్లపల్లి, కొలనూర్‌, నీరుకుళ్ల జాతరలు మినీ మేడారాలను తలపిస్తాయి. లక్షలాది మందితో నాలుగు రోజులపాటు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. మిగతా చోట్ల కూడా వేలాది మందితో రద్దీగా మా రనుండగా, అన్నిచోట్లా ఏర్పాట్లు పూర్తయ్యాయి.


logo