శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Feb 02, 2020 , 00:48:15

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

సిరిసిల్ల టౌన్: ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. జిల్లా రవాణశాఖ అధికారి కొండల్‌రావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జడ్పీ అధ్యక్షురాలు అరుణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రజల కోసం ప్రభుత్వాలు తయారు చేసినవని వివరించారు. వాహనాదారులు రవాణాశాఖ సూచించిన నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి వాహనదారుడికీ నిబంధనలపై అవగాహన ఉంటుందనీ, నిర్లక్ష్య వైఖరితో వాటిని ఉల్లంఘించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని వాపోయారు. యువత స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారనీ, తల్లిదండ్రులకు తీరని  శోకాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన చెందారు. పోలీస్, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలనీ, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను వైద్యశాలకు తరలించిన వారిపై, పోలీసులకు సమాచారమిచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తారన్న అనవసరమైన అపోహలు ప్రజల్లో ఉన్నాయని అవి సరికావన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను దవాఖానకు తరలించి వారి ప్రాణాలను కాపాడాలని, అదే సమయంలో పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. తద్వారా ప్రమాద కారకులను పట్టుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. క్షతగాత్రులను తరలించడంలో 108వాహన సిబ్బంది అం దిస్తున్న సేవలను కొనియాడారు. తక్షణమే వారికి 108లో అందిస్తున్న శస్త్ర చికిత్సతో ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉందన్నారు. అనంత రం పోలీస్, వైద్యశాఖల్లో పని చేస్తున్న పలువురు సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య, పట్టణ సీఐ వెంకటనర్సయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సుమన్‌మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.  


logo