శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Feb 02, 2020 , 00:42:08

రాజన్న భక్తులకు మెరుగైన వసతులు

రాజన్న భక్తులకు మెరుగైన వసతులు

వేములవాడ కల్చరల్: మహాశివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులు మెరుగైన వసతులను కల్పిస్తామనీ, ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. రాజన్న ఆలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం లోపల ఉన్న క్యూలైన్లను, దక్షిణద్వారం వద్ద పరిసరాలను, గుడి  చెరువులోని మైదాన ప్రాంతం, జాత్రాగ్రౌండ్ ప్రాంతాలను సందర్శించారు. చేపట్టిన పలు పనులను పర్యవేక్షించారు. చెరువు ప్రాంతంలో వ్యర్థాల తొలగింపు, మట్టిని చదునుచేయించే పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. తర్వాత ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడారు. మూడురోజులక్రితమే వేములవాడకు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని గుర్తచేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని అప్రమత్తం చేశానని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దీనిపై పలు దినపత్రికల్లో కథనాలు రావడంపై విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలు గకుండా చూస్తామనీ, స్వామివారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణం లో క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తున్నామని వెల్లడించారు. ఆ విధులను ఇంజినీరింగ్ అధికారులకు ప్రత్యేకంగా అప్పగించామని తెలిపారు. భక్తులకు వైద్యసౌకర్యం, తాగునీటి సౌకర్యం, విడిది చేసేందుకు చెరువులోని మైదానప్రాంతంలో చలువపందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది అనుక్షణం శానిటేషన్‌పై దృష్టిసారిస్తారనీ, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆల య ఈవో కృష్ణవేణి, ఏఈవోలు, పర్యవేక్షకుల, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.