మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Jan 31, 2020 , 02:59:30

సహకార సమరం

సహకార సమరం


(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుండగా, ప్రతి సహకార సంఘంలో ఆ రోజు స్థానికంగా నోటీసు జారీ చేస్తారు. అలాగే 6, 7, 8 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్లు పరిశీలిస్తారు. 10న నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడి, గుర్తుల కేటాయింపు ఉంటుంది. అలాగే 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక ఉంటుంది. 


23 సంఘాలకే ఎన్నికలు..

జిల్లాల పునర్విభజన తర్వాత మిగిలిన 23 పాత సంఘాలకు మాత్రమే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి మండలానికి కనీసం రెండు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖను ఆదేశించింది. ఈ మేరకు జీఓ నంబర్‌ 45ను జారీ చేసింది. ఈ జీఓను అనుసరించి జిల్లాలో 10 కొత్త సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తుది రూపం కూడా ఇచ్చిన జిల్లా అధికారులు ఈ నెల 20న ముసాయిదా ప్రతిని కూడా విడుదల చేశారు. అప్పటి నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు 21 రోజుల గడువు నిర్దేశించారు. ముసాయిదా విడుదల చేసి గురువారం నాటికి సరిగ్గా 10 రోజులు. కొత్త సంఘాలపై అభ్యంత రాలు స్వీకరణకు గడువు ఇంకా 11 రోజులు ఉం ది. ఆ తర్వాత జరిగే ప్రక్రియకు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున ప్రస్తుతం పాత సంఘాలకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 23 సంఘాల్లో 40,412 మంది సభ్యులు ఉన్నారు. వీరికి సం బంధించి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను గత డిసెంబర్‌లోనే అధికారులు సిద్ధం చేశారు. 


ఇక ఏర్పాట్లు ముమ్మరం..

పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన సహకార ఎన్నికలు నిజానికి పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే నిర్వహించాలనుకున్నారు. కానీ, ఈ ఎన్నికలకు నోటిఫికేషన్‌ త్వరగా రావడంతో వాయిదా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సగానికిపైగా ఏర్పాట్లను అధికారులు అప్పట్లోనే చేశారు. బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, తదితర అంశాలను కూడా పరిశీలించారు. తుది ఓటరు జాబితాను కూడా గత డిసెంబర్‌లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనుకున్నా సహకార శాఖ సిద్ధంగా ఉంది. గురువారం హైదరాబాద్‌ సహకార శాఖ కమిషనరేట్‌లో జిల్లా అధికారుల సమావేశం జరిగింది. ఇందులో జిల్లాల వారీగా ఏర్పాట్లను సమీక్షించిన తర్వాతనే సహకార శాఖ ఉన్నతాధికారులు షెడ్యూలును ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ వంటి పనులు మిగిలి ఉన్నాయి. తక్కువ సమయం ఉన్నప్పటికీ అన్ని ఏర్పాట్లను చక్కదిద్దుకునే అవకాశం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


 పీఏసీఎస్‌ ద్వారా రైతులకు తోడ్పాటు..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) రైతులతో కూడిన వ్యవస్థ. ప్రభుత్వ రంగంలో నడిచే ఈ సంస్థలో భూమి ఉన్న రైతులే సభ్యులుగా ఉంటారు. ప్రతి ఏటా సహకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే తాత్కాలిక, దీర్ఘకాలిక రుణాలను అందిస్తున్నది. జిల్లాలోని 23 పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు సేవలను విస్తృతపరుస్తున్నది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల పంపిణీకి పరిమితమైన సహకార సంఘాల ద్వారా మరిన్ని సేవలను అందించేలా సర్కారు తోడ్పాటునందిస్తున్నది. వానాకాలం, యాసంగి సీజన్లో విత్తనాలు, ఎరువులతో పాటు మద్దతు ధర కల్పిస్తూ పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయడం.. బంగారు ఆభరణాల రుణాలను సైతం అందించడం, ప్రధానంగా కందులు, మక్కజొన్న, వరిపంటలకు మద్దతు ధర కల్పించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.


logo