శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Jan 30, 2020 , 03:34:44

మానసిక వికాసానికి లెర్నర్‌ సపోర్ట్‌ సెంటర్‌

మానసిక వికాసానికి లెర్నర్‌ సపోర్ట్‌ సెంటర్‌

విరామ సమయాన్ని వినియోగించుకుంటూ విద్యార్థుల్లో నైతిక విలువలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌ ఉపాధ్యాయులు ‘లెర్నర్‌ సపోర్ట్‌ సెంటర్‌' పేరుతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల ముగిసిన తర్వాత సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పుస్తకాలు, పత్రికలు, ఇతర మానసిక వికాస కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. గత నవంబర్‌ 28న గ్రామస్తుల సహకారంతో స్థానిక ముదిరాజ్‌ సంఘ భవనంలో డీఈవో రాధాకిషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇద్దరు టీచర్లకు జీతం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండడం, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ దత్తత తీసుకోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - ఎల్లారెడ్డిపేట

  • విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందకు సరికొత్త కార్యక్రమం
  • విజ్ఞానం కోసం వినూత్న ప్రయోగం
  • తిమ్మాపూర్‌లో కార్యక్రమానికి శ్రీకారం
  • జాతీయగ్రామీణాభివృద్ధి సంస్థ దత్తత
  • సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచేందుకు అడుగులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

ఎల్లారెడ్డిపేట: ఒక్కసారి తనని చూస్తే భవిష్యత్తులో తలెత్తకుండా చేస్తానని ఓ సెల్‌ఫోన్‌ అంటే, ఒక్కసారి తనను చూస్తే భవిష్యత్తులో తలదించకుండా చూస్తానని పుస్తకం అంటున్నదనే విషయం నవ్వుకునే డైలాగ్‌లా అనిపించినా అదే నిజమని మేధావులు, మానసికనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. విద్యార్థులకు గతంలో విరామం దొరికితే ఇంటివద్ద రకరకాల ఆటలు ఆడుకునేవారు. దీం తో శారీరక, మానసిక వికాసం జరిగేది. నేటి పోటీ ప్రపంచంలో సోషల్‌మీడియా ప్రభావంతో పుస్తక పఠనంపై దృష్టిపెట్టలేక ఇంటిపని, తరగతి పని పాఠశాలల్లోనే కానిచ్చేస్తున్నారు. 


విజ్ఞాన ప్రపంచానికి దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు వీడియోగేమ్‌లకు అలవాటుపడి చదువును, వాస్తవ జ్ఞానాన్ని అటకెక్కిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం తిమ్మాపూర్‌ ఉపాధ్యాయులు ‘లెర్నర్‌ సపోర్ట్‌ సెంటర్‌' పేరతో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను రాత్రి ఎనిమిది గంటలవర కైనా సెల్‌ఫోన్‌, టీవీలకు దూరంగా ఉంచేలా మార్గం ఆలోచించారు. పుస్తకాలు, పత్రికలు, ఇతర మానసిక వికాస కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. 


టీవీలు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచేందుకు..

చిన్నారులు ఉదయం లేచిన దగ్గర నుంచి బడికి వెళ్లేవరకు టీవీలో బొమ్మలు చూడడం, లేదంటే సెల్‌ఫోన్‌లో రకరకాలైన గేమ్‌లతో తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. సెల్‌ఫోన్‌ ఇవ్వకపోతే అన్నంతినబోమని మారాం చేసే చిన్నారులు, ఓ చేతిలో సెల్‌ఫోన్‌తో వీడియోగేమ్‌ ఆడుతూ తల్లి చేత గోరుముద్దలు తినడానికి అలవాటుపడ్డారు. అమ్మప్రేమను మరిపించే స్థాయికి సెల్‌ఫోన్‌ వచ్చిందనే విషయాన్ని గుర్తించక, పరీక్షల్లో వచ్చే మార్కులతో మాత్రమే చిన్నారులను విజ్ఞానాన్ని అంచనావేస్తున్నారు. 


చిన్నారుల మానసిక వికాసం, కుటుంబ సంబంధాలపై చెడుప్రభావాన్ని చూపుతున్న విషయాలను పసిగట్టిన ఉపాధ్యాయులు తమవంతు కొంతైనా పరిష్కారం చూపాలని ఆలోచించారు. గ్రామస్తులు కూడా తమవంతు ప్రయత్నాన్ని చేసేందుకు ముందుకు వచ్చారు. గ్రామంలో ఖాళీగా ఉన్న ముదిరాజ్‌ సంఘభవనంలో సాయంత్రం రెండు గంటలు పుస్తకపఠనంలో గడిపేందుకు సంఘ సభ్యులు ఒప్పుకున్నారు. చిన్నారులకోసం కేటాయించడంతో పాటు ఇద్దరు టీచర్లకు అవసరమైన జీతం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీంతో నవంబర్‌ 28న లెర్నర్‌సపోర్ట్‌ కేంద్రాన్ని డీఈవో రాధాకిషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. 


ఆలోచన వచ్చిందిలా...

చిన్నారులు పాఠశాలలో హోమ్‌వర్క్‌ చేయకపోవడంతో అక్టోబర్‌లో ఉపాధ్యాయులు మండల విద్యాధికారి మంకురాజయ్యను కలిసి మాట్లాడారు. విద్యార్థులు చదువులో వెనకబడిపోవడానికి కారణాలను ఉదయం ఏడు నుంచి 9 గంటలవరకు ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను అడిగి తెలుసకున్నారు. టీవీలు, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోయి క్లాస్‌వర్క్‌, హోమ్‌వర్క్‌ను పూర్తిచేయకపోవడంతో విద్యకు దూరమవుతున్నారన్న విషయాన్ని గమనించారు. ట్యూషన్‌ చెప్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంలోనే ఒక టీచర్‌ను నియమించి సాయంత్రం చదివించేందుకు స్టడీసెంటర్‌ను తిమ్మాపూర్‌లోని ముదిరాజ్‌ సంఘ భవనంలో ఏర్పాటుచేశారు. ప్రారంభంలో ఒక ఉపాధ్యాయుడి ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ 130 మందికి చేరింది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు వస్తున్నారు. గ్రామంలోని చిన్నారులు ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివినాసరే వారందరూ సాయంత్రం పూట చదువుకునేలా గ్రామస్తులు ప్రోత్సహిస్తున్నారు. 


జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ దత్తత...

లెర్నర్‌ సపోర్ట్‌ కేంద్రం నిర్వహణ గురించి డీఈవో రాధాకిషన్‌కు చెప్పడంతో ఆయన స్టడీసెంటర్‌ను సందర్శించారు. మరింత మెరుగ్గా చేయాలని సూచనలు చేశారు. విషయాన్ని జాతీయగ్రామీణాభివృద్ధి సంస్థ సీనియర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్టడీసెంటర్‌ను సందర్శించి గ్రామస్తుల సహకారం, ఉపాధ్యాయుల చిత్తశుద్ధిని ఆనందించారు. చిన్నారులకు భౌతిక, మానసిక వికాసానికి అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు ముందు కు వచ్చారు. లెర్నర్‌సపోర్ట్‌ కేంద్రాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కేవలం సాయంత్రం పూట పుస్తకపఠనానికి సమయం కేటాయించడంతో సరైన మానసిక వికాసం జరగదనే విషయాన్ని గుర్తించిన వారు అందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేసేందుకు సిద్ధపడ్డారు. విరామకాలం వినియోగానికి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటలవరకు తమ తరగతులకు సంబంధించిన అంశాలతో పా టు పత్రికాపఠనం, పుస్తకపఠనంపై శ్రద్ధపెంచేందు కు చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


సెలవుల్లోనూ నడిచేలా..

లెర్నర్‌సపోర్ట్‌ కేంద్రం సెలవుల్లోనూ నడిచేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేసి ప్రణాళిక చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో ఆకర్షణీయమైన రంగులు వేసి ముదిరాజ్‌ సంఘభవనాన్ని అందం గా మార్చారు. మంచిమంచి సూక్తులు రాశారు. ఇంటివద్ద టీవీలు, సెల్‌ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేసే విద్యార్థులు రెండు గంటల సమయం, ఇద్దరు ఉపాధ్యాయుల సహకారంతో ఓ పక్కన హోమ్‌వర్క్‌ను పూర్తిచేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుం టూ, మరోవైపు అదనపు అంశాలను నేర్చుకోవడంపై శ్రద్ధపెడుతున్నారు. చిన్నారుల మెదళ్లలో చిన్నతనం నుంచే విజ్ఞానం నింపి వారికి భరోసాతో కూడిన భావిజీవితాన్ని అందించడమే లక్ష్యంగా పుస్తకాలు, పత్రికల జ్ఞానంతో ముందుకుసాగుతున్నారు.


విజ్ఞానం నింపేలా.. సమానత్వం నిలిపేలా...

సమాజంలోని నైతికవిలువల పెంపుసాధనమైన పుస్తకం, దాన్ని చదివే అలవాటును బతికించేలా, చిన్నారుల భవిష్యత్తుకు విజ్ఞానపు బాటలువేసేలా లెర్నర్‌సపోర్ట్‌ కేంద్రం కృషిచేస్తున్నది. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే పుస్తక పఠనం అలవాటుగా మార్చేందుకు, వారికి పలురకాల సాధనాలను అందుబాటులో ఉంచేందుకు జాతీయగ్రామీణాభివృద్ది సంస్థ ముందుకు వచ్చింది. అందుకు అవసరమైన కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ పుస్తకాలతో పాటు, కథల పుస్తకాలు చిన్నారులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఎంపీడీవో చిరంజీవి కూడా స్టడీ సెంటర్‌ను సందర్శించి పలు అంశాలపై చిన్నారులు పట్టు సాధించేలా ప్రొజెక్టర్‌ అందించేందుకు హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఒకచోట కలవడంతో సమానత్వ భావన వృద్ధిచేయడం, ఆలోచనలు పంచుకుని ఎదిగే అవకాశాలుంటాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. 


ఉపాధ్యాయుల కృషి బాగుంది...

తిమ్మాపూర్‌లోని లెర్నర్‌సపోర్ట్‌ కేం ద్రం ఏర్పాటు, నిర్వహణ విషయం లో ఉపాధ్యాయుల కృషి బాగుంది. దాతలు, గ్రామస్తులు, అధికారులు ఎవరికి వారుగా అందించిన ప్రోత్సాహం మరిచిపోలేం. స్టడీ సెంటర్‌ కొనసాగితే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నా. ఇప్పటికైతే అందరూ సహకరిస్తున్నారు. జాతీయగ్రామీణ అభివృద్ధి సంస్థ చొరవచూపడం సంతోషంగా ఉంది.  

- మంకురాజయ్య, ఎంఈవో (ఎల్లారెడ్డిపేట) 


రోజూ వస్తున్నారు.. 

మొదట స్టడీ సెంటర్‌ను ప్రారంభించేటప్పుడు చిన్నారులు వస్తారో? లేదో? అనే అనుమాన పడ్డాను. చలిపెట్టినా సరే చదువుకునేందుకు వారు వస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు సైతం చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఐదో తరగతి విద్యార్థుల వరకే రమ్మని చెప్పాం. అయినప్పటికీ మొత్తం 130 మంది విద్యార్థుల వరకు చదువుకునేందుకు వస్తున్నారు. 

- డీ  టీచర్‌ (తిమ్మాపూర్‌) 


బాగా చెబుతున్నరు. 

నేను తిమ్మాపూర్‌లోని పీఎస్‌లో సదువుకుంటున్న. రోజూ సదువుకునేతందుకు వస్తున్న. బాగ సెప్తున్నరు. ఏమైన హోంవర్క్‌ ఉంటే కూడా ఇక్కడనే పూర్తిజేసుకుంటున్న. నాతో పాటు బాగమంది వస్తున్నరు. ఎనిమిది గంటల దాక సదువుకొని ఇంటికి పోతున్నం. సెల్‌ఫోన్‌లో ఆటలు ఆడడం లేదు.

- డాకూరి వర్షిణి, విద్యార్థిని (తిమ్మాపూర్‌) 


పిల్లలందరూ వస్తున్నరు..

ఊర్లె పిల్లలందరూ వస్తున్నరు. ప్రైవేటు బడులళ్లకు పోయెటోల్లు, బాకుర్‌పల్లి బడికి పోయెటోళ్లు, ఊల్లె బడికి పోయెటోల్లు అందరం సదువుకునెతందుకు పోతున్నం. అందరం ఒక్కదగ్గర కూసొని ఎనిమిది దాక సదువుకుంటున్నం. సార్లు ఏమైన వర్క్‌ ఇస్తె గూడ సేసుకుంటున్నం. ఇక్కడ మంచిగ అనిపిస్తున్నది’

- కొంపెల్లి ఆద్య (తిమ్మాపూర్‌) 


logo