శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Jan 29, 2020 , 04:49:08

నిండు‘కొండ’

నిండు‘కొండ’

మల్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తజన సంద్రమైంది. సమక్క, సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో అంజన్న సన్నిధికి భక్తులు మంగళవారం పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సోమవారం రాత్రి వరకే ఆలయ పరిసరాలకు చేరుకొని బస చేసి మంగళవారం వేకువజామున కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఈవో కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామిని, వేంకటేశ్వర స్వామిని, లక్ష్మీ అమ్మవారిని, అనుబంధ బేతాళ స్వామిని భక్తులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. కోదండ రామాలయం, కొండలరాయుని అడుగులు, మునిగుహలు, బొజ్జపోతన తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలకు చెందిన 30మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు భక్తులకు సేవలందించారు. రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలు, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి పూజలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు,, అంతరాలయ దర్శనాలు, వాహన పూజలు రద్దు చేసి, మధ్యాహ్నం 12గంటల తర్వాత ప్రారంభించారు. స్వామి వారిని మంగళవారం 60వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని, ఆలయానికి రూ.10లక్షల దాకా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఆలయ సూపరింటెండెంట్లు వైరాగ్యం అంజయ్య, శ్రీనివాస్‌ శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌ రావు, సంపత్‌, సిబ్బంది కాసర్ల శ్రీనివాస్‌, సునిల్‌, లక్ష్మారెడ్డి, రాజేందర్‌ రెడ్డి, రమేశ్‌, రవి, వెంకటేశ్‌, పోలీస్‌ సెక్యూరిటీ సిబ్బంది ఇన్‌చార్జి సముద్రాల రాంచంద్రం పాల్గొన్నారు. logo