ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jan 29, 2020 , 04:42:36

మానేరు పొంగింది.. చేను మురిసింది..

మానేరు పొంగింది.. చేను మురిసింది..

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: స్వరాష్ట్రంలో రైతన్నకు మంచి రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు జిల్లాకు జలకళను తీసుకొచ్చింది. చెరువులు, కుంటలు గోదావరి జలాలతో ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడంతో సాగువిస్తీర్ణం పెరిగి, అన్నదాతల ముంగిట్లో పండగ వాతావరణం నింపింది. యాసంగి పంట సాగులో వంద శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ యేడాది 80వేల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ వేసిన అంచనాలను తారుమారు చేసింది. లక్షా 27వేల ఎకరాల్లో పంటల సేద్యం నమోదైంది. కాళేశ్వరం జలాలతో సిరుల పంట పండుతున్నందుకు రైతుకుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

కాళేశ్వరంతో జలకళ..

మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం. సాగు, తాగునీటి వనరులు లేక పంటల సాగు అంతంత మ్రాతమే ఉండేది. జిల్లాకు సాగునీరందించే ఏకైక ప్రాజెక్టు ఎగువ మానేరు మాత్రమే. వర్షాభావ పరిస్థితులతో అది కూడా నిండకపోవడంతో ఈ ప్రాంతం దుర్బిక్షంగా మారింది. వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారడమేగాక, ఉపాధి అనేకమంది రైతులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. కూలీలుగా మారాల్సి వచ్చింది. యువత పొట్టచేతపట్టుకొని దుబాయ్‌కి వెళ్లి పోయింది. ఈ నేపథ్యంలో 2014లో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి, అతి త్వరలోనే పూర్తి చేసింది. కొసెల్లని ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయించింది. తద్వారా వేములవాడ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. పంటపొలాలకు సాగునీరు అందుతున్నది. అదేవిధంగా అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మానేటి గడ్డకు వరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయం సకాలంలో పూర్తయింది. అదేవిధంగా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మిస్తున్న 3టీఎంసీల రిజర్వాయర్‌ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రాజెక్టులను నిర్మించడమేగాక గోదావరి జలాల తరలింపునకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలే ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని పూర్తిస్థాయిలో గోదావరి జలాలతో నింపగా, ఆ జలాలు సిరిసిల్ల దాకా వచ్చాయి. దీంతో మానేరు పరివాహాక ఎక్కడా చూసిన జలదృశ్యాలే సాక్షాత్కరిస్తున్నాయి. 

 ఎదురెక్కిన గోదావరి జలాలు

కాళేశ్వరం ద్వారా శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయానికి గోదారి జలాలు చేరాయి. అక్కడి నుంచి ఎగువమానేరులోకి ఎదురెక్కాయి. ఈ ప్రాంతంలో నీటి మట్టం పెరిగి భూగర్భ జలాలు పైపైకి ఎగబాకాయి. వట్టిపోయిన బావులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో అనేక చెరువులు, కుంటలు నీటితో తొణి కీసలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 296 చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో రైతన్నల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆయకట్టు రైతులు ఉత్సహంగా యాసంగి సాగుల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఈ యేడాది జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో యాసంగిలో ఎప్పుడూ సాగు 90వేల ఎకరాలకు మించి సేద్యం కాలేదు. కానీ, ఒకవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలు రావడం, మరోవైపు వేములవాడ ప్రాంతానికి ఎల్లంపల్లి జలాలు రావడంతో ఈసారి యాసంగి సాగు విస్తీర్ణం జిల్లాలో వంద శాతం దాటింది. యాసంగిలో 90వేల ఎకరాలు సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించినా, అంతకంటే లక్షా 27వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవలే పల్లెల్లో చేసిన పంటల సాగు సర్వేలో ఇది వెల్లడైంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పంటల సాగు వివపరీతంగా పెరిగింది. శ్రీ రాజరాజ్వేర ప్రాజెక్టు కింద ఇల్లంతకుంట, బోయినిపల్లి, మానేరు నదీతీరం వెంటఉన్న సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లంపల్లి జలాలు చేరిన వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, వీర్నపల్లి మండలాలకు గోదావరి జలాలకు చేరడంతో సిరులు కురిపించే విధంగా పంటలు సాగవుతుండడం విశేషం. logo