గురువారం 04 జూన్ 2020
Rajanna-siricilla - Jan 28, 2020 , 02:54:59

టీఆర్‌ఎస్‌కు ‘పట్టణా’భిషేకం

 టీఆర్‌ఎస్‌కు ‘పట్టణా’భిషేకం

(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/వేములవాడ, నమస్తే తెలంగాణ):జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించారు. సిరిసిల్లలో నాలు గు, వేములవాడలో 1 ఏకగ్రీవమైన వార్డులు పోను మిగతా 62 వార్డులకు 274 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 25న కౌటింగ్‌ నిర్వహించి, ఫలితాలను వెల్లడించారు. సిరిసిల్లలో 39 మంది, వేములవాడలో 28 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులతో సోమవారం కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. అనంతరం వీరందరితో ఆయా బల్దియాల్లో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో అధ్యక్ష ఉపాధ్యక్షులను చెయ్యెత్తే పద్ధతిలో ఎన్నుకున్నారు. రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే పీఠాలను అధిరోహించారు. సిరిసిల్లలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా జిందం కళ, వైస్‌ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్‌ను, వేములవాడలో ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవిని, వైస్‌ చైర్మన్‌గా మధు రాజేందర్‌ శర్మను ఎన్నుకున్నారు. వేములవాడలో ఎన్నిక ప్రారంభం నుంచి చివరి వరకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు పర్యవేక్షించారు. నూతనంగా పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి, విజయోత్సవ ర్యాలీ తీశారు.  

గులాబీదళం ప్రమాణ స్వీకారోత్సవం

సిరిసిల్ల టౌన్‌ : సిరిసిల్ల చైర్‌పర్సన్‌ జిందం కళను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వైస్‌చైర్మన్‌కు ఎన్నిక నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నుంచి మంచె శ్రీనివాస్‌, బీజేపీ నుంచి బొల్గం నాగరాజును ఆయా పార్టీల సభ్యులు ప్రతిపాదించారు. నాగరాజుకు బీజేపీకి చెందిన ముగ్గురు, మంచె శ్రీనివాస్‌కు 34మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించడంతో శ్రీనివాస్‌ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సమావేశానికి హాజరైనప్పటికీ ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లతో ఆర్డీఓ శ్రీనివాసరావు, ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తరువాత చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎన్నికల ప్రత్యేక అధికారి మహమ్మద్‌ అబ్దుల్‌ అజీంలు నూతన పాలకవర్గ సభ్యులకు పూలమొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు. 

అభినందనల వెల్లువ

సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా, ఎన్నికల అబ్జర్వర్‌ అజీం. ఆర్డీఓ శ్రీనివాసరావు, కమిషనర్‌ సమ్మయ్య హాజరయ్యారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జింద కళ, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కొలువు దీరిన కొత్త పాలకవర్గాన్ని  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆర్డీఓ శ్రీనివాసరా వు, కమిషనర్‌ సమ్మయ్యతో పాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆ గయ్య, ముస్తాబాద్‌ ఎంపీపీ జనగామ శరత్‌రావు, సెస్‌డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి అభినందించారు. పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. వేములవాడలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, ఉపాధ్యక్షులు మధు రాజేందర్‌ శర్మతో పాటు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలను అందజేశారు. శాలువాలు, పూలమాలలతో అభినందించారు. 


logo