సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 28, 2020 , 02:47:38

అభివృద్ధితో కూడిన సుపరిపాలనే ధ్యేయం

అభివృద్ధితో కూడిన సుపరిపాలనే ధ్యేయం

వేములవాడ, నమస్తేతెలంగాణ : అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడమే తమ ధ్యేయమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేములవాడ ప్రజలు పూర్తిస్థాయిలో పురపాలక సంఘంలో మార్పు కోరుకున్నారని తెలిపారు. అధికారులతో ఉండి అభివృద్ధిని చేస్తామని, ఇచ్చిన మాటను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని స్పష్టంచేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పదని ఎమ్మెల్యే అభివర్ణించారు. పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ సారథ్యంలో విలీన గ్రామాలు, వేములవాడ పట్టణాన్ని వచ్చే ఐదేళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు శ్రాయశక్తులా కృషిచేస్తామన్నారు. ప్రతిపక్షాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, అర్థం లేని ఆరోపణలు, అవినీతితో కూడిన ఎత్తుగడలు ఇక మీద పనికిరావని హితవుపలికారు. పురపాలక సంఘం, రాజన్న ఆలయాన్ని గతంలో పనిచేసిన నాయకులు అవినీతి చేయడమే కాకుండా ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించనట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అపూర్వమైన తీర్పును అందించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, అవినీతి లేని పరిపాలనను అందించి అభివృద్ధిలో పునరంకితమవుతామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు.

నూతన పాలకవర్గానికి అభినందనలు

వేములవాడ పురపాలక సంఘం అధ్యక్షురాలిగా రామతీర్థపుమాధవి, ఉపాధ్యక్షులుగా మధురాజేందర్‌శర్మ ఎన్నికైన అనంతరం వా రికి ఎమ్మెల్యే రమేశ్‌బాబు పూలమొక్కను అందజేసి అభినందన లు తెలిపారు. కౌన్సిలర్లుగా మిద్దెల జయ, నిమ్మశెట్టి విజయ్‌, మారంకుమార్‌, జడల లక్ష్మి, నీలం కల్యాణి, జోగిని శంకర్‌, కందుల శ్రీ లత, సిరిగిరి రామచంద్రం, యాచమనేని శ్రీనివాసరావు, బింగి మహేశ్‌, కొండ శ్రీలత, చింతపంటి దివ్య, కొండ పావని, కుమ్మరి శిరీష, నరాల శేఖర్‌, ఇప్పపూల అజయ్‌, గుడూరి లక్ష్మి, గోలి మహేశ్‌ను ఎమ్మెల్యే ర మేశ్‌బాబు శాలువతో సత్కరించి అభినందించారు. జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, నాయకులు ఉన్నారు.