గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jan 28, 2020 , 02:36:01

గులాబీ దళం ‘విజయోత్సవం’

గులాబీ దళం ‘విజయోత్సవం’

వేములవాడ, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల టౌన్‌: మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం శుభాకాంక్షలు, అభినందనలతో సిరిసిల్ల మున్సిపల్‌ ప్రాంగణం సందడిగా మారింది. 12 మంది స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ పక్షానే నిలిచినందుకు సుముఖత చూపగా, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నేత చీటి నర్సింగారావు, రాష్ట్ర సహాయకార్యదర్శి, గూడూరి ప్రవీణ్‌ వారికి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రమాణస్వీకారం చేసిన చైర్‌పర్సన్‌ జిందం కళ-చక్రపాణి, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌తో పాటు పార్టీ కౌన్సిలర్లను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత చీటి నర్సింగారావు, రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, సెస్‌ డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి పూలమాలలు వేసి ఘనంతా సత్కరించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట భారీగా పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యాలయం పైభాగం నుంచి గులాబీలు చల్లుతూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్‌ ఆధ్వర్యంలో నేతలు గజమాలతో చైర్‌పర్సన్‌ కళను సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు ప్రధాన రహదారులు గుండా ఊరేగింపుగా వెళ్లారు. అంబేద్కర్‌ విగ్రహానికి, పాతబస్టాండ్‌లోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. టీఆర్‌ఎస్‌ పట్టణ, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్‌ జిందాబాద్‌, కేటీఆర్‌ నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినదించారు. టీఆర్‌ఎస్‌ పట్టణ, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నాయకులు పాల్గొన్నారు. వేములవాడలో ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రమేశ్‌ బాబు విజయోత్సవ ర్యాలీ తీశారు. పట్టణంలోని పురవీధుల గుండా పటాకులు కాలుస్తూ ర్యాలీ కొనసాగింది. నృత్యాలు చేస్తూ, టీఆర్‌ఎస్‌ పార్టీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు.


logo