ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 25, 2020 , 02:45:18

ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్

ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్
  • మందకొడిగా సాగిన పోలింగ్
  • ఓటు వేసింది 1,65,147 మంది ఓటర్లు
  • గతంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల
  • వినియోగించుకున్న ప్రముఖులు
  • ఉత్సాహం చూపిన యువతీ యువకులు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ నగరపాలక సంస్థలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నగరంలో 60 డివిజన్లు ఉండగా ఇప్పటికే 20, 37 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. శుక్రవారం మిగిలిన 58 డివిజన్లకు పోలింగ్ నిర్వహించగా 62.52 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ డివిజన్లలో మొత్తం 2,64, 134 మంది ఓటర్లు కాగా, వీరిలో 1,33,230 మంది పురుషులు, 1,30,877 మంది మహిళలు, 27 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తంగా పోలింగ్‌లో 1,65,147 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 82,793 మంది పురుషులు, 82,350 మంది మహిళలు, ఇతరులు నలుగురు ఓటు వేశారు. నగరంలో 337 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. కాగా, ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 వరకు మందకొడిగానే సాగింది. అన్ని ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అన్ని బూత్‌ల్లోనూ అధికారులు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

గతం కంటే 3 శాతం పెరుగుదల

కరీంనగర్ నగరపాలక సంస్థలో 2014లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి 3 శాతం ప్రజలు ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో 2,28,872 మంది ఓటర్లు ఉండగా, 1,36,400 (59.59 శాతం) మంది ఓటు వేశారు. కాగా, శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 2,64,134 మంది ఓటర్లకు గానూ 1,65,147 (62.52 శాతం) మంది ఓటు వేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, మొదటి రెండు గంటల్లో 10.08 శాతం, 11 గంటల వరకు 25.11 శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 41.17 శాతం కాగా.. సాయంత్రం 3 గంటల వరకు 51.60 శాతం నమోదైంది. చివరి రెండు గంటల్లో 10.92 శాతం మంది ఓటు వేశారు. మొత్తంగా మధ్యాహ్న సమయంలోనే ఎక్కువగా పోలింగ్ సాగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా అధికారులు మొదటి నుంచి పలు కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించినా నగర ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపనట్లు కనిపిస్తున్నది.