శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 24, 2020 , 04:51:38

బ్రహ్మోత్సవాలకు వేళాయె..

బ్రహ్మోత్సవాలకు వేళాయె..
  • - గంగుల నేతృత్వంలో మూడోసారి వేడుకలు
  • - మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైభవోపేతంగా నిర్వహణకు ఏర్పాట్లు పది రోజులపాటు కార్యక్రమాలు
  • - తిరుమల నుంచి పదివేల లడ్డూలు
  • - భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ, కొండగట్టు నుంచి పూజారులు కేరళ నుంచి ప్రత్యేక వాయిద్య బృందాలు
  • - 31న వైభవంగా కల్యాణం ఫిబ్రవరి 3న శోభాయాత్ర
  • - హాజరు కానున్న చినజీయర్‌ స్వామి, డాలర్‌ శేషాద్రి, తాళ్లపాక హరినారాయణా చార్యులు
  • - నగరానికి కొత్త శోభ విద్యుద్దీపాలు, స్వాగత తోరణాలు, స్వామి వారి భారీ కటౌట్లతో ముస్తాబు
  • - భాగస్వాములు కండి : మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి అంగరంగ వైభవంగా మొదలు కానున్నాయి. మూడోసారి కరీంనగర్‌ మార్కెట్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలను మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పది రోజులపాటు కార్యక్రమాలను వైభవోపేతంగా జరుపనుండగా, ఈ నెల 31న స్వామివారి కల్యాణ మహోత్సవం, ఫిబ్రవరి 3న భారీ శోభాయాత్ర నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. వేడుకల కోసం ఇప్పటికే దేవాలయ  ప్రాంగణమంతా సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలు, స్వామివారి కటౌట్‌లు, స్వాగత తోరణాలతో ప్రధాన దారులు, కూడళ్లను ముస్తాబు చేయగా, నగరం కొత్త శోభను సంతరించుకున్నది.       
- కరీంనగర్‌ ప్రధానప్రతినిధి/కార్పొరేషన్‌ నమస్తే తెలంగాణ

కరీంనగర్‌ ప్రధానప్రతినిధి/కార్పొరేషన్‌ నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ నడిబొడ్డున నిత్య పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడి దేవస్థానానికి 153 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఏకశిలపై వెలిసిన ఈ స్వామికి ఎంతో ప్రాశస్థ్యం ఉన్నది. ఈ బ్రహ్మాండ నాయకుడికి మొదటిసారిగా 2018 ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో ఉత్సవాలను వైభవంగా జరిపారు. అప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన రాగా, 2019 ఫిబ్రవరిలో రెండోసారి నిర్వహించారు. తిరుపతి తిరుమలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వేడుకలను జరిపారు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి హాజరై అభినందించారు. అప్పుడు శోభాయాత్రకు ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో భక్తులు వచ్చారు. ఒక్క కరీంనగర్‌ నుంచే కాకుండా చుట్టుపక్క జిల్లాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే గతంలో రెండు సార్లు ఫిబ్రవరి నెలలో ఉత్సవాలు నిర్వహించగా, ఈసారి మాత్రం నెల రోజుల ముందుగానే జరుపుతున్నారు. గంగుల కమలాకర్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండగా, ఈసారి మరింత అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పా ట్లూ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మంత్రి నేరుగా రంగంలోకి దిగనున్నారు.

రేపటి నుంచే మొదలు..

ముచ్చటగా మూడోసారి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే మొదలు కానున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటలకు అధ్యయనోత్సవంతో ప్రారంభమై, ఫిబ్రవరి 3న జరిగే శోభాయాత్రతో ముగుస్తాయి. అయితే ఈ ఉత్సవాలను పది రోజుల అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులతోపాటు మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్వామి వారి సేవలకు అన్ని రకాల వాహనాలను సిద్ధం చేశారు. నగరంలో హోర్డింగ్‌లు పెట్టించారు. చౌరస్తాలు, ప్రధానదారులు, దేవాలయ పరిసరాలను లైటింగ్‌తో అలంకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణచౌక్‌లో బ్రహ్మాం డ నాయకుడి అతి పెద్ద కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేకాకర్షణగా నిలుస్తుండగా, ఆ దారి వెంట రాత్రి పూట వెళ్లే భక్తులు, అక్కడే ఆగి ఆ కటౌట్‌ను కనులారా తిలకిస్తున్నారు. ఇటు ఉత్సవాలను దిగ్విజయం చేయడానికి విస్తృత ప్రచారం చేస్తున్నారు. పది రోజుల్లో ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుందో వివరిస్తూ ముద్రించిన వేలాది కరపత్రాలను ఇప్పటికే ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానంను మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు.

ఆ మేరకు టీటీడీ నుంచి దేవస్థానానికి పది వేల లడ్డూలను పంపనున్నారు. శోభాయాత్రలో ఈసారి జీయర్‌ స్వామితోపాటు డాలర్‌ శేషాద్రి, అలాగే అన్నమాచార్య 12వ త రం వారసులు తాళ్లపాక హరినారాయణా చార్యు లు పాల్గొననున్నారు. అలాగే భద్రాద్రి, యాదా ద్రి, వేములవాడ, కొండగట్టు దేవస్థానం నుంచి ప్రముఖ పూజారులు వస్తున్నారు. కేరళ నుంచి ప్రత్యేక వాయిద్య కళాకారులను రప్పిస్తున్నారు. ఇందులో మంగళ వాయిద్యం, సింగారి మేళం కళాకారులు రానున్నారు. 31న జరిగే కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడంతోపాటు తిలకించే భక్తులకు ఇబ్బందులూ లేకుండా చూస్తున్నారు. ఏటా నగరంలోని స్వచ్ఛంద సంస్థ లు, ఆధ్యాత్మిక సంస్థలు, నగర పౌరులు స్వచ్ఛందంగా తరలివచ్చి సేవలందిస్తుండగా, ఈసారి కూడా సేవ చేయడానికి ఇప్పటికే రెండు వేల మందికిపైగా సేవకులు ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 3న జరిగే శోభాయాత్రలో వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన అశ్వం, ఏను గు, ఒంటెలు, గోమాతలతో పాటు విభిన్న కళాకారులతో కలిపి యాత్ర నిర్వహించనున్నారు.