సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 20, 2020 , 04:26:17

నేటితో ప్రచారం సమాప్తం

నేటితో ప్రచారం సమాప్తం
  • - సాయంత్రం 5 గంటలకు ముగింపు
  • - వారం రోజులుగా ఉధృతంగా క్యాంపెయిన్‌
  • - ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన
  • - అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకెళ్లిన అభ్యర్థులు
  • - మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు రాష్ట్ర నాయకుల ప్రచార జోరు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పరి సమాప్తం కానుండడంతో అభ్యర్థులు, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నామినేషన్‌ ఉప సంహరణ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు గడపగడపకూ తిరుగుతున్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతుండగా.. సోమవారం ప్ర చారం సమాప్తం కానుంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఇవి దాదాపు చివరి ఎన్నికలు కావడంతో బల్దియాల్లో సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచగా, వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలను  తలపించేలా ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నుంచే అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. నేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు కూడా భాగస్వాములు అవుతున్నారు. టీఆర్‌ఎస్‌కు భారీ సంఖ్యలో చేరికలు కూడా కలిసొస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌ అన్ని మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగరేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నా రు. కాగా.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలు అసెం బ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీలను క్లీన్‌స్వీప్‌ చేయాలనే కేసీఆర్‌ ఆలోచనల మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఏకగ్రీవమైన ఐదు కూడా టీఆర్‌ఎస్‌వే కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి. పోరులో ఉన్న అభ్యర్థులు అంతా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా తమ ప్రచారం సాగిస్తున్నారు. వాహనాలకు మైకులు కట్టి ప్రచారం చేయడంతోపాటు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

రంగంలోకి ముఖ్యనేతలు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రజాప్రతినిధులు, నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వేములవాడ, సిరిసిల్లలో శనివారం మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. జిల్లాలో ఏకగ్రీవమైన ఐదులో నాలుగూ సిరిసిల్లవే కావడం గమనార్హం. ఎమ్మెల్యే రమేశ్‌ బాబు, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కూడా గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో భారీగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, ఇతర నేతలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర తదితరులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రచార సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ  ప్రణాళికాబద్ధంగా ముందుకు కదులుతున్నారు.

మిగతా పార్టీల్లో కనిపించని జోరు

రెండు మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా మిగ తా పార్టీల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వారికి కనీసం ప్రజల్లోకి వెళ్లే సమ యం కూడా లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇక జాతీయ పార్టీ అయిన సీపీఐ ఒకటి, రెండు చోట్లకు పరిమితమైంది.

సాయంత్రం 5 గంటలకు ముగింపు: కలెక్టర్‌

కలెక్టరేట్‌ : మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 22న ఉన్న నేపథ్యంలో 20వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అధ్యక్షులు, వారికి సంబంధించిన ఏజెంట్లు ఏ విధమైన ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు, మైకు లు, లౌడ్‌స్పీకర్లు, ప్రచార రథాలు, రాజకీయ పరమైన చరవాణి మెసేజ్‌లు, వాట్సాప్‌ నుంచి బల్క్‌ మెసేజ్‌లు, సంక్షిప్త సందేశాలను ఎన్నికల నియమావళి ప్రకారం పూర్తిగా నిషేధించబడతాయని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. 20వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు రాజకీయపరమైన ప్రచారాలు నిలిపివేయాలనీ, రాజకీయ ప్రచారాలు చేసేందుకు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు 20న సాయంత్రం ఆయా మున్సిపాలిటీలను వదిలి వెళ్లిపోవాల్సిందిగా  కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ ముగిసేంత వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధితోపాటు మున్సిపాలిటీల సరిహద్దు నుంచి రెండు కిలోమీటర్ల మేర అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సదరు విషయాలను అతిక్రమిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. పోలింగ్‌ రోజు ముందు రోజు ప్రచురితమయ్యే ప్రింట్‌ మీడియా ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా రేపు సాయంత్రం 5.00 గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలూ నిర్వహించకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు.