మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Jan 15, 2020 , 03:51:44

బరిలో 274 మంది!

బరిలో 274 మంది!


వేములవాడ, నమస్తేతెలంగాణ/సిరిసిల్ల టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లలో చివరి ఘట్టమైన ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణలో పలు వార్డులకు చెందిన కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల బల్దియాలో ఇప్పటికే ఒక స్థానం ఏకగ్రీవం కాగా, చివరి రోజున 3 వార్డులు ఏకగ్రీవయ్యాయి. దీంతో మొత్తం 39 వార్డులకు గాను, నాలుగు ఏకగ్రీవం కాగా, మిగతా 35 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆ 35వార్డులకుగానూ 148మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య ప్రకటించారు. పార్టీల వారీగా టీఆర్‌ఎస్‌-35, బీజెపీ 25, కాంగ్రెస్‌-20, సీపీఐఎం 04, టీడీపీ 01, స్వతంత్య్ర62 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఆయన వివరించారు. మూడ్రోజులుగా జరిగిని నామినేషన్ల ఉపసంహరణలో తొలిరోజు 34వ వార్డులో దార్ల కీర్తన, చివరి రోజున 5వ వార్డులో దార్నం అరుణ, 19వ వార్డులో అన్నారం శ్రీనివాస్‌, 36వ వార్డులో కల్లూరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే కావడం గమనార్హం.

వేములవాడలో 126మంది..

వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల బరిలో 126మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బల్దియా పరిధిలో మొత్తం 28వార్డులు ఉన్నాయి. ఆయా వార్డులకుగాను మొత్తం 311 నామినేషన్లు దాఖాలయ్యాయి. ఇందులో గత ఎన్నికల్లో లెక్కలు ఎన్నికల అధికారికి సమర్పించని కారణంగా స్క్రూటీలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా మంగళవారం రోజున 182 నామినేషన్లను పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో నాంపల్లి పరిధిలోని ఆరో వార్డులో నీలం కల్యాణిశేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 27వార్డుల్లో 126మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు.

రెండువార్డుల్లో డబుల్‌ బ్యాలెట్‌ పత్రం

వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని ఎన్నికల్లో రెండు వార్డుల్లో డబుల్‌ బ్యాలెట్‌ పత్రాన్ని అధికారులు ఓటర్లకు అందించనున్నారు. బ్యాలెట్‌ పత్రంలో ఏడుగురు అభ్యర్థులకు గుర్తులు, 1 నోటాతో కలిపి 8మాత్రమే ఉండే అవకాశముంది. అయితే వేములవాడ పురపాలక సంఘంలోని 13వ వార్డులో 8మంది, 20వ వార్డులో పదిమంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు వార్డుల్లో బ్యాలెట్‌ పత్రం డబుల్‌ పేపర్‌ను ముద్రించే అవకాశముంది. నామినేషన్ల పత్రాల ఉపసంహరణ గడువు ముగియడంతో పార్టీల వారీగా బిఫామ్‌లు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఆయా పార్టీలు అందజేశాయి. మిగిలిన స్వతంత్య్ర అభ్యర్థులకు కూడా అధికారులు ఎన్నికల గుర్తులను కేటాయించారు.

బ్యాలెట్‌ పత్రంలో నోటా

పురపాలక సంఘం ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహిస్తుండగా గడిచిన ఎన్నికల మాదిరిగానే అందులోనూ బ్యాలెట్‌ పత్రంలో నోటాను ఎన్నికల అధికారులు పొందుపరచనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే నోటాను పొందుపరిచిన అధికారులు ఈ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ నోటాను బ్యాలెట్‌ పత్రంలో చివరన ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎవరూ కూడా నచ్చకపోతే నోటాకు ఓటరు ఓటువేసే అవకాశం ఉంటుంది.logo