శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jan 13, 2020 , 03:54:07

గుర్తును ఇలా కేటాయిస్తారు..

గుర్తును ఇలా కేటాయిస్తారు..
(సిరిసిల్ల, నమస్తే తెలంగాణ): ఓటరు ‘గుర్తు’ంచుకోవడానికి ఎన్నికల సంఘం అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించే విధానం ఈ విధంగా ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కు ముందుగా కేటాయిస్తారు. ఆ తర్వాత స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయిస్తారు. ఈ కేటాయింపును మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి విభాగంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీ  లేదా ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకు, రెండో ప్రాధాన్యంలో శాశ్వత గుర్తుల్లేని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ అయిన పార్టీలు, చివరగా పోటీ చేసిన స్వతంత్య్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. తెలుగు అక్షర మాల క్ర మంలో గుర్తులను కేటాయిస్తారు. నామినేషన్‌ పత్రంలో ఇంటిపేరు, అభ్యర్థి పేరు ఏది మొ దలు రాస్తే దాని ఆధారంగా బ్యాలెట్‌ పత్రంలో పేర్లు గుర్తులు ఉంటాయి. ఈ నెల 14 ఉపసంహరణల అనంతరం ఎన్నికల అధికారులు వెంటనే గుర్తులు కేటాయించి ప్రకటిస్తారు.

ప్రిసైడింగ్‌ అధికారి డైరీ సమర్పించాలి..

పురపాలక ఎన్నికల్లో నిర్వహణ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రిసైడింగ్‌ అధికారులకు డైరీలను అందిస్తున్నారు. పోలింగ్‌కేంద్రంలో జరిగే ప్రతి అంశంతో పాటు సామగ్రి వివరాలకు సంబంధించిన 24 పేజీలను పూర్తిచేసి పోలింగ్‌ ముగిసిన తర్వాత  సామగ్రితో పాటు ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి సంఘటలను జరిగినా విధిగా అందు లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రం, సిబ్బంది, బ్యాలెట్‌ పెట్టెలు, పేపర్‌ సీళ్లు, ఏజెంట్లు, బ్యాలెట్‌ పత్రాలు, చాలెంజ్‌ ఓట్లు, టెండర్‌ ఓటు , కోడ్‌ ఉల్లంఘన, శాంతిభద్రతల పరిరక్షణ, పొరపాట్లు, అవకతవకలు, తదితర అంశాలను డైరీలో నమోదు చేసి ఎన్నికల అధికారులకు అందివ్వాల్సిన బాధ్యత ప్రిసైడంగ్‌ అధికారిదే.

20 ఏళ్ల తర్వాత పురపోరులో ‘బ్యాలెట్‌'

దాదాపు 20 ఏళ్ల తర్వాత పురపాలక ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలతో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఈవీఎం యంత్రాలతో ఓటుహక్కును వినియోగించుకున్న పట్టణ ఓటర్లు ఈ సారి పురపాలక ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల ద్వార ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామాల్లోని ఓటర్లు బ్యాలెట్‌ ద్వారానే ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణంలో పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు లేనందున వారికి అవకాశం రాలేదు. 2005, 2014 సంవత్సరాల్లో జరిగిన పుర పాలక ఎన్నికల్లో ఈవీయం యంత్రాలనే వినియోగించారు. వాటికన్నా ముందు 2000 సంవత్సరంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్‌ పెట్టెలను వాడారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పట్టణ ఓటరు బ్యాలెట్‌ పత్రాలతో ఓటు హక్కును  ఈ నెల 22న వినియోగించుకోనున్నారు.

ఆయుధం అప్పగించాల్సిందే...

లైసెన్స్‌ పొందిన తుపాకులను ఎన్నికల వేళల్లో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి ఎలక్షన్ల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ఈ మేరకు నిబంధనలను విధించింది. ఎన్నికల వేళ ఓటర్లను ఆయు ధం చూపి భయభ్రాంతులకు గురిచేసే ప్రమాదం ఉంటుందని ఈ నిబంధనలు అమలు చేశారు. ఆయుధాలు కలిగిన వ్యక్తులు తమ తుపాకులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాలి.

సౌండ్‌ పెరిగితే.. దండన తప్పదు

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచార పర్వం ఉపందుకోనుంది. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. పాటలు, ప్రసంగాలతో హోరెత్తించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైకులతో ప్రచారం చేయడానికి కూడా ఎన్నికల కమిషన్‌ నిబంధనలు విధించింది. అందుకు స్పష్టమైన ఆదేశాల అమలుకు ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశిత ధ్వని కన్నా తీవ్రత పెరిగితే సదరు పార్టీలపై కేసులు నమోదు చేయడానికి వీలుంది. అభ్యర్థులు జాగ్రత్త పడకుంటే ఫిర్యాదులతో ఇబ్బందులు పాలుకాక తప్పదు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.


బ్యాంక్‌ లావాదేవీలపై కన్ను..

పురపాలక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఆర్థిక పరమైన అంశాలపై పోలీసులు ఎన్నికల అధికారులు కన్నేశారు. పోటీదారులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు  కానుకలు, మద్యం, తదితరలతో పాటు నగదు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు డబ్బులు వచ్చే మార్గాలపై అధికారులు దృష్ఠి పెట్టారు. ముఖ్యంగా బ్యాంక్‌ల నుంచి ఎవరు ఎంత మొత్తంలో డబ్బులు  డ్రా చేస్తున్నారనే అంశంపై ఎన్నికల అధికారులు ఆరా తీస్తారు. పెద్ద మొత్తం డబ్బులు పట్టుబడితే, ఆధారాలు చూపకుంటే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.

ఓటు రకాలు...

ఎన్నికల్లో ఐదు రకాలు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
- ఓటు హక్కు కలిగిన వ్యక్తి నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడాన్ని సాధారణ ఓటుగా వ్యహరిస్తారు.
- ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ స్వగ్రామాల్లో ఓటు వేయడానికి వీలు ఉండదు. వీరు పోస్టర్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు.
-దేశ సైనికులు, పారామిలిటటీ ఉద్యోగులు సొంత ప్రాంతాలకు దూరంగా ఉంటారు, వీరు సర్వీస్‌ ఓటు వేస్తారు.
- ఓటరు జాబితాలో పేరుండి, తాము పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే సరికి తమ ఓటు వేరొకరు వేసినట్లయితే అసలైన ఓటరుకు టెండర్‌ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు.
- ఇంటెలిజెన్స్‌, గూడాచారి సిబ్బంది ప్రత్యక్షంగా ఓటు వేయలేరు. వారు ప్రాక్సీ ఓటు పేరిట తమకు బదులుగా వేరొకరిని పంపి ఓటు హక్కు వినియోగించుకుంటారు.

ధ్వని ఏ ప్రాంతంలో ఎన్ని డెసిబుల్స్‌ ఉండాలో ఈ పట్టికలో చూడండి..

ప్రదేశం                డెసిబుల్స్‌
న్యాయస్థానాలు, వైద్యశాలలు, విద్యాలయాలు    40-50
నివాస ప్రాంతాలు            45-55
వ్యాపార ప్రాంతాలు            55-65
పారిశ్రామిక ప్రాంతాలు        70-75


logo