శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 12, 2020 , 03:49:18

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల పరిశీలన
  • -వయస్సు అనర్హతతో సిరిసిల్లలో ఒకటి తిరస్కరణ
  • -గత ఎన్నికల ఖర్చులను వెల్లడించని కారణంతో వేములవాడలో రెండు..
  • -ఈ నెల 14న ఉపసంహరణ
  • -పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌
వేములవాడ నమస్తే తెలంగాణ/సిరిసిల్ల టౌన్‌: పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఎన్నికల అధికారులు వార్డుల వారీగా నామినేషన్లను పరిశీలించారు. నియమావళికి అనుగుణంగా లేని పలు నామినేషన్లను తిరస్కరించారు. సిరిసిల్ల మున్సిపల్‌లో 39వార్డులకు గాను 236మంది అభ్యర్థులు 419 నామినేషన్లను దాఖలు చేశారు. ఆ పత్రాలను వార్డుల వారీగా అధికారులు పరిశీలించారు. ఉదయం 1వ రౌండ్‌లో వార్డు నంబర్‌ 1, 4, 7, 10, 13, 16, 19, రెండో రౌండ్‌లో 22,25,28,31,34,37 వార్డుల, మూడో రౌండ్‌లో 2, 5, 8, 11, 14, 17, 20 వార్డుల, మధ్యాహ్నం నిర్వహించిన నాల్గవ రౌండ్‌లో 23, 26, 29, 32, 35, 38, ఐదో రౌండ్‌లో 3, 6, 9, 12, 15,18, 21, ఆరో రౌండ్‌లో 24, 27, 30, 33, 36, 39 వార్డుల్లో దాఖలైన నామినేషన్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వయసు   అనర్హత కారణంగా 12వ వార్డులో ఓ యువకుడు వేసిన రెండు నామినేషన్‌ పత్రాలను అధికారులను తిరస్కరించారు. మిగతా 417నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అంతకుముందు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నామినేషన్‌ పరిశీలన కేంద్రాన్ని సందర్శించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

వేములవాడలో రెండు..

వేములవాడ పురపాలక సంఘంలో దాఖలైన మొత్తం నామినేషన్లలో రెండు తిరస్కరణకు గురైనట్లు సహాయ ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని మొత్తం 28 వార్డులకుగానూ 203మంది అభ్యర్థులు 311 నామినేషన్లను దాఖలు చేశారు. అందులో 15వ వార్డులో అరుణ, 16వ వార్డులో వోటరికారి బాలయ్యకు సంబంధించిన నామినేషన్లను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో పోటీచేసి అందుకు సంబంధించిన లెక్కలను దాఖలు చేయనందున వారి నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వెల్లడించారు. ఇక మొత్తంగా 202మంది అభ్యర్థులు వేసిన 309 నామినేషన్లు ఆమోదం పొందాయని అధికారి స్పష్టం చేశారు.

14న ఉపసంహరణ..

నామినేషన్ల పరిశీలన ప్రకియ ముగిసింది. ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగింది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించి, ఆ వెంటనే వారికి గుర్తులను కేటాయించనున్నారు. మరుసటి రోజు నుంచి ఆయా అభ్యర్థులు ప్రచారంలో దిగనున్నారు. అనంతరం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 22న బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ను, 25న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటించాల్సి ఉండగా, అందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విధులకు హాజరయ్యే ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.