ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jan 10, 2020 , 11:07:56

భావి జీవితానికి నవోదయం

భావి జీవితానికి నవోదయం

చొప్పదండి, నమస్తేతెలంగాణ: ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, ఉత్తమ విలువలు, నైపుణ్యం, దేశభక్తి, క్రీడలు ఇలా అన్నింటికి పెట్టింది పేరు చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయం. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు కార్పొరేట్‌కు దీటుగా విద్యా బోధన చేస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈనెల 11న పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 7,551 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

ఉజ్వల భవిష్యత్‌కు పునాది
కేంద్ర ప్రభుత్వం 1986లో జాతీయ విద్యా విధానం అనుసరించి జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. 29 రాష్ర్టాల్లో 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యాలయాల్లో ప్రతిష్టాత్మకమైంది.. చొప్పదండి నవోదయ విద్యాలయం. ఈ విద్యాలయంలో సీటు వస్తే విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసినట్టే. ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యాబోధన చేస్తారు. ఇక్కడ బాలబాలికలకు వేర్వేరు వసతి గృహాలు, సౌకర్యాలు ఉన్నాయి.

రిజర్వేషన్లు ఇలా...
విద్యాలయంలో ప్రవేశానికి 80 సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతం, 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 3 శాతం దివ్యాంగులకు, బాలికలకు 1/3 వంతు రిజర్వేషన్ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ మార్కుల ఆధారంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు.

పరీక్ష విధానం...
నవోదయ ప్రవేశ పరీక్షను ఉమ్మడి జిల్లాలో 14 బ్లాకుల్లో నిర్వహిస్తారు. పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగంలోనూ లఘు ప్రశ్నలుంటాయి. 100 మార్కులకు 80 ప్రశ్నలుంటాయి. మేధాశక్తిపై 40 ప్రశ్నలకు 50 మార్కులు (60 నిమిషాల కాలవ్యవధి), గణితంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు (30 నిమిషాల కాలవ్యవధి), భాషా విభాగంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు(30 నిమిషాల కాలవ్యవధి). మొత్తం 2 గంటల సమయంలో మూడు విభాగాల్లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. మేధాశక్తి పరీక్షలో ప్రశ్నలు బొమ్మల రూపంలో ఉంటాయి. గణితంలో అంకెలు, సంఖ్యా పద్ధతి, భిన్నాలు, గుణకాలు, కాలం, వేగం, దశంశాలు, కొలతలు, దూరం, లాభనష్టాలు, వడ్డీ వ్యాపార గణితం, వైశాల్యం, చుట్టుకొలతలపై ప్రశ్నలుంటాయి. జవాబులు గుర్తించడానికి ప్రత్యేక సమాధాన పత్రం (ఐసీఇఆర్/ఓసీఆర్) ఇస్తారు. జవాబులు గుర్తించడానికి బాల్‌పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఒకసారి సమాధానం రాసిన తర్వాత దిద్దుట, కొట్టివేయుట చేస్తే అనుమతించరు.

మైగ్రేషన్ విధానం...
విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాల్లో మైగ్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చొప్పదండి నవోదయ విద్యాలయం నుంచి ప్రతి సంవత్సరం 9వ తరగతి చదివే విద్యార్థుల్లో 22 మందిని జార్ఖాండ్ రాష్ట్రంలోని సాహెబ్‌ఘంజ్ జిల్లా కేంద్రంలో గల జవహర్ నవోదయ విద్యాలయానికి పంపిస్తారు. అక్కడి విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తారు.

6వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య...
నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి నుంచే కంప్యూటర్ విద్య బోధిస్తారు. విద్యార్థులు చదువుకునేందుకు గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 50 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

ఉన్నత స్థాయిలో పూర్వ విద్యార్థులు
జవహర్ నవోదయ విద్యాలయంలో చదివిన విద్యార్థులు వివిధ జిల్లాలు, రాష్ర్టాలు, దేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి కలెక్టర్ స్థాయి వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. తాము చదువుకున్న విద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నారు.


logo