శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 10, 2020 , 11:07:21

నాటి ఈదులపల్లె.. నేటి హుజూరాబాద్

నాటి ఈదులపల్లె.. నేటి హుజూరాబాద్

హుజూరాబాద్‌టౌన్: నేటి హుజూరాబాద్ పట్టణం 17వ శతాబ్దం వరకు ఈదులపల్లె గ్రామంగా వెలుగొందింది. కాకతీయ సామ్రాజ్యంపై మొగల్ రాజులు దాడులు జరుపుతున్న సందర్భంలో ఈ ప్రాంత వాసులు వలస వెళ్లారు. అప్పటి చిలుకవాగు సమీపంలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకొని ఎదులాపురం గ్రామాన్ని నిర్మించుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి రంగనాయకుల గుట్ట వద్ద గల శివాలయం సమీపంలోని విష్ణువు ఆలయం, నవగ్రహాల ప్రతిష్టతో పాటు స్నానాల గుండాన్ని ఎదులాపురం వాసులు నిర్మించుకున్నట్లు నేటికీ ఆనవాళ్లు లభిస్తున్నాయి.. కాలక్రమేణా ఎదులాపురం కాస్త ఈదులపల్లెగా మారింది. అయితే నిజాం పాలకులు ఎదులాపురం పేరును హుజూరాబాద్‌గా మార్పు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో పాటిపై ఉన్న ఈదులపల్లె గ్రామానికి చెందిన చారిత్రాతక చిహ్నాలు బయట పడ్డాయి.. ఆధారాలను భద్రపరచడంలో గత పాలకులు అశ్రద్ధ వహించడంతో రానురానూ కనుమరుగయ్యాయి. ఈ ప్రాంతంలోని భూ అంతర్భాగంలో నేటికీ నిధి నిక్షేపాలు ఉన్నట్లు ప్రచారం సాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో మరికొన్ని ఆలయాలను భక్తులు నిర్మించడం విశేషం.

రంగనాయకులగుట్టకు ప్రత్యేక ప్రాచుర్యం
హుజూరాబాద్ గ్రామ పొలిమేరలోని రంగనాయకులగుట్ట ప్రాంతం ప్రత్యేక ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను ఇక్కడే నిర్వహించడం ఆనవాయితీ. జాతర సమయంలో వేల సంఖ్యలో భక్తులు సమ్మక్క-సారలమ్మ దర్శనం అనంతరం ఇక్కడి చారిత్రక ఆలయాలకు వెళ్తుంటారు. హుజూరాబాద్‌లోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతం వరకు ఎదులాపురం గ్రామంగా పిలుస్తుండేవారనీ, నిజాంల కాలంలో హుజూరాబాద్‌గా నామకరణం చేసినట్లు పలువురు చెబుతున్నారు. నిజాం ప్రభుత్వ ఏజంట్‌గా పని చేస్తున్న ఆబాద్ అనే వ్యక్తి హుజూరాబాద్‌గా ప్రచారంలోకి తెచ్చాడు. ఈదులపల్లె ఎదులాపురంగా మారిన హుజూరాబాద్‌లో ఇప్పలనర్సింగాపూర్, బోర్నపల్లి, పెద్దపాపయ్యపల్లి, రంగాపూర్, రాంపూర్ కలిసే ఉండేవి. అనంతరం గ్రామాలన్నీ విడిపోవడంతో హుజూరాబాద్ 2011కు ముందు మేజర్ గ్రామ పంచాయతీగా మిగిలిపోయింది. 2011 సెప్టెంబర్3న నగర పంచాయతీగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించాక 45 వేల జనాభా దాటిన ప్రస్తుత హుజూరాబాద్ పట్టణం, దాని చుట్టుపక్కల గ్రామాలైన కొత్తపల్లి, బోర్నపల్లి, ఇప్పలనర్సింగాపూర్, దమ్మక్కపేట గ్రామాలను కలుపుకొని ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది.

పారిశ్రామిక ప్రాంతంగా..
హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రం దినదినం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం పరిశ్రమల కేంద్రంగా విరాజిల్లుతున్నది. తెలంగాణ ఏర్పడక ముందు నామమాత్రంగా మిల్లులతో ఉన్న హుజూరాబాద్ ప్రాంతం ప్రస్తుతం పాతిక రైస్, స్ట్రీమ్ రైస్ మిల్లులతో పాటు విత్తన శుద్ధి కేంద్రాలు, డెయిరీ ప్లాంట్లు, క్రషర్ పరిశ్రమలకు నిలయంగా మారింది. 1986లో పట్టణం నడిబొడ్డున తొలిసారిగా సాంబశివ, లక్ష్మీనర్సింహ రైస్‌మిల్లులను దివంగత గనిశెట్టి లచ్చయ్య, కటకం సత్యనారాయణ నెలకొల్పారు. దీంతో రైతులు పండించిన ధాన్యం ఇక్కడే విక్రయించుకునే అవకాశం లభించింది. ప్రస్తుతం ఉన్న మిల్లుల్లో నాణ్యమైన విత్తన వడ్లను సైతం ఇక్కడే శుద్ధి చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబంగా, గుజరాత్, ఒరిస్సా, హర్యానా వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సుమారు పాతికకుపైగా రైస్‌మిల్లులు, 15 పారాబాయిల్డ్, స్ట్రీమ్ రైస్‌మిల్లులు వెలిశాయి. అలాగే 25 వరకు సీడ్ ప్లాంట్లు ఏర్పడ్డాయి. దీంతో సుమారు వందలాది కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం పర్కాలక్రాస్ రోడ్ వద్ద, చెల్పూర్ శివారులో డెయిరీ కేంద్రాలు నెలకొల్పడంతో రైతులు పాడిపై దృష్టిపెట్టి ఆర్థికాభివృద్ధి సాధించారు. వరంగల్-కరీంనగర్ పట్టణాలకు సమాన దూరంలో హుజూరాబాద్ ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి చాలా మంది వ్యాపారవేత్తలు ఉత్సుకత చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఏడాదికే పట్టణంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పారు. అంతేకాకుండా అనేక ప్రైవేట్ సంస్థలకు చెందిన ఆర్థిక పరమైన ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీలను స్థాపించారు. కార్లు, ట్రాక్టర్ల షోరూమ్‌లు, రెస్టారెంట్లు, తదితర వ్యాపార, వాణిజ్య సంస్థలను నెలకొల్పారు. ఏదేమైనా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న హుజూరాబాద్ జిల్లాలోనే ఒక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని చెప్పవచ్చు.

మేజర్ గ్రామ పంచాయతీ నుంచి..
ఆరు దశబ్దాల క్రితం ఎదులాపురం గ్రామంలో సుమారు ఐదు వేల జనాభా, 2500 మంది ఓటర్లు ఉండేవారు. 1952 నుంచి 64 వరకు హుజూరాబాద్ టౌన్ మున్సిపాలిటీగా కొనసాగేది. అప్పుడు దీని పరిధిలో ఇప్పలనర్సింగాపూర్, బోర్నపల్లి, పెద్దపాపయ్యపల్లి, రంగాపూర్, రాంపూర్ గ్రామాలు కలిసి ఉండేవి. 1965లో కొత్త గ్రామ పంచాయతీ చట్టం తీసుకురాగా, విలీన గ్రామాలన్నీ విడిపోవడంతో హుజూరాబాద్ మేజర్ పంచాయతీగా అవతరించింది. అప్పుడు మొట్ట మొదటిసారిగా 1964 నుండి 1984 వరకు బహునూతుల జగన్నాథనాయుడు సర్పంచ్‌గా కొనసాగారు. అనంతరం క్రమంగా గనిశెట్టి లచ్చయ్య, పిల్లలమర్రి సుదర్శన్, ప్రతాప శ్రీనివాస్, గనిశెట్టి భానుషా సర్పంచులుగా పని చేశారు. అయితే భానుషా ఏడాది పాలన ఉందనగానే రాజీనామా చేసి వెళ్ల్లడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అపరాజ రమాదేవి సర్పంచ్‌గా గెలచి ఏడాది పాటు కొనసాగారు.

2011లో నగర పంచాయతీగా..
2011 సెప్టెంబర్ 3న హుజూరాబాద్ పట్టణం నగర పంచాయతీగా అవతరించగా కమిషనర్ల ద్వారా ప్రత్యేక పాలన కొనసాగింది. అప్పటి వరకు 35 వేల జనాభా, 16 వేల ఓటర్లు ఉన్నారు. 2014 మే నెలలో ఎన్నికలు నిర్వహించగా, చైర్మన్ సీటు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. వడ్లూరి విజయ్‌కుమార్ హుజూరాబాద్ చైర్మన్‌గా నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగారు. చివరి ఏడాదిలో మంద ఉమాదేవి చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2018 మార్చి 23న హుజూరాబాద్ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలైన కొత్తపల్లి, బోర్నపల్లి, ఇప్పలనర్సింగాపూర్, దమ్మక్కపేట విలీనం కాగా, ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం మొత్తం ఓటర్లు 25,939 మంది కాగా, ఇందులో పురుషులు 12,942 మంది, మహిళలు 12997 మంది ఉన్నారు. బీసీలు 16597, ఎస్సీలు 4823, ఎస్టీలు 233 మంది, ఓసీలు 4286 మంది ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో మహిళల నుంచి పోటీ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.