బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 10, 2020 , 11:06:51

రెండో రోజు 158 నామినేషన్లు

రెండో రోజు 158 నామినేషన్లు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో రెండో రోజు నామినేషన్లు పెద్దసంఖ్యలో దాఖలయ్యాయి. గురువారం 86 వార్డులకు 158 వచ్చాయి. జమ్మికుంటలో 30, హుజూరాబాద్‌లో 30, చొప్పదండిలో 14, కొత్తపల్లిలో 12 వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో వెల్లువలా వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండో రోజు నామినేషన్లు ఊపందుకున్నాయి. బుధవారం 28 వార్డులకు 41 రాగా, గురువారం 86 వార్డులకు 158 దాఖలయ్యాయి. శుక్రవారం ఆఖరు కావడంతో పెద్ద సంఖ్యలో రానున్నాయి. ఇటు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఫారాలు అందించారు. కొన్ని చోట్ల ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, నేడు అన్ని మున్సిపాలిటీల పరిధిలో బీఫారాలు అందించనున్నారు.

-జమ్మికుంటలో 66 నామినేషన్లు దాఖలు కాగా టీఆర్‌ఎస్ నుంచి 36, బీజేపీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 8, ఎంఐఎం నుంచి 1, టీడీపీ నుంచి 1, ఇండిపెండెంట్లుగా మరో 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
-హుజూరాబాద్‌లో 66 నామినేషన్లు దాఖలు కాగా టీఆర్‌ఎస్ నుంచి 32, బీజేపీ నుంచి 16, కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్లుగా మరో 9 నామినేషన్లు దాఖలయ్యాయి.
-చొప్పదండి మున్సిపాలిటీలో 13 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో టీఆర్‌ఎస్ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 4, బీజేపీ నుంచి 1, ఇండిపెండెంట్లుగా మరో 4 నామినేషన్లు వచ్చాయి.
-కొత్తపల్లి మున్సిపాలిటీ నుంచి 13 నామినేషన్లు దాఖలు కాగా టీఆర్‌ఎస్ నుంచి 7, బీజేపీ నుంచి 2, ఇండిపెండెంట్లుగా మరో 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
సందేహాలను నివృత్తి చేసుకోండి
- వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి శశాంక

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా వెంటనే పై అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గురువారం రాత్రి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ పలు సూచనలు చేశారు. నామినేషన్ స్వీకరణ ఫారాలు పూర్తిగా పరిశీలించే వరకు అధికారులందరూ కార్యాలయంలోనే ఉండాలన్నారు. ఇతరులతో ఏ అభ్యంతరం లేనంత వరకు ప్రతి నామినేషన్ స్వీకరించాలన్నారు. ఎన్నికల ఖర్చులకు సంబంధిత అభ్యర్థి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోవాలనీ, ప్రతీ ఖర్చు ఖాతా నుంచి చేసేలా హామీ పత్రాలను తీసుకోవాలని సూచించారు. అభ్యర్థి నామినేషన్ పత్రాలను సిబ్బంది నింపవద్దనీ, కేవలం మార్గదర్శనం చేయాలన్నారు. కొత్త మున్సిపల్ ఎన్నికల చట్టం ప్రకారం రేషన్ డీలర్లు ఎన్నికల్లో పోటీ చేయవచ్చనీ, దానికి ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి తమకు ఇచ్చిన హ్యాండ్ బుక్‌లను క్షుణ్నంగా చదవాలనీ, అందులోనే అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్లు, మున్సిపల్ ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.