e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home కరీంనగర్ కూలీకి వెళ్లిన చోట సాగు బాట

కూలీకి వెళ్లిన చోట సాగు బాట

  • చీకటి బతుకుల్లో వెలుగులు
  • దళితుల తలరాత మార్చిన భూపంపిణీ పథకం
  • సింగారంలో ఐదుగురికి, దుమాలలో ముగ్గురికి లబ్ధి
  • పని చేసిన ఊరిలోనే పంటల సాగు

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్‌ 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఆకారపు లక్ష్మి, తంగళ్లపల్లి రాజవ్వ, ద్యాగల వినోద, దోర్నాల ఎల్లవ్వ, బొమ్మడి దేవవ్వ, దుమాల గ్రామానికి చెందిన సోమారపు రామవ్వ, తాళ్లపెళ్లి సాయవ్య, రామిండ్ల కళవ్వ నిరుపేద దళితులు. పనికి వెళ్తేనే కుటుంబాలు గడిచేది..లేదంటే పస్తులుండాల్సిన దుస్థితి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు దాటినా వీరి తలరాతలు మారలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు మూడెకరాల భూ పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ స్కీం కింద వీరికి ఉన్న ఊరిలోనే మూడెకరాల చొప్పున అందజేసింది. 2018 ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని లబ్ధిదారులకు అప్పటి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ ఆరేండ్లలో తమకు సర్కారు ఇచ్చిన భూమిలో వరి, పత్తి, కూరగాయల పంటలు వేసుకుంటూ దర్జాగా బతుకులు వెళ్లదీస్తున్నారు. రైతుబంధు కింద ఏటా రూ. 30 వేలు అందుతున్నాయి. రెండు నెలల కిందట మంత్రి కేటీఆర్‌ వీరికి రైతుబంధు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే రైతుబీమాలో తమ పేర్లు నమోదు చేసుకొని భవిష్యత్‌పై ధీమాగా ఉన్నారు. ఇన్నాళ్లు తమవి కూలీ బతుకులేనని బాధపడ్డ దళితబిడ్డలు నేడు ఆత్మగౌరవంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఎట్ల బతుకుతమో అనుకున్నం
‘ముందుముందు ఎట్లబతుకుతమో అనుకున్నం. బిడ్డ పెండ్లి జేసిన. ఆమెకు బిడ్డ పుట్టినంక మా అల్లుడు సచ్చిపోయిండు. ఇంటిమీదనే ఉంటుంది ఆమెను ఎట్లసాదుడు. మేము ఎట్ల బతుకుడు అనుకున్నం. కేసీఆర్‌ సారు కడుపు సల్లగుండ మాకు ఇంత భూమి ఇచ్చి ఆదుకుండు. మూడు ఎకరాల భూమి మా భార్య రాజవ్వ పేరుమీద ఇచ్చిర్రు అండ్ల వరి పంట ఏసిన ఇప్పుడు కొంత అల్లరలేకుంట అయ్యింది. బతికున్నంతకాలం కేసీఆర్‌ సారును మరిసి పోలేం’
-తంగళ్లపల్లి రాజయ్య సింగారం (ఎల్లారెడ్డిపేట)

- Advertisement -

ఏ ప్రభుత్వం మా కోసం ఆలోచించలేదు..
ఇన్నేండ్ల నుంచి గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్ల కోసం వాడుకొని వదిలేసినయ్‌. కూలీనాలి జేసుకుని మా అవ్వ రామవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది. గుంటెడు భూమిలేని మాకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మా అవ్వ పేరుమీద రెండున్నరెకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చింది. ఇప్పుడు వరిపంట ఏసినం. ఇప్పుడు ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని చెప్పడం సంతోషమనిపించింది.
-సోమారపు శరవింద్‌, దుమాల (ఎల్లారెడ్డిపేట)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement