జీవ సంబంధ కీటక నాశనుల తయారీ

Thu,November 7, 2019 12:09 AM

neem
ఈమధ్య పంటల్లో రసాయన పురుగు మందులు విచక్షణారహితంగా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. కాలుష్యం పెరిగిపోతున్నది. పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. అలాగే పంటలకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువై రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కాబట్టి మన పొలం దగ్గర మనమే జీవ సంబంధిత కీటక నాశనులు తయారుచేసుకోవచ్చు. దీనివల్ల ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా పురుగు మందుల అవశేషాలు లేని పండ్లు, కాయగూరలను ఉత్పత్తి చేసి, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరుచడంలో దోహదపడుతుంది. పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతుంది.

వేప విత్తన కషాయ ద్రావణం(5 శాతం)

- మొదటగా 500 గ్రాముల ఎండిన వేప గింజలను ఏరి మెత్తగా నూరి పొడిగా చేసుకోవాలి.
- ఆ తర్వాత 50 గ్రాముల పొడిని ఒక మస్లిన్‌ బట్టలో తీసుకొని 400-500 మి.లీ నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి.
- మరుసటి రోజు మస్లిన్‌ బట్టను సరిగా పిండాలి. వచ్చిన కషాయాన్ని ఇంకా కొన్ని నీళ్లు కలిపి లీటరు దాకా ఉండేలా చూసుకోవాలి.
- ఆ తర్వాత 2 గ్రాముల సబ్బుపొడిని కలిపితే మనకు 5 శాతం వేప విత్తన కషాయ ద్రావణం తయారవుతుంది.
- ఈ మోతాదులో పంటల్లో పిచికారీ చేస్తే లద్దెపురుగు, పచ్చ పురుగు, ఆకు ముడత పురుగు, నామాల పురుగు, రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు.
neem1

ఆవు పేడ, మూత్ర కషాయం

- మొదటగా 5 కిలోల ఆవుపేడ, 5 లీటర్ల ఆవు మూత్రం మిశ్రమాన్ని 5 లీటర్ల నీటిలో కలిపి నాలుగు రోజుల వరకు మూతపెట్టి ఒక బకెట్‌లో ఉంచాలి.
- ఆ తర్వాత దానిని వడపోసి 100గ్రా. నిమ్మ పౌడర్‌ను కలుపాలి.
- పై మిశ్రమానికి 80 లీటర్ల నీటిని కలిపితే ఎకరాకు సరిపడే ద్రావ ణం తయారవుతుంది.
- ఈ ద్రావణానికి పచ్చపురుగు, లద్దెపురుగు గుడ్లను నాశనం చేసే శక్తి ఉంటుంది. అలాగే పంటలకు వచ్చే కొన్ని వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది.

అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమం

- మొదటగా 18 గ్రాముల వెల్లుల్లిని తీసుకోవాలి. పైపొరను తీసివేసి మెత్తగా నూరుకోవాలి. తర్వాత 9 గ్రాముల పచ్చిమిర్చిని 9 గ్రాముల అల్లంను కలిపి మెత్తగా నూరాలి.
- ఈ రెండు మిశ్రమాలను లీటరు నీటిలో కలుపాలి. తర్వాత ఒక బట్ట ద్వారా మిశ్రమాన్ని వడపోయాలి.
- 500 మి.లీ. వడపోయగా వచ్చిన ద్రావణాన్ని 100 మి.లీ. సబ్బుపొడిని కలిపి పంటల్లో పిచికారీ చేయాలి.
- దీనితో పేనుబంక, దీపపు పురుగు, పిండి పురుగు, తెల్లదోమలను నివారించవచ్చు.

పొగాకు డికాక్షన్‌

- ఒక కిలో పొగాకు పొడిని 10 లీటర్ల నీటిలో కలిపి అరగంట సేపు వేడి చేయాలి.
- ఆ తర్వాత చల్లార్చి మస్లిన్‌ బట్టగుండా వడపోయాలి.
- వడపోయగా వచ్చిన ద్రావణాన్ని లీటరు నీటికి 2 గ్రాములు కలిపి 80 నుంచి 100 లీటర్ల వరకు పలుచగా చేసుకోవచ్చు.
- ఆ ద్రావణాన్ని పంటల్లో పిచికారీ చేయడం వల్ల రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. అయితే పొగాకు ద్రావణాన్ని ఒకసారి మాత్రమే పిచికారీ చేయాలి. ఎక్కువగా పిచికారీ చేస్తే ఈ ద్రావణం మిత్ర పురుగులను కూడా నాశనం చేయవచ్చు.

ఎన్‌.పి.వి.(NPV) ద్రావణం

- మొదట 400 ఎన్‌.పి.వి. బారినపడిన పచ్చపురుగు లేదా 200 లద్దెపురుగులను పంటల నుంచి ఏరి ఒక దగ్గర ఉంచాలి. తర్వా త వాటిని మెత్తగా నూరాలి. ఒక పలుచని బట్ట ద్వారా వడపోయాలి.
- వడపోయగా వచ్చిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలుపాలి. తర్వాత 100 గ్రాముల రాబిన్‌ బ్లూ పొడిని కలుపాలి. ఈ ద్రావణాన్ని సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలి.
- పిచికారీ చేసిన 2-5 రోజుల్లో పచ్చ పురుగులు, లద్దె పురుగులు వ్యాధి బారినపడి, కొమ్మల పైకి చేరి చనిపోతాయి.
neem2

నేలవాము ద్రావణం

- మొదట నేలవాము మొక్కలను ఏరి, వేర్లను కాకుండా చిన్నచిన్నగా కత్తిరించాలి. కిలో చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఆకులను లీటరు నీటిలో కలిపి మట్టికుండలో వేసి వేడి చేయాలి.
- ఈ ద్రావణం లీటరు అయ్యేదాకా వేడిచేయాలి. తర్వాత చల్లార్చాలి. దానిలో 500 మి.లీ. ద్రావణాన్ని తీసుకుని 100 మి.లీ. సబ్బు ద్రావణాన్ని కలుపాలి.
- తర్వాత పంటల్లో పిచికారీ చేస్తే, కాయగూర పంటల్లో వచ్చే కాండం, కాయతొలిచే పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు.
neem3

149
Tags

More News