పాలీహౌజ్ సాగులో నులిపురుగుల నివారణ

Thu,October 17, 2019 12:52 AM

పౌలీహౌజ్‌లలో ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. పాలీహౌజ్‌లలో పూలమొక్కలు, కార్నేషన్, జెర్బరా, గులాబీ, గ్లాడియోలస్‌లతో పాటు కాయగూరలైన టమాటా, వంకాయ, బెంగళూరు మిర్చి, కీరదోసలను సాగు చేస్తారు. రాష్ట్రంలో కూరగాయలు, పూల మొక్కల సాగు ప్రోత్సహించడానికి పాలీహౌజ్‌లను సబ్సిడీ కింద రైతులకు అందిస్తున్నారు. అయితే పాలీహౌజ్‌లలో ఈ మధ్యకాలంలో నులిపురుగులు ఎక్కువగా ఆశించి పంటలను నష్టపరుస్తున్నాయి.
Polyhouse
ఈ ఏడాది వానలు ఎక్కువగా పడ్డాయి. దీనివల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నది. దీనికి తోడు భూమిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నా యి. సాధారణంగా పంటలపై ఎక్కువగా చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో కంటికి కనిపించని నులిపురుగులు ఎక్కువగా అభివృద్ధి చెంది పంటలపై రోగాలను కలుగజేస్తున్నాయి. పంటలపై వీటి గాయాల గుర్తులు అస్పష్టంగా ఉంటాయి. దీనివల్ల రైతులు అయోమయంలో పడి ఎక్కువగా పురుగు మందులను పిచికారీ చేస్తారు. దీంతో భూమిలో ఉన్న నులి పురుగుల సంఖ్య వృద్ధి చెంది ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. అందువల్ల నులిపురుగుల లక్షణాలు, అవి చేసే గాయాలు వాటిని నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.

నులిపురుగుల లక్షణాలు

-ఇవి కంటికి కనిపించని చిన్న సైజులో ఉంటా యి. వీటికి రంగు లేకుండా సన్నని దారం వలె ఉంటాయి.
-ఇవి ఏర్పరిచిన గాయాలు అస్పష్టంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేర్లపై బుడిపెలను కలుగజేస్తాయి.
-ఇవి తేమ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. భూమిలో ఎక్కువగా అభివృ ద్ధి చెందుతాయి. వాటిలో సూదుల వంటి ముఖభాగాలను కలిగి ఉంటుంది. దీనివల్ల రసాన్ని పీల్చుతుంది.
maxresdefault

గాయ లక్షణాలు

-సాధారణంగా ఈ గాయ లక్షణాలు స్పష్టంగా లేకుండా నులి పురుగుల నిర్ధారణలో చాలా కష్టమౌతుంది. అప్పుడప్పుడు ఈ లక్షణాలు పోషకలోప లక్షణాలను పోలి ఉంటాయి.
-పత్రహరితం కోల్పోవడం. ఎదుగుదల సరి గా లేకపోవడం. మొక్కలు వడలిపోవడం.
-వేరు బుడిపెలు, వేరువ్యవస్థ సరిగా లేకపోవ డం. ఆకులపై మచ్చలు ఏర్పడటం.
నులి పురుగుల వల్ల పంటల్లో చాలా నష్టం కలుగుతుంది. దేశంలో వీటివల్ల ఏటా కోట్ల నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువ తేమ, ఎక్కు వ ఎరువుల వాడకం, ఏడాది పొడవునా పంట లు సాగుచేయడం, ఎక్కువ పంట సాంద్రత ఉండటం వల్ల అధిక నులి పురుగుల వృద్ధికి దోహదం చేస్తాయి. ఉదాహరణకు వేరు కణుపు నులిపురుగులు, చీనీ, నిమ్మ కణుపు నులి పురుగులు, వరి వేరు నులి పురుగులు, గులాబీ పంట లో నులి పురుగులు, ఆలుగడ్డ నులిపురుగులు.

పాలీహౌజ్‌లలో బెడ్ తయారీ

-మొదట పాలీహౌజ్‌లలో బెడ్ చేసుకోవడానికి ముందు టన్నుల పశువుల పేడను ట్రైకోడెర్మా విరిడిని కలిపి భూమిలో కలుపాలి.
-బెడ్లను ఎక్కువగా ఎత్తులో చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వానలు పడినా, వర్షపు నీరు నిలువకుండా ఉంటుంది.
-సిఫార్సు చేసిన ఎరువులను వేయాలి. తర్వాత కార్బోఫ్యూరాన్ గుళికలు 50 గ్రాములు/ చదరపు మీటరుకు, 200 గ్రాముల వేప చుక్కతో కలిపివేయాలి.
-వర్మీ కంపోస్టు 500 గ్రాములు/ చదరపు మీటరుకు భూమిలో పైపొరగా వేయాలి.
-పైన చెప్పిన ఎరువులు వేసిన తర్వాత ఒకవేళ వానలు రాకపోతే వారంరోజుల్లో నీళ్లు పెట్టా లి. లేకపోతే ఎరువులు సరిగ్గా వినియోగించబడవు.
WeekendIndoorgrowing

పశువుల పేడ, వేపచుక్క మిశ్రమాన్ని చేయడం

-టన్ను పశువుల పేడ లేదా వేపచుక్కను రెండు కిలోల సూడోమోనాస్ లేదా ట్రైకోడెర్మా కలి పి మల్చ్ లాగా వరుసతో పంట మొక్కల మధ్య వేయాలి. దానిపై 15 రోజుల వరకు నీళ్లను అప్పుడప్పుడు చల్లుతూ ఉండాలి.
నులిపురుగుల నిరోధక కలిగిన
కాయగూర పంటల రకాలు
-టమాటా-PNR 7, NT-3, NT-12, హిస్సార్ లలిత్
-మిరప-NP 46A, పూసాజ్వాలా, మోహిని,
-ఆలుగడ్డ-కుప్రీ స్వర్ణ
-పిల్లి పెసర- GAU-1
chili-pepper

నివారణ పద్ధతులు

-పంటలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పంట నాటే ముందు విత్తనాలను 55-54 డిగ్రీల సెల్సియస్ కలిగిన నీటిలో 15 నుంచి 20 నిమిషాల వరకు ముంచాలి. తర్వాత వేరు కషాయ ద్రావణంతో (10 శాతం) విత్తనశుద్ధి చేయాలి.
-సాధారణంగా మార్కెట్‌లో నులిపురుగుల నివారణకు రసాయన ముందులు లేవు. కానీ కొన్ని పురుగు మందులైన కార్బోఫ్యూరాన్, ఫోరెట్ కళికలు నులి పురుగులను నివారించగలవు. కార్బోఫ్యూరాన్ గుళికలు 1-3 కిలోలు హెక్టారుకు నారుమడిలో వేసుకోవాలి.
-తర్వాత కార్బోసల్ఫాన్ (3 శాతం)తో విత్తనశుద్ధి చేసుకోవాలి. లేదా టమాటా వంటి నారు మొక్కలను పై ద్రావణంలో ముంచి నాటుకోవాలి. లేదా నిమిట్జ్ 1.5 గ్రా/ మొక్కకు 6-8 సెం.మీ దూరంలో వేయాలి.
-మే, జూన్ నెలల్లో వేసవి దుక్కులు చేయ డం. దీనివల్ల వేరు కణుపు పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
-బంతి, వెల్లుల్లి, ఆవాల పంటలను పంట చుట్టూ వేయాలి. ఇవి నులి పురుగులను చంపే రసాయనాలను విడుదల చేస్తాయి.
-ఆముదం, పిల్లిపెసర మొక్కలను కూడా పెంచితే ఇవి నులిపురుగులను ఆకర్షిస్తాయి. ఎక్కడైతే నులి పురుగుల లక్షణాలు కనపడిన వెంటనే వీటిని పీకి నాశనం చేయాలి.
-నులి పురుగుల నిరోధక పంటలు, రకాలను ఎన్నుకోవాలి. పంటల మధ్య మల్చింగ్ చేయడం వల్ల కొంతవరకు నులిపురుగుల వృద్ధిని అరికట్టవచ్చు.
-ఎక్కువమొత్తంలో పశువుల పేడ, వేపచుక్క, వరిపొట్టు, కంపోస్టు ఎరువులను పంట మొదట్లో వేసుకోవాలి. దీనివల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. నులిపురుగుల బారి నుంచి తట్టుకుంటాయి.
ఈ విధంగా పైన చెప్పినట్టు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.

- చీకూరి రాజాగౌడ్
- 7396400740
-శాస్త్రవేత్త, (ఎంటమాలజీ విభాగం) రాష్ట్రఉద్యాన ,విశ్వవిద్యాలయం

433
Tags

More News