పంటలపై మిడతల దాడి నివారణ పద్ధతులు

Thu,September 19, 2019 12:34 AM

రాష్ట్రంలో పంట చేలపై మిడతల దాడి ఎక్కువైంది. ఇవి లక్షల సంఖ్యలో ఒకేసారి దాడికి దిగుతాయి. చూస్తుండగానే పంట మొత్తం నాశనమౌతుంది. వీటి వల్ల అప్పటివరకు పచ్చదనంతో ఉన్న పంట ఆకులన్నీ పోయి కాండాలు, ఈనెలు మాత్రమే మిగులుతాయి.
ఫలితంగా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది.

corn
వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తుండటంతో కొన్ని జీవులు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. సాధారణంగా మిడతలు తక్కువ సంఖ్యలో ఉండి, పంటలపై అప్పుడప్పుడు ఆశిస్తాయి. కొద్దిగా నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల వాటి జీవిత చరిత్రలో మార్పులు వచ్చాయి. వాటి సంఖ్య ఉధృతమవుతున్నాయి. దేశంలో వీటి తీవ్రత రాజస్థాన్ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒకేసారి వృద్ధి చెంది, పంటలపై దాడిచేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు వీటిని ఎప్పటికప్పుడు గమనించడానికి 1939లోనే మిడత హెచ్చరిక కేంద్రాన్ని జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. వాళ్లు వాటి జీవిత చక్రాన్ని, ఉధృతిని పూర్తిగా అంచనా వేస్తూ రైతులకు తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తారు.

కానీ ఈ మిడతల తీవ్రత మిగతా రాష్ర్టాలకు వ్యాపించింది. మన రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం గోవర్దనగిరి, వరదరాజుపల్లి, గుడి కందుల, ఘనపూర్ గ్రామాల్లో, మెదక్ జిల్లాలోని శంకాపూర్ గ్రామంలో పంటలపై ఈ మిడతల దాడి ఎక్కువగా కనిపించింది. వరి, మక్కజొన్న పంటల ఆకులను తినివేయడం వల్ల కాండాలతోనే పంట కనిపించింది.

corn3

ఈ మిడత లక్షణాలు..

మిడతలు సాధారణంగా గట్ట కింది భాగంలో, తేమ ఉన్న ప్రాంతంలో, భూమి లోపల 30-40 గుడ్లను ఒక సంచిలో పెడుతాయి. ఈ గుడ్లు పసుపు పచ్చరంగులో ఉండి ఒకదానితో ఒకటి జిగురుతో అంటుకుంటాయి. వీటికి చాలా తక్కువ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. గుడ్ల నుంచి వచ్చిన చిన్న పిల్ల మిడతలు సాధారణంగా గోధుమ వర్ణంలో ఉంటాయి. పెద్దగా అయ్యాక ఆకుపచ్చ, వివిధ రంగులలోకి మారుతాయి.

వీటిలో రెండు దశలు ఉంటాయి

1) స్థిర దశ
2) చలన దశ

కాలానుగుణంగా ఈ దశలలో మార్పు ఉంటుంది. ఒకేసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు చలన దశలోకి మారి ఒక గుంపులా లేదా దండులా వచ్చి పంటపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. మొదట ఆకుల చివర్లను, కొనలను గాయపరుస్తాయి. అలా మొత్తం ఆకులను తింటాయి. గంటల వ్యవధిలోనే పంట మొత్తం కాండాలతో మాత్రమే కనిపిస్తుంది.

corn2

యాజమాన్య పద్ధతులు

-ఇవి సాధారణంగా వీధి దీపాలకు ఆకర్షితమౌతాయి. గడ్డి, కలుపు మొక్కలపై ఉంటాయి. అందువల్ల గట్ల మీద ఉండే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలి.
- పంట చుట్టూ, పంటలో చెత్తాచెదారం లేకుండా చూడాలి.
-వరిలో వారానికి ఒకసారి నీళ్లను వదిలేస్తూ ఉండాలి.
-గట్ల కింది భాగాన్ని ఎప్పుడు తవ్వుతూ, గుల్లగా మార్చాలి. దీనివల్ల వాటిలో ఉన్న గుడ్లు, చిన్న పిల్ల దశలు ఎండ తీవ్రతకు చనిపోతాయి.
-మిడతలు ఉనికిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా మిడతల గుంపు గమనించగానే, మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి.
-మిడతల ఉనికికి గమనించగానే క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా మలథియాన్ 2 మి.లీ. లీటరు నీటితో కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలి.
-లేదా మిథైల్ ఫరాథియాన్ 10 కిలోలు ఒక ఎకరానికి లేదా డైక్లోరోవాస్ 1.5 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించవచ్చు.

కేవలం ఒకరిద్దరు రైతులు నివారణ పద్ధతులు పాటిస్తే ఈ మిడతల గుంపును నివారించలేము. విధంగా రైతులందరూ సమిష్టిగా తగిన సూచనలు పాటిస్తే మిడతల దండును సమూలంగా నివారించవచ్చు. అధిక దిగుబడులు సాధించవచ్చు.

c-raja-goud

285
Tags

More News