ఇంటిపంటల్లో సుస్థిర సేద్యం

Thu,September 19, 2019 12:35 AM

సంపూర్ణ వ్యక్తిత్వమూ, నిజమైన ఆనందమూ మనుషుల జీవిత పరమార్థమైతే, అందుకు కావలసింది-కాలుష్యంలేని పర్యావరణమూ, విషతుల్యం కాని ఆహారమూ.
-సుస్థిర వ్యవసాయ కేంద్రం, తార్నాక, హైదరాబాద్

నిజమే. ఒక ఆలోచన కన్నా ఆచరణ చాలా విలువైనది, బలమైనది అది కాలం పదునైన అంచుమీద నెత్తుటి విన్యాసాలు చేస్తూ కలల పరీక్ష నాళికల్లో పొగల మధ్య మరిగిపోతూ ఎప్పటికపుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. ఒకసారి రుజువైనదేదీ అంత సులువుగా వదిలిపోదు సరిహద్దులనూ, సందిగ్ధ సమయాలనూ దాటి తన కాలిజాడల కుదుళ్లలో లేత కలల్ని చిగురిస్తుంది.

house-garden
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ) రైతుల సంక్షేమం కోసం గత పదిహేనేండ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తున్నది. మంచి నేల, నీరు, గాలి, ఆహారం ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఒక సామూహిక ప్రయ త్నం ఇక్కడ జరుగుతున్నది. నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తుల కోసం రైతులతో నేరుగా పనిచేయడం, రైతులకు సంఘటితం చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్‌ను, కోపరేటివ్స్ ఏర్పాటు చేయడం, ఉన్నవాటికి సర్వీసెస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సర్టిఫికెట్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాల ద్వారా, అంతిమంగా రైతులను సుస్థిర వ్యవసాయం దిశగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఐదు రాష్ర్టాల్లో తన కార్యాచరణను విస్తరించింది. మరోవైపు రైతుల ఉత్పత్తుల కొనుగోలు, వారికి మార్కెట్ ధర కన్నా అదనంగా ఇవ్వడం కోసం సహజ ఆహారం అనే రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేసింది. వీటికితోడు నగరవాసులకు ఎలాంటి పురుగుమందులు, రసాయన అవశేషాలు వాడకుం డా, కొనే ఖర్చు లేకుండా మంచి పోషకాలు కలిగి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించే కూరగాయలను పండించడం ఉద్దేశంగా ఇంటిపంట ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నది.

ఇంటిపంటలు చేయాలనుకునే ఔత్సాహికులకు ప్రతి రెండవ, నాలుగవ శనివారం సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆఫీస్‌లో మధ్యాహ్నంవేళలో శిక్షణ అందిస్తున్నారు. ఇంటిపంట కిట్ కొన్నవారికి ఇంటి పంట శిక్షణ ఉచితంగా అందిస్తున్నారు. ఇంటిపంట కిట్‌లో భాగంగా వేపపిండి, వర్మి కంపోస్ట్, కోకోపిట్, కూరగాయ విత్తనాలు, సహజ కీటక నాశిని, గార్డెన్ ఫోర్క్, పసుపు మరియు నీలపురంగు జిగురు పళ్లాలతో పాటు సుస్థిర వ్యవసాయ కేంద్రం లో పనిచేస్తున్న సేంద్రియ వ్యవసాయ నిపుణుల సంయుక్తంగా రచించిన మన ఇంటి పంట పుస్తకాన్ని తక్కువఖర్చులో అందిస్తున్నారు. పదేండ్లకు పైబడిన ప్రస్థానంలో ఇప్పటివరకు పదివేల మందికి ఇంటి పంట శిక్షణను ఇచ్చారు. ఇంటిపంట పండించుకునేందుకు అవసరమైన కూరగాయ విత్తనాలు, కంపోస్ట్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ శిక్షణలో అవగాహనతో పాటు సుస్థిర వ్యవసాయ కేంద్రం మిద్దెపైన కుండీల్లో పెంచుతున్న పంటలను చూపిస్తున్నారు. ఇంటి పంట కు అవసరమైన ఇన్‌పుట్ సపోర్ట్, సర్వీసెస్ అందిస్తున్నారు. కొత్త రకాల విత్తనాలను పరిచయం చేసేముందు ఇక్కడ విత్తనం నాటి వాటి అనుకూల వాతావరణం, పెరుగుదల, తెగుళ్లను తట్టుకునే శక్తి, కాయ రుచి మొదలైన వాటిని పరిశీలించి అపుడు మాత్రమే ఆసక్తి ఉన్నవారికి అందిస్తున్నారు.

అసలు, ఒక గార్డెన్‌ను ప్రారంభించాలంటే ఏం కావాలి అంటే, ఒక స్పష్టమైన ప్రణాళిక అంటారు సుస్థిర వ్యవసాయ కేంద్రం సి.ఇ.ఓ. డాక్టర్ గడ్డం రాజశేఖర్. ఇది ఒక్కటే మన గార్డెన్ భవిష్యత్తును నిర్ణయించేది. అసలు మన కుటుంబసభ్యులు ఎంతమంది, మనం గార్డెన్‌కు ఎంత సమయం కేటాయించుకోగలుగుతాం అనేదానిని బట్టి, ఎంత స్థలంలో గార్డెన్ నిర్మించుకోవా లి, ఎలాంటి పంటలు వేసుకోవాలి అనేవి నిర్ణయించుకోవాలి. తరువాత దగ్గరలో నీటివసతి, రోజుకు ఐదారు గంటలు ఎండ, నీరు సులువుగా ఇంకే మట్టి, జంతువుల నుంచి రక్షణ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. తరువాత మనకున్న వసతిని బట్టి నేలమీద పెంచుకుంటామా, డాబా మీద పెంచుకుంటామా అనేది చూసుకోవాలి.

నేల మీద అయితే, ముందు స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక అడుగులోతు వరకూ మట్టిని తవ్వి కిందా మీదా కలియదిప్పాలి. మట్టి, కంపోస్ట్, ఇసుక మిశ్రమం 1 :1 :1 ఉండేట్టు చూసుకోవాలి. బంకమట్టిలో ఇసుక తప్పనిసరి. ఇసుక కలిపిన ఎర్రమట్టిలో ప్రత్యేకంగా కలపనవసరంలేదు. మనం ఎంచుకున్న స్థలం లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటే మట్టితో బెడ్‌లా చేసి దాని పై నారును లేదా మొక్కలను పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వేర్లకు సులువుగా గాలి తగులుతుంది. లేకపోతే వేర్లు నీటిలో మునిగి గాలి ఆడక చనిపోయే ప్రమాదం ఉంది. విత్తనాలు వేసేటట్టయితే కంపోస్ట్ కలిపిన మట్టి పైభాగం చదునుచేసి గీతలు గీసి వాటి వెంట విత్తనాలు విత్తుకోవాలి. విత్తనాలు కప్పబడేట ట్టు పైన పలుచగా కంపోస్ట్‌ను చల్లాలి. నాటిన తరువాత రోజ్‌క్యాన్‌తో నీటిని చిలకరించాలి. తేమను గమనిస్తూ అవసరమైనపుడు నీటిని పోయాలి. సాయంత్రం సమయంలో నీరు పోయ డం ఉత్తమం. మట్టిపై గడ్డితోగానీ, ఎండుటాకులతో గానీ కప్పి ఉంచితే మొలక త్వరగా వస్తుంది. ఇక విత్తనాల ఎంపికలో ముఖ్యంగా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కిచెన్‌లో ఉపయోగించే మొక్కలను ఎక్కువగా నాటుకోవాలి. దగ్గరలో ఉన్న నర్సరీ నుంచి విత్తనాలను, నారును తెచ్చుకోవాలి. సాధ్యమైనంతవరకు కూరగాయల మొక్కలను, పూల మొక్కలను కలిపి నాటుకోవాలి.

ఇక మిద్దె మీద కుండీలు ఏర్పాటు చేసుకునేటపుడు పాత బకెట్లు, గ్రో బ్యాగ్స్, ప్లాస్టిక్ టబ్బులు, డ్రమ్ములు ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో పెంచుకోవచ్చు. వీటిల్లో ఇసుక, మట్టి, కంపోస్ట్‌ను 1 :1 :1 నిష్పత్తిలో కలుపుకోవాలి. సాధారణంగా మిద్దెపైన పెంచుకునేటపుడు బరువు లేకుండా ఉండేందుకు మట్టి, ఇసుకను ఉపయోగించకుండా పూర్తిగా కంపోస్ట్‌తోనే పండించుకోవడం మంచిది. అడుగు నుంచి రెండడుగులలోతు ఉన్న కంటైనర్లు అన్ని రకాల మొక్కలకు సరిపోతాయి. కుండీలు ఏర్పాటు చేసుకునేటపుడు కొన్ని మెళకువలు పాటిస్తే మొక్కల పోషణలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవచ్చు. మట్టి విషయానికి వస్తే ఎర్రమట్టి వాడితే మంచిది. ఆకు ఎరువు, వర్మికంపోస్ట్‌లలో దేనినైనా వాడుకోవచ్చు. వేప, కానుగ, శీతాఫలం, ఆముదం గింజల పిండిని తగు మాత్రంగా మట్టి మిశ్రమంలో ముందుగానే కలిపి చీడపీడలను నివారించుకోవచ్చు. ఈ పిండివల్ల అదనపు పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. కొబ్బరిపొట్టు లేదా రంపపు పొట్టును కలుపుకుంటే మొక్కల వేర్లు సులువుగా లోతుకు చొచ్చుకుపోవడానికి అవకాశం వుంటుంది. కుండీల్లో గానీ,మడుల్లో గానీ నీరు ఎక్కువగా పోయకుండా ఎప్పుడూ తడీపొడిగా ఉండేట్టు చూసుకోవాలి.

కుండీల్లో ఎక్కువైన నీరు బయటకు వెళ్లేందుకు అడుగుభాగాన తప్పకుండా రంధ్రాలు ఉండేట్టు చూసుకోవాలి. అవి పూడిపోకుండా ఉండేందుకు పెంకముక్కలు, కొబ్బరిచిప్ప ముక్కలు, చిన్న చిన్న రాళ్ల వంటి వాటిని వాడుకోవచ్చు. వీటి మధ్య ఖాళీలు ఉండేట్టు చూసుకుని పైన ఒక వరుస మందం ఎండు ఆకులు పరిచి, దాని పైన ఇసుక, దానిపై మట్టి, కంపోస్ట్ మిశ్రమం పోస్తే కుండీలో మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మొదట దశ సిద్ధమైనట్టే. తరువాత దశలో రెండు మూడు వారాలకోసారి స్వంతంగా తయారుచేసుకున్న ఎరువు వేయడం, కలుపు మొక్కలను పెరికేయడం, ఎప్పటికపుడు ఎండిన ఆకులు, కొమ్మలను కత్తిరించడం చేయా లి. ఎత్తు పెరిగిన మొక్కలకు కట్టెలు పాతి, తాడుతో కట్టి సపోర్ట్ అందించాలి. మొక్క చుట్టూతా మల్చింగ్‌తో నేలలో తేమ శాతా న్ని కాపాడుకోవచ్చు. నేసారాన్ని వృద్ధి చేయవచ్చు. ఇందులో వరిగడ్డితో, చెట్ల ఆకులతో, ఉడ్ చిప్స్‌తో, యార్డ్ వేస్ట్, సా డస్ట్, వేరుశనగ పొట్టును మల్చింగ్‌గా వాడవచ్చు.

ఇక కాలాలాననుసరించి మొక్కలను నాటుకుంటే చాలావరకు పురుగుల తాకిడిని (చీడలు)అరికట్టవచ్చు. ఒకవేళ పురుగులు వాటిని చేతితో ఏరివేయాలి. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే, తయారుచేసుకున్న సహజ కీటక నాశనులను వాడుకోవాలి. తెగుళ్ల నియంత్రణ (పీడలు)కు వస్తే, పేనుబంక, తెల్లదోమ, పిండినల్లి వంటి వాటిని ఇంట్లో తయారుచేసుకున్న కషాయాలతో చాలా సులువుగా నియంత్రించవచ్చు. ఇక ఇంటిపంటల్లో క్రమం తప్పకుండా కూరగాయలు పొందాలంటే 45 రోజులకొకసారి మొక్కలు నాటుకుంటుండాలి. తీగజాతుల్లో కాత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రకానికో మొక్క నాటుకుంటే సరిపోతుంది. మొదటగా కాసిన విత్తనాన్ని చెట్టు మీద ఎండే వరకు ఉంచితే మళ్లీ విత్తనం కొనాల్సిన అవసరం ఉండదు. ఇంటిపంటల్లో కరివేపాకు, మునగ, దొండ వంటి బహువార్షిక పంటలను కూడా చేర్చుకుంటే ఇంకా మంచిది. కొత్తగా ఇంటి పంటలు పండించాలనుకునే వారు ఈ పద్ధతులు అనుసరిస్తే సంవత్సరం పొడవునా ఇంటికి కావలసిన ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చంటారు రాజశేఖర్.

-కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455
నేచర్స్‌వాయిస్


callyflower3

కాలాన్ని బట్టి పండించుకోగలిగే పంటలు

ఎండాకాలం: సొర, బీర, కాకర, పొట్ల, గుమ్మడి, దొండ, బెండ, దోస, ఆకుకూరలు

వానకాలం: వంగ, బెండ, గోరుచిక్కుడు, ఆకుకూరలు, బీర, కాకర

చలికాలం:బఠాణీ, చిక్కుడు, టమాటా, క్యాబేజి, కాలీఫ్లవర్, ఆలుగడ్డ, బీన్స్, క్యారట్ ఒకసారి విత్తనం వేసి సంవత్సరం పొడవునా తీసుకునేవి.. వంగ, బెండ, దొండ ఎప్పటికపుడు విత్తుకుని సంవత్సరం పొడవునా తీసుకునేవి..టమాటా,బెండ,ఆకుకూరలు

మరిన్ని వివరాలకు: డాక్టర్ గడ్డం రాజశేఖర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం (83329 45368)

285
Tags

More News