సారమెరిగి సాగు చేస్తే మేలు

Wed,February 20, 2019 10:47 PM

రైతు నేల పోషక సామర్థాన్ని తెలుసుకోవాలి. దీనివల్ల ఏ నేలలో ఏ పంట వేస్తే బాగుంటుందో తెలుస్తుంది. వేసిన పంటకు తగిన నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించవచ్చు. తద్వారా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్లసాగు ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.
crop
భూసార పరీక్షల ద్వారా నేలలోని కొంత మట్టిని సేకరిస్తారు. రసాయిన పద్ధతుల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా పరీక్షిస్తారు. దీనివల్ల మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు ఏఏ పాళ్లలో ఉన్నాయో నిర్ధారిస్తారు. అయితే నేల స్వరూపం తెలియకుండానే రైతులు పంటల సాగు చేపడుతున్నారు. పంటలకు చీడపీడల బెడద, తెగుళ్లు సోకితే రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా రైతులపై సాగు భారం అధికం అవుతున్నది. ఈ పరిస్థితి పునరావృతం కావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంసాగు భూములు కలిగిన ప్రతి రైతుకు సాయిల్ హెల్త్‌కార్డు అందివ్వాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెలో మినీ భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

మట్టి సేకరించే పద్ధతి ..

పొలమంతా ఒకేరకంగా ఉన్నప్పుడు ఐదెకరాల విస్తీర్ణానికి ఒక నమూనా చొప్పున మట్టిని తీయాలి. మట్టి నమూనా తీయాల్సిన పొలంలో 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించాలి. మట్టి నమూనా తీయాల్సిన చోట నేలపై ఉన్న గడ్డిని, చెత్తను, కలుపు మొక్కలను తీసివేయాలి. ఆ తర్వాత వీ ఆకారంలో ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు (15 సెంటీమీటర్లు) నాగటిచాలు ఉండేంత వరకు గుంతలు తీయాలి. పై నుంచి కింది వరకు ఒకే మందంలో పల్చనిపొర వచ్చే విధంగా మట్టిని తీయాలి. ఇలా అన్నిచోట్ల నుంచి సేకరించిన మట్టిని గోనెపట్టే లేదా ఫాల్తీన్ పట్టా, గట్లమీద వేయాలి. సేకరించిన మట్టిలో గడ్డలు లేకుండా చూడాలి. ఆ మట్టిని చతురస్రాకారంగా పరిచి నాలుగు సమభాగాలుగా విభజించాలి. ఎదురెదురుగా ఉన్న రెండు భాగాల మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని తీసివేయాలి. మళ్లీ ఆ మట్టిని నాలుగు భాగాలుగా చేయాలి. ఈ విధంగా అరకిలో మట్టి నమూనా మిగిలే వరకు చేయాలి. పండ్ల తోటలు వేయాల్సిన పొలంలో చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి.

అందులో మూడు అడుగుల గొయ్యిని తీసి ప్రతి అడుగుకు పై నుంచి కిందికి ఒక్కో మట్టి నమూనా చొప్పున సేకరించాలి. ఆ మట్టి వివరాలను పరీక్ష కేంద్రానికి పంపాలి. సేకరించిన మట్టి నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో కాని, ప్లాస్టిక్ సంచిలో గాని నింపాలి. సంచి లోపల రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, సర్వే నెంబర్, వేయాల్సిన పంట తదితర వివరాలతో కూడిన ధ్రువపత్రాన్ని అందులో ఉంచాలి. చెట్ల కింద, గట్ల పక్కన మట్టిని తీయకూడదు. అదే విధంగా సారవంతమైన చోట, నిస్సారవంతమైన చోట మట్టిని కలిపి తీయకూడదు. మెట్ట లేదా ఆరుతడి సేద్యంలో పంట పెరుగుతున్న సమయంలో నమూనా తీయాల్సినప్పుడు వరుసల మధ్య నుంచి నమూనా సేకరించాలి. చౌడు భూముల్లో 0 నుంచి 15 సెంటీమీటర్లు, 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో రెండు నమూనాలను తీయాలి. నీరు నిలిచిన ప్రదేశంలో మట్టిని తీయకూడదు.

crop2

పరీక్షల వల్ల కలిగే లాభాలు

భూసారాన్ని బట్టి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. అంతేకాకుండా భూమిలోని పోషకాలు చాలాకాలం పంటలకు అందే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల వారు ఆర్థికంగా బలపడవచ్చు. ఎండాకాలంలో పంటలు పూర్తిగా చేతికి వచ్చిన తరువాత రైతు తన పంటపొలంలో వ్యవసాయశాఖ అధికారి సూచనల మేరకు నిబంధనల ప్రకారం మట్టిని సేకరించాలి. సేకరించిన మట్టిని పరీక్ష చేసిన అనంతరం ఫలితాలను బట్టి సాగు చేపట్టాలి. ఒక్కసారి పరీక్ష చేయించుకున్న రైతు దాని వివరాల ఆధారంగా మూడేండ్ల పాటు పంటలను సాగు చేసుకోవచ్చు. ఇరిగేషన్ ప్రాంతంలో 10 హెక్టార్ల పరిధిలో ఉన్న ఏ భూమిలో పరీక్ష చేసిన అదే ఫలితం ఇతర ఆ భూమి అంతటికి వర్తిస్తుంది. అయితే నాన్ ఇరిగేషన్ పరిధిలో మాత్రం 2.5 హెక్టార్లను యూనిట్‌గా చేసుకొని మట్టి నమూనాలను సేకరించుకోవాలి.

ప్రతి సాగు భూమికి సాయిల్ హెల్త్‌కార్డు

గతంలో భూసార పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా కేంద్రంలోనే భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండేవి. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నేడు గ్రామా గ్రామా న మినీ భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయి ల్ హెల్త్ కార్డులను కూడా అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5వేల హెక్టార్లకు ఓ వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది. వారికి మినీ భూసార కిట్లను కూడా అందజేసింది. ఒక్కో కిట్ ద్వారా 150 పరీక్షలు చేయించుకునే విధంగా కిట్లను తయారు చేశారు. ప్రతి ఏఈవోకు టార్గెట్‌ను వ్యవసాయశాఖ నిర్దేశించింది.రానున్న రోజుల్లో ఊరూరా క్రాప్ కాలనీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భూసార పరీక్షలు తప్పనిసరి. కాబట్టి రైతులు భూసార పరీక్షలకు అనుగూణంగానే పంటల సాగు చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందిస్తున్నది.

-మద్దెల లక్ష్మణ్,9010723131
ఖమ్మం వ్యవసాయం

1154
Tags

More News