మిరప కోతదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Thu,February 14, 2019 01:03 AM

red-chilli
వాణిజ్యపరంగా అత్యంత విలువైన పంట మిరప. ఈ పంటను సాగు చేసిన రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. తద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అయితే ప్రస్తుతం మిరపలో కోత లు అవుతున్నాయని వాటిని కోసేముం దు, కోసిన తర్వాత సరైన పద్ధతులు అవలంబించాలి.దీనివల్ల నాణ్యమైన దిగుబడులను పొందవచ్చునని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వివరించారు. మిరపను కోతదశ నుంచి నిల్వ చేసే వరకు పాటించాల్సిన విధానాలను గురించి ఆయన తెలిపారు.

ఆ వివరాలు...

-మొక్కల మీద మిరపకాయలను ఎక్కువగా పండనివ్వకూడదు.
-ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. ఎప్పటికప్పుడు పండిన కాయలను కోయడం వల్ల దిగుబడు లు పెరుగుతాయి.
-కాయలు కోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. పిచికారీ చేస్తే కాయల మీద అవశేషా లు ఉండి ఎగుమతికి ఆటంకాలు ఏర్పడుతాయి.
-మిరప కాయలను పాలిథీన్ పట్టాల మీద లేదా సిమెంట్ గచ్చు మీద ఎండబెట్టాలి. లేకపోతే అప్లోటాక్సిన్ అనే విషపదార్థం ఎక్కువగా వృద్ధి చెందుతుంది.
-రాత్రిళ్ళు మంచుబారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి. 10 శాతానికి మించి ఎక్కువ తేమ లేకుండా ఎండబెట్టాలి.
-ఎండబెట్టేటప్పుడు దుమ్ము,ధూళి, చెత్త చేరకుండా వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
-తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరుచేయాలి.
-నిల్వ చేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచులలో కాయలను నింపాలి.
-తేమ తగులకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లాల మీద గోడలకు అరమీటర్ దూరంలో నిల్వ చేయాలి.
-అవకాశమున్నచోట్ల శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.
-అకాల వర్షాలకు గురికాకుండా మంచుబారిన పడకుండా రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్‌లలో ఎండబెట్టి నాణ్యమైన మిరప దిగుబడులు పొందవచ్చు.
-నట్టె కోటేశ్వర్‌రావు
9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

268
Tags

More News