వరిలో పురుగులు, తెగుళ్ళ నివారణ

Wed,February 6, 2019 11:03 PM

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వరినాట్లు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం 20-40 రోజుల వయస్సు కలిగినవి ఎక్కువగా ఉన్నాయి. రైతులు ప్రధానంగా దొడ్డు గింజ రకాలైన బతుకమ్మ, కూనారం సన్నాలు, యం.టియు 1010 అలాగే సన్న గింజ రకం అయిన తెలంగాణ సోనా యాసంగి కాలంలో సాగు చేస్తున్నారు.
paddy
ప్రస్తుతం రైతులు, వ్యవసాయ అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు వరిలో కాండంతొలిచే పురుగు, ఆకుముడత పురుగు, అగ్గితెగులు, కొన్ని ప్రాంతాల్లో సల్ఫైడ్ ధాతు విష ప్రభావం వంటి సమస్యలను గుర్తించాం. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. వరి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో నివారణ చర్యలు చేపడితే నష్టాలు తగ్గించుకోవచ్చు.

కాండం తొలిచే పురుగు, ఆకుముడత

-యాసంగిలో పొట్ట దశలో ఆశించి అధిక నష్టాన్ని కలిగించే ప్రధానమైన పురుగు.
-రెక్కల పురుగులు ఆకుల కొనలపై కనబడుతాయి. దీని గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు ఆశించడం వల్ల ఈనిన తర్వాత వెన్నంతా తాలుపోయి తెల్లకంకులు ఏర్పడటం వల్ల 3-4 బస్తాల దిగుబడి నష్టపోయే అవకాశం ఉన్నది.
-పిలకల నుంచి దబ్బు చేసే దశలో ఉన వరి పైర్లలో తప్పనిసరిగా నాటిన 30 రోజుల లోపు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ మైక్రోక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు నీరు పలుచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లాలి.
-అంకురం నుంచి చిరుపొట్ట దశలో కాండం తొలిచే పురుగు ఆశించి తెల్ల కంకులు ఏర్పడటం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. ప్రతి 40 మొక్కలకు ఒక రెక్కల పురుగు లేదా గుడ్ల సముదాయం గమనిస్తే, క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్.సి 0.3మి.లీ. ఒక లీటరు నీటికి (ఎకరాకు 60 మి.లీ) లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2 గ్రా. ఒక లీటరు నీటికి (ఎకరాకు 400 గ్రా.) పిచికారీ చేయాలి.
-ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఆకుముడత ఉధృతి గమనించాం. కాబట్టి రైతులు కాండం తొలిచే పురుగుకు సూచించిన మందులతో ఆకుముడత పురుగును కూడా అదుపు చేయవచ్చు.

అగ్గితెగులు

-ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవటం, మంచుతో కూడిన వాతావరణం ఉండటం వల్ల అగ్గితెగులు గమనించడమైనది.
-ముఖ్యంగా యాసంగి వరిని ఆశించే ప్రధానమైన తెగులు. ఈ తెగులు ఉధృతి ఆకుమచ్చ దశలోనే నివారించకపోతే, ఆ తర్వాత దశలలో మెడవిరుపు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ తెగులు నివారణకు ఐసోప్రోథమోలిన్ 1.5మి.లీ ఒక లీటరు నీటికి (300 మి.లీ ఎకరాకు)లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ (500 మి.లీ/ ఎకరాకు )ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-కొన్ని ప్రాంతాల్లో జింకు లోపం వల్ల ఆకుల మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడటం వల్ల మొక్క ఎదుగుదల లోపిస్తుంది. జింక్ లోప నివారణ జింక్ సల్ఫేట్ 2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
-సల్ఫేట్ ధాతు విష ప్రభావం వల్ల మొక్కల వేర్లు నల్లబడుతాయి. అలాంటి లక్షణాలను గమనిస్తే పొలంలో మురుగు నీరు తీసి ఆరబెట్టాలి.
-డాక్టర్ టి. ప్రదీప్,8008333783
ప్రధాన శాస్త్రవేత్త, (వరి) వరి పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్

1544
Tags

More News