మామిడిలో పూత సమయంలో సమగ్ర సస్యరక్షణ

Wed,January 30, 2019 10:31 PM

-అల్పపీడన ద్రోణితో అప్రమత్తంగా ఉండాలి
-సమగ్ర నివారణ చర్యలతోనే అధిక దిగుబడి

mango
రాష్ట్రంలో సుమారు 3.15లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, వరంగల్ రూరల్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. గత మూడునాలుగు రోజులుగా మంచు కమ్ముకున్నది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం చాలాచోట్లలో మామిడి తెల్లపూత నుంచి పిందెకట్టు దశలో ఉన్నది. ఈ సమయంలో పూతకాడలపై ఆంత్రక్నోస్ మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దగా తయారై పూతకాడలు రాలిపోతాయి. వీటి నివారణకు రైతులు కార్బండిజమ్ 2గ్రాములు/లీ. + మాంకోజెబ్ 2గ్రా./లీ కలిపి పిచికారీ చేస్తే సమర్థవంతంగా నివారించవచ్చని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.

తోటల్లో తెగుళ్ల నివారణ:

ప్రస్తుతం మొగ్గ దశల ఉన్న తోటల్లో క్లోరిపైరిఫాస్, నీటిలో కరిగే గంధకం 3గ్రా. కలిపి పిచికారీ చేస్తే తేనెమంచు పురు గు, బూడిద తెగులు రాకుండా నివారించవచ్చు. మొగ్గ తొందరగా విచ్చుకోవడానికి, పూత, కాడ పొడవుగా పెరుగడానికి పొటాషియంనైట్రేట్ లీటరు నీటికి 10గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి. నీటి వసతి ఉన్న వారు మొగ్గ పగిలే దశ గమనించి నీరు పెట్టాలి. అయితే తప్పనిసరిగా డ్రిప్ ద్వారానే నీరు పెట్టాలి.

మొగ్గదశలో చేపట్టవలసిన చర్యలు:

పూత మొగ్గలు బయటకు వచ్చే వరకు నీటి తడి ఇవ్వరాదు. మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ 10గ్రా. నీటికి కలిపి పిచికారీ చేస్తే మొగ్గ త్వరగా పగిలి పూత వచ్చే అవకాశం ఉంటుంది. జూన్-జూలై వర్షాభావ పరిస్థితుల వల్ల ఎరువులు వేయలేకపోయినవారు పిందె దశలో 1/2కిలో యూరియా 1/2కిలో పొటాష్ ఎరువులు వేసుకోవాలి. నీటి వసతి లేని వారు పిందె 1 శాతం యూరియా ద్రావణాన్ని 15రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. పూత ఆలస్యమైన తోటల్లో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి. సాగునీటి సౌకర్యంలేని వర్షాధారపు తోటల్లో పెరుగుతున్న పిందెల మీద, కాయల మీద ఒక శాతం యూరియా (10గ్రా./లీటరు నీటికి) పిచికారీ చేయాలి.

చీడ పీడల యాజమాన్యం:

పూత దశలో బూడిద తెగులు నివారణకు హెక్సాకోనజోల్ 2మి.లీ. లేదా బెల్‌టాన్1 గ్రా. లలో ఏదైనా ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత ఆలస్యంగా వచ్చినప్పుడు కాయ పెరుగుదల దశలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి పొడి వాతావరణం ఉంటుంది. కాబట్టి రసం పీల్చే పురుగులు(తామర పురుగులు, నల్లి) ఎక్కువగా ఆశించి నష్టపరిచే అవకాశం ఉన్నది.

తేనెమంచు పురుగు:

ఈ పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. లేత ఆకులు, కొమ్మల నుంచి కూడా రసం పీల్చడంతో ఆకులు ముడతపడి సరిగా పెరుగవు. పురుగులు విసర్జించిన తేనె లాంటి బంక ఆకుల మీద కనబడుతుంది. సూర్యరశ్శి వెలుతురులో మెరుస్తూ ఉంటుంది.

నివారణ:

లీటరు నీటికి డైమిథోయేట్ 2మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5మి.లీ చొప్పున కలిపి పూత మొదలయ్యే, పిందెలు తయారయ్యే సమయాల్లో పూత ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలి. పూత పూర్తిగా విచ్చుకోకముందే పిచికారీ చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపిస్తే ఇమిడాక్లోప్రిడ్ 0.3మి.లీ. థయోమిథాక్సామ్ (0.3గ్రా./లీ. నీటికి) పిచికారీ చేస్తే పూత, కాపు సమయంలో తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.

తామర పురుగులు:

ఇవి 2 మి.మీ పొడవు ఉంటాయి. కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల చిగురు ఆకులు చిన్నగా ఉండి, ఆ తర్వాత రాలిపోతాయి. ఈ తామర పురుగులు పుష్పగుచ్చాలపై, పిందెలపై చర్మం గీకి రసం పీలుస్తాయి. దీనివల్ల వక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగు ఏర్పడి కాయ నాణ్యత పడిపోతుంది. ఈ పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి నల్లపూత దశలో అంటే పిందెలు ఎదిగే దశలో పిచికారీ చేయాలి.

ఆకుజల్లెడ గూడు పురుగు:

శాఖీయ పెరుగుదల అధికంగా ఉన్నా పూత తగ్గడం లేదా పూమొగ్గలు తక్కువగా వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో శాఖీయ పురుగుదల నియంత్రించేందుకు లీటరు నీటికి 1-2మి.లీ.సైకోసిల్ కలిపి పిచికారీ చేయాలి.

సూక్ష్మ పోషకాల వాడకం:

ఈ ఏడాది పిందె రాలడం, కాయ పగలడం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. జింకు (1.2గ్రా.జింకుసల్ఫేట్)1.25గ్రా. బోరాన్ లీటరు నీటికి కలిపి పూత మొగ్గల పెరుగుదల దశలో ఉన్నప్పుడు చెట్లు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. దీనివల్ల పిందె శాతం పెరుగడమే కాకుండా కాయ పగలకుండా నివారించుకోవచ్చు. మామిడి పిందెలు ముఖ్యంగా జొన్నగింజ పరిమాణంలోను, గోలికాయ పరిమాణంలోను ఉన్నప్పుడు కూడా రాలుతాయి. రైతుకు గోలికాయ పరిమాణంలో ఉన్నప్పుడు రాలిపోతే దిగుబడి బాగా తగ్గుతుంది. దీని నివారణకు నాప్తలిన్ ఎసిటిక్ ఆమ్లం హోర్మోన్‌ను 10-20 పి.పి.యం. చొప్పున పిచికారీ చేయాలి.
-గుండెల రాజు, 72889 85757
మహబూబాబాద్ వ్యవసాయం


రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఆకాల వర్షాలతో మామిడి తోటలను పురుగులు ఆశిస్తాయి. తోటలను తీవ్ర నష్టపరుస్తాయి. రోజురోజుకూ వీటి ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఈ పురుగు ఉనికి మామిడి సాగుతున్న అన్నిప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది. మామిడితోటల్లో చేపట్టే యాజమాన్య విధానాన్ని బట్టి తామర పురుగులు, తేనెమంచు పురుగులు, ఆకుజల్లెడ గూడు పురుగులు ఉధృతి 1- 8 శాతం వరకు ఉంటుంది. ఈ పురుగు ఆశిస్తే తీరని నష్టం జరుగుతుంది. రైతులు మందస్తుగా అధికారుల సలహాలతో తగినచర్యలు తీసుకోవాలి. దీనివల్ల మంచి దిగుబడులతో పాటు ఆదాయం పొందవచ్చు.
k-suryanarayana
- కె. సూర్యనారాయణ, 79977 25108
జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మహబూబాబాద్
టోల్ ఫ్రీ నెంబరు: 18004250519

1735
Tags

More News