మంచినీటి రొయ్యలు లాభదాయకం

Wed,January 16, 2019 10:51 PM

- ప్రతికూల పరిస్థితులను తట్టుకునే రకం నీలకంఠ
-పెంపకపు చెరువుల్లో అవసరాన్ని బట్టి ఎరేటర్‌లు వాడాలి
-మిశ్రమ పెంపకం ఉత్తమం
మనదేశం రొయ్యల ఎగుమతిలో మంచి పురోగతి సాధించింది. ఈ రొయ్యల్లో ఎక్కువ భాగం చెరువుల్లో పెంచినవి. సముద్రపు రొయ్యల్లో సంక్రమించిన వైరస్ రోగాలు, పర్యావరణ సమస్యల కారణంగా రొయ్యల పెంపకం ఆశించిన ప్రగతి సాధించడం లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా మంచినీటిలో పెరిగే రొయ్యల పెంపకంపై మన రాష్ట్రంలో రైతులు ఎక్కువ ఆసక్తి చూపెడుతున్నారు. మంచినీటి రొయ్యలు రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లలో ఎక్కువ సంఖ్యలో లభిస్తాయి. పెంపక చెరువులో వీటికి కలిగే రోగాలు చాలా తక్కువ. అలాగే తేలికగా నివారించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మంచినీటి రొయ్యల పెంపకానికి చేయూతనిస్తున్నది. దీంతో వీటి పెంపకం చేపట్టి రైతులు మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
prawns
మంచినీటి రొయ్యలు నదులు, చెరువులు, కుంటలు కాలువల్లో నీటి అడుగు భాగాన నివశిస్తాయి. దేశంలో అనేక జాతుల మంచినీటి రొయ్యలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో కొన్నిరకాలు మాత్రమే చెరువుల్లో పెంపకానికి అనువైనవి. అవి 1. మేక్రోబ్రేకియం రోసెన్‌బైర్గె (నీలకంఠ రొయ్య) 2. మేక్రోబ్రేకియం మాల్కంసోని 3. మేక్రోబ్రేకియం చోప్రాయ్. వీటిలో నీలకంఠ (స్కాంపి) వేగంగా పెరుగడమే కాకుండా ప్రతికూల పరిస్థితిని తట్టుకునే శక్తి కలిగిన రకం. ఈ జాతి రొయ్యల్లో మగ రొయ్య లు 33 సెం.మీలు, ఆడ రొయ్యలు 28 సెం.మీల సైజు పెరుగుతాయి.

చెరువు నిర్మాణం: 0.5-1.0 హెక్టారు (1-1.25 ఎకరాలు)లోతు 1.2-1.5 మీటర్‌లు విస్తీర్ణం కలిగిన చెరువులు అనుకూలంగా ఉంటాయి.

పెంపకపు యాజమాన్యం: నర్సరీ చెరువుల్లో 3-4 సెం.మీ (3 గ్రామల పరిమాణం) రొయ్య పిల్లలను(జువైనల్స్) విసురు వలలో గానీ, లాగుడు వలలోగానీ పట్టి పెద్ద చెరువు (గో అవుట్)కు మార్చాలి. హెక్టారు విస్తీర్ణం లో 20-30 వేల పిల్లలను స్టాక్ చేసుకుని పెంచుకోవచ్చు. హెక్టారుకు 40-60వేల పిల్లలను స్టాక్ చేసినైట్లెతే తప్పనిసరిగా నాలుగుఎరేటర్‌లను వాడాలి. వీటికి తగిన పరిమాణంలో అదనపు ఆహారాన్ని అందించాలి.

ఏకలింగ రొయ్యల (మోనోసెక్స్ కల్చర్) సాగు:

మంచినీటి రొయ్యల్లో మగ రొయ్యలు, ఆడ రొయ్యల కన్నా ఎక్కువ బరువు పెరుగుతాయి. అధిక దిగుబడులు పొందడానికి నర్సరీలలో రొయ్య పిల్లలను ఎకరానికి 16000-24000 వరకు వేసి నర్సరీ సాగు చివరిలో ఆడ, మగరొయ్యలను వేరు చేయాలి. వాటిని వేరు వేరు సాగు చెరువుల్లో ఎకరాకు 2500-5000 వరకు సరాసరి బరువు 5-10 గ్రాములు వేసి పెంచడం వల్ల తక్కువ కాలంలోనే ఆడ రొయ్యలు 50-60 గ్రాములు మగ రొయ్యలు 80-100 గ్రాములు సరాసరి బరువును చేరుకుంటాయి.

మిశ్రమ పెంపకం (పాలికల్చర్): మిశ్రమ పెంపకంలో దేశవాళీ చేపలతో పాటు మంచినీటి రొయ్యలను పెంచవ చ్చు. దీన్నే పాలికల్చర్ అంటారు. హెక్టారుకు 10,000 చొప్పున నర్సరీలో పెంచిన రొయ్య పిల్లలు 4000 (సరాసరి బరువు 200 గ్రాములు) గల కార్ప్ చేపలను కలిపి మిశ్రమ పెంపకం ద్వారా సుమారు 500 కిలోల రొయ్య లు, 3500-4000 కిలోల చేపలను ఉత్పత్తి చేయవచ్చు. మిశ్రమ పెంపకంలో రొయ్యలకు అదనంగా మేత ఇవ్వవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేపలకు ఇస్తున్న ఫీడ్‌లో కొంత రొయ్యలు ఇబ్బంది లేకుండా వినియోగించుకుంటాయి. మంచినీటి రొయ్యలు సర్వభక్షకులు, నీటిలోని నాచు, సహజంగా లభ్యమయ్యే ప్లాంక్టాన్ (ప్లవకా లు) నీటి పురుగులు, సేంద్రియ మురుగు పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి.

రొయ్యల సైజు వ్యత్యాసం: మంచినీటి రొయ్యల పెంపకంలో ముఖ్యంగా నీలకంఠ రొయ్యల పెంపకంలో సైజు వ్యత్యాసాల యాజమాన్యం ముఖ్యమైంది. పెరుగుదల అసమానతలు మగ వాటిలో ఎక్కువ. ఈ అసమతుల్య పెరుగుదలను హెటిరోజీనస్ ఇండివిడువల్ గ్రోత్ (హెచ్.ఐ.జీ) అంటారు. మగ వాటిలో మూడు రకాల రూపాంతరాలు కలవు.
1.చిన్నమగవి 2. నారింజరంగ డెక్కలు కలవి. 3.నీలిరంగు డెక్కలు కలవి.
1. చిన్నమగవి: ఇవి చిన్న డెక్కలు కలిగిన పెరుగుదల లేని (స్టంటెడ్) మగవి. వీటి డెక్కలు శరీరముకన్నా 0.4-0.9 రెట్లు అధికం లేదా డెక్కలు లేకుండా ఉంటాయి.
2. నారింజ రంగు డెక్కలు కలవి: ఇవి నారింజ రంగులో డెక్కలు కలిగి శరీర పొడవు కన్నా 0.8-1.4 రెట్లు పొడవైన డెక్కలు కలిగి ఉంటాయి.
3. నీలిరంగు డెక్కలు కలవి: ఇవి నీలిరంగు పొడవైన డెక్కలు కలిగి ఉంటాయి. వీటి డెక్కలు శరీర పొడవులో 1.4-2.0 రెట్లు ఉంటాయి.

ఈ రూపాంతరాల్లో చిన్న మగవి మృదుత్వంగాను, నారింజ రంగు డెక్కల మగవి కొంచెం బలం కలిగి, నీలి రంగు డెక్కల మగవి అన్నింటి కన్నా ఎక్కువ బలం కలిగి ఉంటాయి. నీలి రంగు డెక్కలు దశ పెరుగుదలలో చివరి దశ. కాబట్టి వెంటనే పట్టుబడి చేయాలి.

మార్కెటింగ్: మంచినీటి రొయ్యలు 100-120 రోజు ల పెంపకం తర్వాత మార్కెటింగ్ చేయవచ్చు. పెరుగుదలలో వ్యత్యాసాన్ని బట్టి ప్రతి 15-20 రోజులకు పెద్ద సైజు మగ రొయ్యలను మార్కెటింగ్ చేసుకోవాలి.
- నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి,సూర్యాపేట జిల్లా

మంచి లాభాలు

మంచీనీటి రొయ్యల పెంపకం చేపట్టాలనుకునే రైతులకు నీలకంఠ రొయ్య లాభదాయకంగా ఉంటుంది. ఇది వేగంగా పెరుగడమే కాకుండా ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుంటుంది. వీటి పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయబడిన చెరువులలో ఉచితంగా వీటి పిల్లలను వదిలింది. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. రొయ్యలతో పాటు కార్ప్ చేపలైన బొచ్చె, రాగండి, వెండిచేప వంటి వాటిని మిశ్రమంగా పెంపకం చేపడితే మరింత మంచి ది. చేపల పెంపకానికి ప్రభుత్వం అంది స్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకుంటూ రొయ్యల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలను పొందవచ్చు.
prawns2
b-lava-kumar

1190
Tags

More News