చేపలకు అందించే ఆహార రకాలు

Wed,October 3, 2018 11:37 PM


fish

మేత రకాలు

1.సహజ ఆహారం
2.కృత్రిమ ఆహారం లేదా అనుబంధ ఆహారం

సహజ ఆహారం: చెరువులోని నీటిలో సహజంగా దొరికే ప్లాంక్టాన్స్ (వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు) నీటి మొక్కలు, నీటి పురుగులు వాటి లార్వాలు, చిన్న చిన్న నత్తగుల్లలు మొదలై వాటిని సహజ ఆహారం అంటారు. అన్ని చేపలు ఒకే రకమైన ఆహారాన్ని ఇష్టపడవు.

ఉదాహరణ: బొచ్చె జంతు ప్లవకాలను ఇష్టపడుతుంది. వెండి చేప వృక్ష ప్లవకాలను, గడ్డిచేప (గ్రాస్ కార్ప్) ఎక్కువ నీటి మొక్కలను ఇష్టపడుతుంది.

ప్లాంక్టాన్ బ్లూమ్స్: చేపల సాగులో అప్పుడప్పుడు మైక్రోసిస్టిస్, అస్టోరియా, నాస్టాక్, స్పైరులినా, వంటి ఆకుపచ్చ శైవలాలు పెరిగి నీటిపై తెట్టుగా ఏర్పడి చేపల మరణానికి దారితీస్తాయి. కాబట్టి ఇవి రాకుండా తగిన నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి.

fish4

అనుబంధ ఆహారం/ కృత్రిమ ఆహారం

చేపల పెరుగుదలకు కావల్సిన పోషక విలువలైన మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతుల్యంగా ఉండి చేపలకు కావాల్సిన శక్తిని ఇచ్చి శరీర నిర్మాణానికి దోహదపడాలి. తవుడు, వేరుశనగ చెక్క, నువ్వుచెక్క, పత్తిచెక్క, పొద్దు తిరుగుడు చెక్క మొదలైన వాటిని కలిపి తయారీ చేసే మేతను అనుబంధ ఆహారం అంటారు.

తయారీ చేసే విధానం: అనుబంధ ఆహారం తయారు చేసేటప్పుడు చేపఆహారపు అలవాట్లు, చేపల రకం, చేప సైజు, ముడిపదార్థాల ఖరీదు, పోషక విలువలు దృష్టిలో పెట్టుకుని తయా రు చేసుకోవాలి.

మేత నాణ్యత: మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు పాడై మురికి వాసన రాకుండా వాటి రంగు సహజంగా ఉండాలి.

ఎప్లోటాక్సిన్స్: మేతలో బూజు పట్టిన నూనె గింజలు, చెక్కలను వాడినప్పుడు, మేతలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సార్లు ఆస్పర్జిల్లస్ వంటి ఫంగస్ వల్ల ఎప్లోటాక్సిన్ అనే విష పదార్థం ఏర్పడి చేపల కాలేయం పాడవటానికి ఆస్కారం ఉన్నది.

fish5
నిల్వ చేసుకోవడం: మేతను సంచులలో నింపి ఎప్పుడు నేల మీద పెట్టకుండా చెక్క బల్లలపై పొడిగా ఉన్న తక్కువ వెలుగువచ్చే ప్రాంతంలో ఉంచాలి. మేత సంచులను నిల్వ ఉంచేటప్పుడు గాలి తగిలే విధంగా మూడు, నాలుగు వరుసల మధ్య ఖాళీ ఉంచాలి. మేతను బయట ఎండలో ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మేతలోని విటమిన్లు, కొవ్వులు చెడిపోతాయి.
మేత ఖరీదు: చేపల సాగు వ్యయంలో 50-60 శాతం మేతకే అవుతుంది. మనం తయారుచేసే మేతను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవాలి. అదే విధంగా మేత వినిమయ నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉండేటట్లు మేతను దానిలో వాడే ముడి పదార్థాలను ఎంచుకోవాలి.

fish2

మేత ఇచ్చే పద్ధతులు

వెదజల్లడం: మేత ఎక్కువగా నీటిలో కరిగి చెరువు అడుగున చేరిన నిరుపయోగమవుతుంది. చేపలకు సరిగా అందదు.

సంచులలో మేత కట్టడం: మేతను చిల్లులు చేసిన ప్టాస్టిక్ సుంచుల్లో నింపి ఆ సంచులను చెరువులో పాతిన వెదురు కర్రలు లేదా నైలాన్ తాళ్ళను వేలాడదీయాలి. ఈ పద్ధతిలో 10-25 సంచులను ఒక హెక్టారుకు వాడుతారు. చేపపిల్లల ద్వారా మేతను తీసుకుంటాయి. 3-6 గంటల కాలంలో దాదాపు మొత్తం మేతను తీసుకుంటాయి. మేత వృథా అవ్వదు.

ట్రేలను ఉపయోగించడం: ఈ పద్ధతిలో చెరువులో అక్కడకక్కడ పీడ్ ట్రేలను పెట్టి చేపల సాంద్రతను అనుసరించి సరిపడేంత మేతను ట్రేలో వేస్తారు.

fish3
మేత పరిమాణ అంచనా: దిగుబడి లక్ష్యం తక్కువగా ఉంటే చేపల సంఖ్య తక్కువ వేసుకుంటే అనుబంధ ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. చేపల సైజును బట్టి వాతావరణ పరిస్థితి ముఖ్యంగా ఉష్ణోగ్రతను బట్టి చేప బరువులో 2.5 శాతం మేతను ఇవ్వాలి.

మేత షెడ్యూలు: మేతను చేప పిల్లలు అయితే ఉదయం, సాయంత్రం సమపాలల్లో విభజించి ఇవ్వాలి. పెద్ద వాటికైతే సూర్యోదయం తర్వాత ఇవ్వాలి. ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయంలో మేతను ఇవ్వకుండా ఉంటే మంచిది. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై కాలంలో ఎక్కువగా మేతను ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చేపల ఆకలి మందగిస్తుంది. కాబట్టి ఆహారం ఎక్కువగా తీసుకోవు. కచ్చితమైన నాణ్యత కలిగిన మేతను పై వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. కచ్చితమైన పరిమాణంలో, కచ్చితమైన స్థానంలో, కచ్చితమైన సమయాన్ని ఇవ్వాలి. దీనివల్ల చేపల సాగులో మంచి దిగుబడులు సాధించవచ్చు.
- నట్టె కోటేశ్వర్‌రావు,
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,
9989944945

2621
Tags

More News