ఆరుతడి పంటగా కందికి అనుకూలం

Wed,October 3, 2018 11:34 PM

-ఎకరాకు 8-10 కిలోల విత్తనాలు అవసరం
-అవసరానికి తగిన ఎరువులనే వాడాలి
-కలుపు నివారణకు జాగ్రత్తలు పాటించాలి
-అవసరమైనప్పుడు నీటి తడులు ఇవ్వాలి

kandhi
గరిడేపల్లి: యాసంగి పంటగా వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగుచేసుకోవచ్చు. సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తక్కువనీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ పంట సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చు. తద్వారా రైతులు ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. కంది సాగులో పాటించాల్సిన పద్ధతులను గురించి వారు తెలిపిన వివరాలు.

అనువైన ప్రాంతాలు: నీటి వసతి ఉంటే యాసంగి పంటగా కందిని ఏ ప్రాంతంలోనైనా సాగు చేయవచ్చు.

అనువైన రకాలు: ఎల్‌ఆర్‌జి41, ఐసిపిఎల్ 85063 (లక్ష్మీ), ఐసిపిఎల్ 87119 (ఆశ), డబ్ల్యూఆర్‌జి 27, డబ్ల్యూఆర్‌జీ 65 (రుద్రేశ్వర), ఎల్‌ఆర్‌జి 52, ఐసిపిహెచ్ 2740 (మన్నెకొండ) రకాలు ముఖ్యమైనవి.

విత్తే సమయం: సెప్టెంబర్-15 నుంచి, అక్టోబర్-15 వరకు నాటుకోవాలి.

విత్తన మోతాదు: 8-10 కిలోలు హెక్టారుకు బలమైన భూమిలో 90X90 సెం.మీ (అచ్చుపద్ధతి), బలం తక్కువగా ఉన్న భూముల్లో 60X60 సెం.మీ ఆరుతడి పంటగా నాటుకోవాలి.

విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ లేదా కాప్టాన్‌ను పట్టించాలి. విత్తడానికి గంట ముందు రైజోబియం కల్చర్ చేయాలి.

ఎరువులు: 40 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను హెక్టారుకు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. నత్రజనిలో సగభాగం 20 కిలోలు దుక్కిలో మిగిలిన 20 కిలోలు పంట 35-40 రోజుల మధ్యలో వేయాలి.

అంతరకృషి: కంది పంటను 30 నుంచి 40 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజుల తర్వాత సైతం పిచికారీ చేయాలి. కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఇమిజితాపైర్ మందును (పర్‌స్యూట్) 600-750 మి.లీ. హెక్టారుకు 500 లీటర్‌ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొదటి రెండు నెలల వరకు తరచుగా గొర్రు లేదా దంతెల ద్వారా అంతరకృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు.

నీటి తడి: యాసంగిలో రెండు లేదా మూడు తడులు ఇవ్వాలి. మొగ్గలు రాబోయే ముందు ఒకసారి, కాయలు ఏర్పడే ముందు మరోసారి తప్పకుండా తడి ఇవ్వాలి.

సస్యరక్షణ: పచ్చపురుగు నివారణకు వేపనూనె/ వేపగింజల కషాయం (5 శాతం), జీవన పురుగు మందులైన ఎన్‌పివి (500 ఎల్.ఈ) హెక్టారుకు సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరిపైరిఫాస్ 50 ఈ. సీ 1.5 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మారుకా ఆకుచుట్టు పురుగు నివారణకు మొదటి దశలో వేప గింజ ల కషాయం లేదా వేప నూనె పిచికారీ చేయాలి. దీనివల్ల రెక్కల పురుగులు గుడ్లు పెట్టడం నివారించబడుతుంది. పురుగు ఆశించిన వెంట నే డై క్లోరోవాస్ 1 మి.లీ. తో పాటు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ./ క్వినాల్‌ఫాస్ 2 మి.లీ/ నోవల్యురాన్ 1 మి.లీ./ స్పైనోశాడ్ 0.3 మి.లీ.ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్ల నివారణ: ఎండు తెగులు (ప్యుజేరియం) వంటి వాటిని తట్టుకునే రకాలను సాగుచేయాలి. వీటిని నివారించేందుకు పంట మార్పిడితో జొన్నలాంటి పంటలను సాగు చేయాలి. ట్రైకోడెర్మా విరిడి కేజీ విత్తనానికి 10 గ్రాములను గంజిలో కలిపి పట్టించి విత్తుకోవాలి.

ఆరుతడి పంటగా మంచి ఫలితాలు

నీటి వసతి ఉన్నచోట కందిని ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. తగిన యాజమాన్య పద్ధతులను పాటిం చి మంచి ఫలితాలను పొందవచ్చు. కలుపు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు దానిలో అవసరమైనప్పుడు తగిన మోతాదులో మందులను పిచికారీ చేయాలి. అవసరమైనప్పుడు నీటి తడులు ఇస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. అంతేకాకుండా కందిని ఇతర పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చేసుకుంటే ఆర్థికంగా బాగుంటుంది.
- టి.యాదగిరెడ్డి, కేవీకే శాస్త్రవేత్త,
గడ్డిపల్లి, 9440481279

895
Tags

More News