కాయగూర పంటల్లో తెగుళ్ల నివారణ

Wed,September 26, 2018 11:01 PM

యాసంగిలో కూరగాయల పంటల్లో ముఖ్యమైనవి కాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటా, వంకాయ, ఉల్లి మొదలైనవి. అయితే ఈ పంటలకు వివిధ దశల్లో అనేక రకాలైన తెగుళ్లు ఆశిస్తాయి. పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ పంటలను ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనవి మాగుడు తెగులు, ఆకుమచ్చ, కాయకుళ్లు, పల్లాకు తెగులు. ఈ తెగుళ్లను సమర్థవంతంగా నివారించకపోతే పంట దిగుబడులు బాగా తగ్గిపోవడమే కాకుండా, కాయ నాణ్యత కోల్పోతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి ఈ తెగుళ్ల లక్షణాలు, వాటి నివారణ పద్ధతులు తెలుసుకుందాం.
cabbagy

మాగుడు తెగులు:

ఈ తెగులు యాసంగిలో సాగు చేసే అన్ని కూరగాయల్లో ఎక్కువగా నారుమడిలో కనిపిస్తుంది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు నారుమడిలో నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది.

నివారణ: ఈ తెగులు రాకుండా ఉండటానికి నారు ఎత్తైన నారుమళ్లలో పెంచాలి.
విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరమ్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి.
విత్తిన తర్వాత రెండుసార్లు అంటే విత్తిన తర్వాత 3వ రోజున ఒకసారి, 10 రోజున ఒకసారి లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి నారుమడి తడిచేలా పిచికారీ చేయాలి.

Califlower2

క్యాబేజీ, కాలీఫ్లవర్

ఆకుమచ్చ తెగులు
ఈ తెగులు ఒక రకమైన శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. దీనివల్ల ఆకులపైన బూడిద రంగులో ఉన్న గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతా వ్యాపిస్తాయి. తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి.

నివారణ: తెగులు కనిపించిన వెంటనే టెబ్యుకోనజోల్ మందును లీటరు నీటికి 1.5 మి.లీ చొప్పున కలిపి లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

ఆకు ఎండు తెగులు

ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఇది నారుమడిలోనూ, నాటిన పొలంలోనూ కనిపిస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు ఆకుల నుంచి పసుపు రంగులోకి మారుతాయి. ఈనెలు నల్లబడి, కాండం కుళ్లిపోతుంది. ఒక్కొక్కసారి ఈ తెగులు పువ్వులకు కూడా వ్యాపించి పువ్వు కుళ్లిపోతుంది.

నివారణ: పొలంలో ఈ తెగులు ఒకసారి కనిపిస్తే పంట మార్పిడి అవలంబించాలి. తెగులు కనిపించిన వెంటనే కార్బండిజం మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ తడుపాలి. దీనివల్ల తెగులు వ్యాప్తి కొంతవరకు అరికట్టవచ్చు.
-పొలంలో లోతుగా దుక్కులు దున్నాలి. పశువుల ఎరువును వాడుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. దుక్కిలో వేప పిండి వాడుకోవాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.

tomato

టమాటా

వెర్రి తెగులు, ఆకు ముడత
-ఈ తెగులు సోకిన ఆకుల కింద ముడుచుకుని ఉంటాయి. ఆకులు చిన్నగా ఉండి మొక్కలు గిడసబారి ఉంటాయి. ముడుచుకున్న ముదురు ఆకు లు పెళుసుగా ఉంటాయి. వాటిని తాకినప్పుడు విరిగిపోతాయి. మొక్కలు వాడిపోయి, ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. కొన్నిసార్లు పూత కూడా పూయదు. ఈ తెగులు పంట నాటిన 20వ రోజు నుంచి కన్పిస్తే 92 శాతం వరకు నష్టం ఉంటుంది. అదే 35-50 రోజుల మధ్య అయితే నష్టం 75 శాతం వరకు ఉంటుంది.
-ఈ తెగులు దోమ ద్వారా వ్యాపిస్తుంది. అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ పురుగుల ఉధృతి ఉండటం వల్ల ముడత కూడా అదే సమయంలో ఎక్కువగా ఉంటుంది.

నివారణ: నాటడానికి 10 రోజుల ముందు నారుమడి మీద డైమిథోయేట్ లేదా మిథైల్ డైమిటాన్ (మెటాసిస్టాక్) 2 మి.లీ లేదా ఇమిడా క్లోప్రిడ్ 3 మి.లీ పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-పొలంలో తెగులు సోకిన మొక్కలు కనిపించిన వెంటనే పీకివేయాలి. వాటిని దూరంగా తీసుకువెళ్లి తగులబెట్టాలి. తర్వాత పంటపై పైన తెలిపిన మందులను పిచికారీ చేయాలి.

కాయకుళ్లు తెగులు

పంట కాత కాసే సమయంలో మంచు ఎక్కువగా ఉంటే అనేక రకాల శిలీంధ్రాలు కాయలను ఆశిస్తాయి. కాయలపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు పెద్దవి అయి కాయలు కుళ్లిపోతాయి.

నివారణ: లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండిజం లేదా డైథేన్ ఎం-45 1.5 గ్రాముల చొప్పున లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసి ఈ తెగులును నివారించవచ్చు.

ఆకుమచ్చ తెగులు

ఆకులపై గుండ్రిని మచ్చలు ఏర్పడుతాయి. అవి పెద్దవై ఆకులు పసుపుబారి రాలిపోతాయి.

నివారణ: తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే డైథేన్ ఎం-45 మందును లీటరు నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసి ఈ తెగులును నివారించవచ్చు.

పైన తెలిపిన అన్నిరకాల తెగుళ్లను అదుపులో పెట్టడానికి పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. పొలంలోనూ, పొలం చుట్టూ కూడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

1149
Tags

More News