‘పట్టు’ కోసం ఆధునిక పరిజ్ఞానం

Wed,September 26, 2018 10:59 PM

-ఆటోమేటిక్ యంత్రాల దిగుమతి..
మల్బరీసాగు, సిల్క్ ఉత్పత్తిపై దృష్టి
-మార్కెట్‌ను అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ పట్టు పరిశ్రమశాఖ నిర్ణయం
-చైనా టెక్నాలజీని అధ్యయనం చేసిన పట్టు పరిశ్రమశాఖ అధికారుల బృందం
పట్టు ఉత్పత్తికి పుట్టినిల్లు అయిన చైనాలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, మల్బరీ సాగు, పట్టు ఉత్పత్తి పెంచడంపై పట్టు పరిశ్రమ దృష్టి సారించింది.ఈ మేరకు ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలను దిగుమతి చేసుకోవాలని, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల కమిషనర్ ఎల్.వెంకట్రామి రెడ్డి నేతృత్వంలో చైనాలోని షాంఘై, సుజాన్, డానియంగ్, జోంకింగ్, ఎర్లింగ్, జీ, జోక్సన్ తదితర ప్రాంతాలలో వారంరోజుల పాటు పర్యటించి అధికారుల బృందం సోమవారం అధ్యయన నివేదికను తయారు చేసింది.
technology
మల్బరీ సాగుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్న ది. ఏటా ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. నాలుగేండ్ల కిందట 3,144 ఎకరాల్లో మల్బరీసాగు చేయగా, ఇప్పుడు 10 వేల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగిపోయింది. గత ఏడాది 2,800 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యింది.1,106 మెట్రిక్ టన్నులు ఇక్కడ వినియోగించారు. రీలింగ్ యూనిట్లు లేకపోవడంతో 1.634 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు పంపించాల్సి వచ్చింది. పట్టుదారం వినియోగం పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, కొత్తకోట, సిరిసిల్ల తదితర ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటున్నది. ఒక్క పోచంపల్లిలోనే రోజుకు 100 కిలోల పట్టుదారం అవసరం అవుతున్నది. అయితే ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు అందుబాటులో లేకపోవటంతో పట్టు దారం తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇటీవల సూర్యాపేట, షాద్‌నగర్, జనగామ, వరంగల్‌లో నాలుగు ఆటోమేటిక్ యూనిట్లు ఏర్పాటు చేశారు. పట్టుపరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. దీంతో చైనా దేశం నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు దిగుమతి చేసుకోవాలని పట్టుపరిశ్రమశాఖ అధికారులు నిర్ణయించారు. వందశాతం టెక్నాలజీ వినియోగంతోనే చైనాలో పట్టుపరిశ్రమ అసాధారణ ఫలితాలు సాధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత మొదటిస్థానంలో జపాన్, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో ఇండి యా ఉండేవి. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవటంతోనే చైనా మొదటిస్థానానికి చేరిందని కమిషనర్ ఎల్.వెంకట్రామి రెడ్డి తెలిపారు.

pattu

రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు..

చైనాకు ధీటుగా రాష్ట్రంలో మల్బరీ సాగు, పట్టుదారం ఉత్పత్తికి పరిస్థితులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలు పట్టుపరిశ్రమకు ఒకప్పుడు కేంద్రాలుగా ఉండేవి. అర్బనైజేషన్, ప్రోత్సాహకాల తగ్గింపుతో ఆయా రాష్ర్టాల్లో వెనుకబడింది. రాష్ట్రంలో పట్టు సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహాకా లు ఇస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ మదన్‌మోహన్ తెలిపారు. కిలోకు రూ.75 చొప్పున ఇన్సెంటివ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చైనాలో మ్యాన్‌పవర్ ఖర్చు రూ. 700 ఉంటే... ఇక్కడ రూ.300 ఉన్నది. ఉత్పత్తి విలువ తక్కువగా ఉంది. చైనాలో 100 గుడ్ల నుంచి 50 కిలోల నుంచి 60 కిలోల పట్టు తీస్తుంటే.. తెలంగాణలో 70 నుంచి 80 కిలోలు పట్టు తీసున్నారు. నష్టశాతం కూడా తక్కువగా ఉన్నది. పట్టు ఉత్పత్తి వ్యయం కిలోకు రూ. 450 ఉంటే...చైనాలో రూ.650 అవుతున్నది.

ఈ అంశాలన్నింటితో పాటు, రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పాలసీ కూడా పట్టు పరిశ్రమ వృద్ధికి దోహద పడుతుందని కమిషనర్ ఎల్.వెంకట్రామి రెడ్డి తెలిపారు. చైనా పట్టును ఎగుమతి చేసే అమెరికా, జర్మనీ, ఇటలీతో పాటు కొనుగో లు సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఐరోపా దేశాల మార్కెటింగ్‌పై దృష్టి సారించనున్నట్లు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు.
-మజ్జిగపు శ్రీనివాస్ రెడ్డి, 8096677036

1003
Tags

More News