రసాయన మందుల వాడకం మోతాదు మించొద్దు

Wed,September 26, 2018 10:57 PM

రైతులు తమకు ఉన్న నీటి వనరులను ఆధారంగా చేసుకుని అవకాశం ఉన్నకాడికి వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఆ పంటల నుంచి ఎలాగైనా అధిక దిగుబడులు సాధించాలన్న ఆలోచనతో ఇష్టం వచ్చిన రీతిలో మోతాదుకు మించి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతో పంటల దిగుబడిలో ఆయా మందుల అవశేషాలు మిగిలి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా వాటిని సరైన పద్ధతుల్లో పిచికారీ చేయకపోవడంతో మందులు పిచికారీ చేస్తున్న వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది. కాబట్టి పంటలపై వినియోగించే సస్యరక్షణ మందుల కొనుగోలు, సరైన మోతాదులో మందులు కలుపడం, పిచికారీ చేయడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మందుల వాడకంలో రక్షణ చర్యల గురించి వారు తెలిపిన వివరాలు..
rice
-పంటలకు ఏ తెగులు, ఏ పురుగు సోకిందో గుర్తించాలి. ఆయా తెగుళ్ళు, పురుగుల నివారణకు అవసరమైన మందులను వ్యవసాయ నిపుణులు సిఫారసు చేసిన మందులు తెచ్చుకోవాలి. ఏ సమయంలో పిచికారీ చేయాలో, ఏ రకమైన మందులను కలిపి వాడుకోవచ్చో ముందే స్పష్టంగా తెలుసుకోవాలి.
-గుర్తింపు పొందిన కంపెనీల లేబుల్, సీళ్ళు సరిచూసుకోవాలి. సీసాలకు మూతలు బిగించిన తర్వాత వేసిన సీళ్ళను పరిశీలించాలి.
-లైసెన్సు పొందిన దుకాణాల్లోనే మందులను కొనుగోలు చేయాలి. అవసరానికి మించి మందులను కొనుగోలు చేయవద్దు.
-కొనుగోలు చేసి మందులను ఇంటి వద్ద నిల్వ చేయడం మంచిది కాదు. పురుగు మందులను ఎక్కువ కాలం నిల్వ చేస్తే వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. కొనుగోలు చేసేటప్పుడు వాటి తయారీ తేదీని చూసుకోవాలి.
-తెగుళ్ళు, పురుగు మందుల పనితీరు వేరుగా ఉంటుంది. వాటిని కలిపి వాడేటప్పుడు ఏ మందులో ఏది కలిపితే సమర్థవంతంగా పని చేస్తుందో సూచించిన ప్రకారం వాడుకోవాలి. విచక్షణారహితంగా అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయకూడదు.
పిచికారీ చేసేటప్పుటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-పురుగు మందులు వాసన చూడకూడదు.
-పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో ఆహార పదార్థా లు తినడం, నీరుతాగడం, చుట్ట సిగరెట్ కాల్చడం వంటివి చేయకూడదు.
-పొడి మందులు ఉదయం 9 గంటలలోపు, సాయంత్రం నాలు గు గంటల తర్వాతనే పిచికారీ చేయాలి.
-మందులు పిచికారీ చేసేందుకు వాడే పరికరాలకు రంధ్రాలు లేకుండా జాగ్రత్త పడాలి.
-మందులు పిచికారీ చేయడం పూర్తి అయిన తర్వాత కూడా సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి.
-సీసా మూతలను నోటితో తీయడం, బకెట్లలో మందులను చేతులతో కలుపడం వంటివి చేయకూడదు.
-నీటిలో కరిగే పొడి మందులను ఒకేసారి నీటిలో పోసి కలుపకూడదు. మొత్తం మందు పొడిని కొద్ది నీటిలో పోసి కర్రతో కలిపిన తర్వాత మరికొంత నీరుపోసి పలుచగా చేసి ఆ తర్వాత నిర్ణీ త మొత్తం నీటిలో కలుపాలి.
-మబ్బులు పట్టి జల్లులు పడే సమయంలో, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సస్యరక్షణ మందులు జల్లకూడదు. గాలి వీచే వైపు చలాల్లి. పంటపొలాల్లో గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు.
-పిచికారీ చేసే సమయంలో మాస్కులు, గమ్‌బూట్లను, రబ్బరు గ్లౌజులను, పొడవు చేతి చొక్కాలను తలకు, నోటికి, ముక్కుకు కట్టుకునే వస్ర్తాలను ధరించాలి.
-ఖాళీ మందు సీసాలను, డబ్బాలను కడిగి వాడవద్దు. వాటిని పాతి పెట్టాలి. మందులు పిచికారీ చేసిన తర్వాత కనీసం వారం, పది రోజుల వరకు పంటను కోయకూడదు.
-నట్టె కోటేశ్వర్‌రావు
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా, 9989944945

రోగాన్ని బట్టి మందులు

పంటలకు వచ్చిన రోగ లక్షణాలను పూర్తిగా పరిశీలించాలి. ఆ తర్వాత రోగాన్ని నిర్ధారించుకోవాలి. దానికి అవసరమైన మందుల ను వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకా రం మాత్రమే కొనుగోలు చేయాలి. వాటిని తగిన మోతాదులోనే పిచికారీ చేయాలి. అలాగే గాలి ఎదురుగా మందులను పిచికారీ చేయకూడదు. మబ్బులు పట్టినప్పు డు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం సరికాదు. తగిన జాగ్రత్తలు పాటి స్తూ మందులను పిచికారీ చేస్తే పంట చేలపై రోగాలు నివారించబడుతాయి. పిచికారీ చేసే వారికి ఏ ఇబ్బందులు ఉండవు.

yadagiri-reddy

3311
Tags

More News