కరువులోనూ రక్షక కవచం

Thu,September 20, 2018 01:39 AM

మారిన వాతావరణ పరిస్థితుల వల్ల అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు సమృద్ధిగా పడితే పరవాలేదు. కానీ ఆశించినదానికంటే తక్కువ వర్షపాతం నమోదైతే ఇబ్బందులు తప్పవు. వేసిన పంటలు నీటి లేమితో ఎండిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ భూముల్లో పడే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనికోసం రైతులు తమ భూముల్లో కందకాలు తవ్వుకోవాలి. దీంతో కురిసే ప్రతి చినుకు భూమిలోకి ఇంకిపోతాయి. ఫలితంగా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చు.
BIG
రాష్ర్టానికి చెందిన రిటైర్డు ఇంజినీర్లు రైతులు చేనుల్లో కందకాలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి ఇప్పటికే ప్రచా రం చేస్తున్నారు. వర్షం పడిన సమయంలో ఒడిసిపట్టిన నీళ్లు భూమిలో ఇంకితే సంవత్సరం పొడవునా ఎలాంటి నీటి కొరత ఏర్పడదు. అయితే దీన్ని మాటల్లోనే కాకుండా కొందరు రైతులు ఆచరణలో పెడుతున్నారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమ ఫలితాలను రైతులకు చూపెడుతున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఖర్చు కూడా తక్కువే

కందకం (ట్రెంచ్)అంటే రైతులకు తెలిసిన పదమే. రైతులు తమ పొలాల్లోనే ఆ కందకాలు తవ్వుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. కందకాలు తవ్వుకోవడం ద్వారా మన చేనులోనే సమృద్ధిగా నీరును నిల్వ చేసుకోవచ్చు. ఈ కందకాల్లోకి వచ్చిన నీరు భూగర్భంలోకి వెళ్లి ఎంతటి కరువు కాటకాల్లో అయినా చేనుకు ఉపయోగపడేలా నీటిని అందిస్తాయి. కందకాలను తవ్వుకోవడం వల్ల ఎకరానికి రెండు శాతం భూమి కంటే ఎక్కువ నష్టం ఉండదు. భూమి రకాన్ని బట్టి, భూమి ఉన్న స్థితిని బట్టి అనువైన చోట కందకాలను తవ్వుకోవడం ద్వారా నీటిని నిల్వ చేసుకోవటమే కాదు, భూమిలో దాచుకోవచ్చు. మన అవసరానికి తగ్గట్టు నీటిని వాడుకోవచ్చు. ఎకరంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ కందకాలు తీసుకోవచ్చు.

అందుకు రెండు వేల వరకు ఖర్చవుతుందని రిటైర్డు ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. చేనులో వాలుకి అడ్డంగా మీటరు వెడల్పు, మీటరు లోతుతో చేను ఈ కొన నుంచి ఆ కొన వరకు ప్రతి 25 మీటర్లకు ఐదు మీటర్లు వదిలి తవ్వుతూ ఉండాలి. తవ్విన మట్టిన కిందివైపున వేయాలి. అయితే ఒక కందకానికి మరో కందకానికి కనీసం 50 మీటర్ల దూరం ఉంటే మంచి ది. ఒకసారి వర్షం పడి కందకం నిండితే ఏడాది పొడవునా నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కందకాలు తవ్వడం వల్ల, ఎండిపోయిన 35 అడుగుల లోతు బావి నిండటంతో పాటు, పొలంలో ఎండిపోయిన బావులు కూడా నిండాయని తెలంగాణ రిటైర్డు ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి తన అనుభవాన్ని తెలియజేశారు. గతంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనేవాళ్లు. ఇప్పుడు కందకాల వల్ల మామిడి, బత్తా యి తోటలకు నీటి కొరత లేదని రిటైర్డు ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కందకాలతో నీటి కొరత తీరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే చెరువుల్లోని మట్టిని రైతులు పొలాలకు తరలించుకుంటున్నారు. దీనిద్వారా రసాయనాల వాడకాలు తగ్గుతాయి. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు. దీనికితోడు రైతులు కందకాలు తవ్వుకోవడం వల్ల నీటి ఇబ్బందులు తప్పి ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

మహారాష్ట్రలో అహ్మద్‌నగర్ జిల్లాలో హివురే బజార్ అనే గ్రామం లో రైతులు తమ పొలాల్లో కందకాలు తీసుకోవడం వల్ల అక్కడ కరువు పరిస్థితులను అధిగమించారు. అక్కడ బోర్ వెల్ కాకుండా బావుల ద్వారా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినర్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు తమ పరిశీలన ద్వారా వెల్లడయినట్లు తెలిపారు. ఇదే కోవలో రాజస్థాన్‌లో వెదిరె శ్రీరామ్ కూడా నీటి సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టి మంచి ఫలితాలు సాధించారు.
ఇలాంటి కార్యాచరణ, అనుభవాలు, ఫలితాల నేపథ్యంలోనే నీటి సంరక్షణ కార్యక్రమాలను రైతులు వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ చేపట్టి నీటి కరువును అధిగమిస్తున్నారు.

కందకాలు తవ్వుకోవటం ద్వారా అప్పటిదాకా ఎదుర్కొన్న కరువు కాటకాలను పారదోలిన ఇబ్రహీంపూర్ (సిద్దిపేట జిల్లా) విజయగాథ ఆసక్తికరం. ఆ గ్రామానికి ఎలాంటి స్థిరమైన సాగునీటి వసతి, నీటి వనరుకు మూలాధారమైన చెరువు లాంటివి లేవు. ఉన్నా చిన్న పాటి చెరువు కరువు కారణంగా ఎండిపోయింది. దీంతో ఊరులోని రైతులంతా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. వ్యవసాయం తప్ప మరో జీవనోపాధి లేని ఇబ్రహీంపూరు రైతులు తమకున్న భూముల్లో ఎకరమో, అర ఎకరమో సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. కొందరు వాటర్ షెడ్ నిపుణులు, ఇత పర్యావరణవేత్తల సూచనల మేరకు నాలుగేండ్ల కార్యాచరణలో భాగంగా ఆ ఊరంతా కందకాలను తవ్వుకున్నారు. మొత్తంగా ఆ ఊరు ప్రజలంతా తమకున్న ఆరు వందల ఎకరాల్లో అనువైన చోటల్లా కందకాలు తవ్వుకున్నారు.

దీంతో వానలు పడినప్పుడు ఆ కందకాలు వర్షపు నీటితో నిండి, ఆ నీరంతా భూమిలోకి ఇంకిపోయింది. దీంతో భూ గర్భజలాలు పెరిగి ఎండిపోయిన బావులు, బోరుబావుల్లో నీరు అందుబాటులోకి వచ్చింది. ఎకరం, అర ఎకరం వరకే సాగుచేసుకునే రైతులంతా తమకున్న మూడు నాలుగెకరాలను సాగుచేసుకునే స్థితి వచ్చింది. దీంతో ఆ గ్రామం రూపు రేఖలే మారిపోయాయి. సాగుకు వీలైన భూమంతా సాగులోకి రావటంతో పాటు, ఆ గ్రామంలో కూరగాయలు పండిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధిపథంలో తీసుకుపోతున్నారు.

-ఆసరి రాజు

తక్కువ ఖర్చుతో విస్తృత ప్రయోజనాలు

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ సగటు వర్షపాతం 1000 మి.మీటర్లు. అదే దక్షిణ తెలంగాణలో 700 మి.మీటర్లు. 600 మి.మీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతంలోనూ ఈ కందకాల వల్ల ఎకరానికి 24 లక్షల లీటర్ల నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటితో వరి, చెరుకు, అరటి పంటలు కాకుండా మిగతా పండించుకోవచ్చు. 1000 మి.మీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 40 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటితో అన్నిరకాల పంటలు పండించవచ్చు. రైతు ఎకరానికి రూ. 2000 నుంచి 2500 ఖర్చుపెట్టుకుంటే ఎవరిమీద ఆధారపడకుండా భూగర్భజలాలు పెంపొందించుకోవచ్చు.
-మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 9963819074,
రిటైర్డు ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

832
Tags

More News