మిద్దెతోట సాగుపై హైదరాబాదీల ఆసక్తి

Thu,September 13, 2018 01:21 AM

-ఇతర నగరాలు, పట్టణాల్లో అమలుకు కృషి
-ఉద్యానశాఖ కమిషనర్ ఎల్. వెంకట్రామిరెడ్డి

ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న మిద్దెతోట సాగుపై హైదరాబాద్‌లోని ప్రజ ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. రసాయనాలు లేని సేంద్రియ ఎరువులతో తాజా కూరగాయలను పండించడంపై దృష్టి సారించారు. దీంతో తాజా కూరగా యలతో మంచి పోషకాలు అందడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నట్టు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్. వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను రైతుబడికి ఆయన వివరించారు. వారి మాటల్లోనే..
COH

మన ఇల్లు.. మన కూరగాయలు

ప్రభుత్వం 2010లో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మన ఇల్లు- మన కూరగాయలు పథకాన్ని ప్రారంభించింది. జంట నగరాల్లో సుమారు 25 లక్షల ఇండ్లు ఉన్నాయి. శరీరానికి వ్యాయామంతోపాటు స్వచ్ఛమైన కూరగాయలను ఎవరికి వారు సొంతంగా పండించుకునేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఇంటిపై సాగు (టెర్రస్ గార్డెనింగ్)కు శ్రీకారం చుట్టింది.

టెర్రస్ గార్డెనింగ్‌లో తెలంగాణ రెండో స్థానం

హైదరాబాద్‌లో ప్రస్తుతం అధికారికంగా 1,500 మంది, అనధికారికంగా మరో 8,500 మంది తమ ఇండ్లపై వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. వీరికి ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రెండు రకాల కిట్లను అందజేస్తున్నాం. మిద్దెలపై ఆకుకూరలు, కూరగాయలను పండించేందుకు ఆసక్తి కలిగిన వారికి సేంద్రియ ఎరువులను అందజేస్తున్నాం. రైతునేస్తం, ఇతర స్వచ్ఛంద సంస్థలతో వారానికోసారి సాగుదారులకు అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న అవగాహన సదస్సులకు ఉద్యానశాఖ ఆర్థికంగా సాయం అందిస్తున్నది. టెర్రస్ గార్డెనింగ్‌లో దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం జంట నగరాల్లో కొనసాగుతున్న టెర్రస్ గార్డెనింగ్ విధానాన్ని రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాల్లో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇంటిలో వాడిపడేసిన ప్లాస్టిక్ సీసా లు, బకెట్లు, పెయింటింగ్, కూలర్ డబ్బాల్లో వివిధ రకాల కూరగాయల విత్తనాలు, ఆకుకూరలను వేసుకోవచ్చు. ఆయా వస్తువుల్లో తగినంత పరిమాణంలో మట్టి, నీటిని పోసి ఉద్యానశాఖ అధికారులు సలహాలు, సూచనలతో యజమానులు నాణ్యమైన కూరగాయలను పండించుకోవచ్చు.
roof-garden

35 గ్రామాల్లో పంటకాలనీలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లోని 35 గ్రామాల్లో కొన్ని నెలల కిందట పంట కాలనీలను ఏర్పాటు చేశాం. 2,800 మంది రైతులు వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. రూ.40 కోట్లతో రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మల్చింగ్ నిర్వహణ, ఇంకుడు గుంతల తవ్వకాలు, వివిధ రకాల విత్తనాలను అందించాం.

జీడిమెట్ల, ములుగులో రైతులకు శిక్షణ

పంటకాలనీలు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రత్యేకంగా జీడిమెట్ల, ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ములుగులోని 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 75 రకాల పండ్ల తోటలను పెంచుతూ రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. జీడిమెట్లలోని సెంటర్‌లో పూలతోటలను పెంచుతున్నాం. ఈ రెండు సెంటర్లలో 1,500 ఎకరాల్లో ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 5,600 మందికి ఆయా పంటలపై శిక్షణ ఇప్పించాం. అందరికీ కలిపి 1.20 కోట్ల మొక్కలను పంపిణీ చేశాం.

పాలిహౌస్‌లతో లాభాలు

పాలిహౌస్ పథకం కింద రాష్ట్రంలో 1,500 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. పాలిహౌస్‌లో ఎకరానికి రూ.35 లక్షలు వ్యయమవుతుండగా, ఇందులో ఉద్యానశాఖ 75 శాతం సబ్సిడీ(రూ.25 లక్షలు) ఇస్తున్నది. ఈ పథకం కింద సాగుచేసే రైతులు ఏటా ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు లాభం పొందవచ్చు.

- మజ్జిగపు శ్రీనివాస్ రెడ్డి
8096677036

472
Tags

More News