అప్రమత్తతతోనే కత్తెర పురుగుకు అడ్డుకట్ట

Wed,August 22, 2018 10:48 PM

రాష్ట్రంలో మొక్కజొన్న పంటలో వ్యాపించిన కత్తెర పురుగు(ఆర్మీవార్మ్) నివారణపై అప్రమత్తమైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుకు అవసరమైన కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు యాజమాన్య పద్ధతులు పాటిస్తే పురుగును నివారించవచ్చని సూచిస్తున్నది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.
worm
మార్కెట్లో అందుబాటులో ఉన్న రసాయన పురుగుమందులను తగు విధంగా పిచికారీ చేయడం ద్వారా మొక్కజొన్న పంటను కత్తెర పురుగు బారి నుంచి కాపాడటమే కాకుండా.. ఇతర పంటలకు ఈ పురుగు వ్యాపించకుండా నివారించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాల యం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు రైతుబడికి తెలిపారు. ఉత్తరఅమెరికా, అర్జంటీనా, ఆఫ్రికా దేశాల్లో వెలుగులోకి వచ్చిన ఈ కత్తెర పురుగు ఇటీవల దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో మక్కజ్నొ పంటలో గుర్తించారని ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో మే 18న ఈ పురుగుకు సంబంధించిన లక్షణాలను చిక్కబళ్లాపూర్‌లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగ స్టు 8న వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సర్వే నిర్వహించి శాంపిల్స్‌ను బెంగళూరులోని- ఎన్‌బీఏఐఆర్‌కు పంపారు. అనంతరం ఐకార్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్, డిప్యూటీ డైరెక్టర్ (వ్యవసాయ పంటల శాస్త్రవేత్త)జనరల్ డాక్టర్ పి.కే చక్రబర్తి, వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.జగదీశ్వర్‌ల బృందం ఆగస్టు 18న నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని ఇప్పలపల్లి, గుమ్మకొండ, వెట్టం,నందివట్టెమాన్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి మొక్కజొన్న పంటలను పరిశీలించారు.అనంతరం ఈనెల 20న హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐకార్‌లో జరిగిన సమావేశంలో కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించినట్లు వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు.

కత్తెర పురుగును ఎలా గుర్తించారు..?

రాష్ట్రంలో వానకాలంలో మక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5.36 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 4.35 లక్షల హెక్టార్లలో రైతాంగం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మక్కజొన్న పంట ప్రాంతాలవారీగా 35 రోజుల నుంచి 85 రోజుల వయసులో ఉన్నది. మొక్కజొన్న పంటకు ప్రస్తుతం సమస్యగా కత్తెర పురుగుగా పిలువబడుతున్న స్పోడోప్టెరా ప్రూజిపెర్టా అనబడే ఈ లద్దెపురుగు ప్రజాతి కర్ణాటక రాష్ట్రంలోని హసన్, బేలూర్, షిమోగా ప్రాంతాల్లో మొదటిసారిగా గమనించాం. దీని ఆధారంగా మరికొన్ని పరీక్షల ద్వారా దేశంలో ఈ పురుగు ప్రవేశం గురించి ఐసీఏఆర్- ఎన్‌బీఐఎఆర్ ఆధీకృత ప్రకటన చేసింది. సాధారణంగా శీతల దేశాలైన అమెరికా వంటి దేశాలకే పరిమితమైన ఈ పురుగు 2016లో ఆఫ్రికా దేశాలలో వ్యాప్తి చెందింది. ఈ ఏడాది మనదేశంలో ప్రవేశించింది. ఈపురుగు మున్ముందు కాలంలో సమస్యగా మారటానికి అవకాశాలుండటంతో త్వరితగతిన వ్యాప్తించెందే గుణం కలిగిన ఈ పురుగు ఉధృతిని, తమతమ ప్రాంతాల్లో పురుగు ఉనికిని ఎప్పటికప్పుడు గమనిస్తూ రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మక్కజొన్న పంటలో ఈ పురుగు ఉధృతిని గుర్తించాం.

vc.praveen-rao
కత్తెర పురుగు నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలాంటి చర్యలు చేపడుతున్నది? రాష్ట్రంలో మక్కజొన్న పంటలో కత్తెర పురుగును గుర్తించిన వెంటనే దాన్ని నిర్ధారించేందుకు చర్యలు చేపట్టాం.ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు శాస్త్రవేత్తలు ఆగస్టు మొదటి వారం నుంచి విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్నారు. ఈ పురుగు ఉధృతి కరీంనగర్, నిజామాబాద్,జగిత్యాల, పెద్దపల్లి,నాగర్‌కర్నూల్, ఖమ్మం, వరంగల్, వికారాబాద్,మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రాథమిక సమాచారం మేరకు 5 నుంచి 60 శాతం వరకు ఉన్న ట్లు నిర్ధారించాం. 5 జిల్లాల నుంచి 46 శాంపీళ్లు సేకరించి ఆగస్టు 13న బెంగుళూరులోని నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్‌సెర్స్ రీసోర్స్ సెంటర్(ఎన్‌బీఏఐఆర్- జాతీయ వ్యవసాయ కీటక వనరుల పరిశోధన కేంద్రం)కు పంపించినట్లు తెలిపారు.

ఇంకా ఏ పంటలకు విస్తరించే అవకాశాలున్నాయి?

ప్రస్తుతం రాష్ట్రంలో మక్కజొన్న పంటలో ఈ పురు గు ఉధృతిని గుర్తించినప్పటికీ రాబోయే రోజుల్లో ఇతర పంటలకు వ్యాపించే అవకాశాలున్నట్లు ఇతర దేశాల్లోని అనుభవాలు చెబుతున్నాయి. ఈ పురుగు మక్కజొన్న, పత్తి, చెరకు, వేరశనగ, రాగి, కూరగాయల పంటలకు కూడా ఆశిస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇతర పంటల్లో ఈ పురుగు లక్షణాలు కన్పించలేదు. ఇతర పంటల్లో ఈ పురుగు వ్యాపించకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడతున్నాం. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన తక్షణమే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. ఎలాంటి కొత్త పురుగు కనిపించి నా...దానిని పరిశీలించి..పురుగులను సేకరించి నిర్ధారణ కోసం బెంగళూరులోని పంటలు లేని సమయంలో వివిధ జాతుల కలుపు మొక్కల మీద కూడా ఆశిస్తూ తన జీవిత కాలాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుంటూ సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ జీవన చక్రాలని పూర్తి చేసుకుంటుంది.

ఈ పురుగుజీవిత చక్రం ఎలా ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?

ఈ పురుగుకు ఆదినుంచి అనుకూలమైన శీతల దేశాల్లో తన జీవిత చక్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేసుకునే ఈ పురుగు ఆఫ్రికా లాంటి దేశాల్లో 30 నుంచి 60 రోజుల్లో పూర్తిచేసుకుంటున్నట్లు గమనించడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలలో ఈ పురు గు 24 నుంచి 40 రోజుల్లో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఆడ పురు గు 100 నుంచి 200 గుడ్లను సముదాయంగా పెడు తూ సుమారుగా 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెడుతుంది.సుమారు 2 నుంచి 3 రోజుల్లో పొదగబడే ఈ గుడ్ల నుంచి వచ్చే తొలిదశ లార్వాలు లేద ఆకుపచ్చని దేహంతో కారునల్లని తలభాగము కల్గి ఉంటాయి. లార్వా ఆరు దశలలో తన జీవిత కాలా న్ని 14 రోజుల నుంచి (వేసవి కాలం) 30 రోజుల వరకు (శీతాకాలం) పూర్తి చేసుకుంటుంది. పెరిగిన లార్వా ముదురు గోదుమ వర్ణంలో మారుతుంది. అవర లార్వా దశ తర్వాత ఈ పురుగు భూమిలో 2 నుంచి 8 సెంటీమీటర్ల లోతులో కోశస్థ దశకు మారుతుంది. సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉండే ఈ కోశస్థ దశ వేసవికాలంలో 8 నుంచి 9 రోజులు, శీతాకాలంలో 20 నుంచి 30 రోజులు ఉంటుంది. కోశస్థ దశ వచ్చే రెక్కల పురుగులు గోధుమ, బూడిద రంగుల్లో ఉండి తెల్లటి పల్చటి కింది రెక్కలను కలిగి ఉంటాయి. ఒక్కొక్క రెక్కల పురుగు 17 నుంచి 21 రోజులు బతుకుతుంది.

పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

మక్కజొన్న పంటలో కత్తెర పురుగు వ్యాప్తిపై రైతులు ఆందోళన చెందవద్దు. దీన్ని నివారించడానికి అందుబాటులో ఇప్పటికే యాజమాన్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. రైతులు పాటించి మెరుగైన ఫలితాలను సాధించారు. రసాయనిక పురుగు మందు లు కూడా అందుబాటులో ఉన్నాయి. రైతుల్లో దీనిపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులకు శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ ద్వారా పత్రికలు, చానళ్లు, కరపత్రాల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలో ఈ పురు గు వ్యాప్తి కొత్త.. కాని పురుగు కొత్తది కాదు. ప్రపంచంలో ఇప్పటికే ఈ పురుగు వ్యాపించడం, దాన్ని నివారించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను అప్రమత్తం చేసి, తగిన చర్యలు తీసుకుంటుంది.

పిచికారీ సమయంలో జాగ్రత్తలు..

కత్తెర పురుగు నివారణకు ప్రపంచ ఆహార, వ్యవసా య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పలు రసాయనిక మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. శాస్త్రవేత్తల సూచనల మేరకు స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించి పురుగు మందులను వినియోగించాలి. ఈ పురుగు మందులను సాయంత్రం వేళలో వాతావరణం చల్లబడిన తర్వాతే పిచికారీ చేయాలి. మందులను పిచికారీ చేసేటప్పుడు రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా కండ్లు, నోరు, ముఖం, ముక్కుపై పురుగుమందు పడకుండా జాగ్రత్తలు పాటించాలి.
-మజ్జిగపు శ్రీనివాస్ రెడ్డి, 8096677036

పురుగును గుర్తించే అంశాలు

-గుడ్లు ముత్యాల మాదిరిగా మెరుస్తూ ఉంటాయి.
-తొలిదశ లార్వాలు కారు నల్లటి తలబాగము, లేత ఆకుపచ్చ దేహం కలిగి ఉంటాయి.
-పూర్తిగా పెరిగిన లార్వా తలభాగంలో తిరగవేసిన స్పష్టమైన వై ఆకారపు గుర్తు ఉంటుంది.అదే విధంగా తోక భాగంలో (8వ కణుపులో) 4 గుండ్రని మచ్చలు చతురస్రాకారంలో అమర్చబడి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి.

worm2

పంటను నష్టపరుస్తుంది ఇలా

-మొదటిదశ లార్వాలు పత్ర హరితాన్ని గోకి తినివేయడం వల్ల ఆకులపై తెల్లటి చారలు ఏర్పడుతాయి.
-రెండవ, మూడవ దశ లార్వాలు ఆకుసుడి దశలో రంధ్రాలు చేసుకుంటూ తినటం కారణంగా విచ్చుకున్న ఆకుల్లోవరుస రంధ్రాలు (షాట్ హోల్స్) ఏర్పడుతాయి.
-తర్వాత దశలో ఆకులను పూర్తిగా తినివేస్తూ ఈనెలను మాత్రమే మిగులుస్తాయి(రగ్గెడ్ అప్పియరెన్స్)
-పంట తర్వాతి దశలో ఈ పురుగు మొక్క సుడులలో, కంకి పొరల్లో దాగివుండి పత్రహరితాన్ని , పుప్పొడిని, కంకిలోని జల్లుని, గింజలని, కండెని తినివేస్తూ పసుపు పచ్చని గుళికల రూపంలో ఎక్కువ మోతాదులో విసర్జిత పదార్థాలను వదులుతూ ఉంటుంది.

worm3

నివారణ చర్యలు

-పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పురుగు నివారణకు సరిపోయే లింగాకర్షక బుట్టలను ఎకరానికి 8 నుంచి 10 వరకు పెట్టాలి. ఇవి మొక్కజొన్న పంట ఎత్తుకంటే ఒక అడుగు పైకి ఉండేట్టు అమర్చుకోవాలి.
-పంటలో, పంట చుట్టూ నేపియర్ గడ్డిజాతి కలు పు మొక్కలు, ఇతర కలుపు మొక్కలు ఉండకుండా చూడాలి.
-బ్యాక్టీరియా ఆధారిత బీటీ ఫార్ములేషన్ 2 గ్రాములు లీటర్ నీటిలో లేదా వేప సంబంధిత అజాడిరక్టిన్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి మొక్క సుడులలోపల పడేట్లుగా పిచికారీ చేసుకోవాలి.
-పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎమమెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో లేదా థైయోమిథాక్జోన్ 9.5+ శాతం,
లామ్డా సైహాలోథ్రిన్ 12.6 శాతం, 0.5 మిల్లీలీటర్లు/లీటర్ నీటికి అవసరం మేరకు ఒకటి నుంచి రెండుసార్లు 7 నుంచి 10 రోజుల
వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
-కాండం తొలిచే పురుగులకు వాడే క్లోరాన్ ట్రినిలిఫ్రోల్ 0.3 మి.లీ కూడా ఈపురుగు నివారణకు వాడుకోవచ్చు.
-సాధారణంగా రాత్రి వేళలో మొక్కసుడులలోపల దాగి ఉండి నష్టం కలుగజేసే ఈ పురుగు ఉధృతిని విషపు ఎరల ద్వారా తగ్గించుకోవచ్చు.
-విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2-3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనివ్వాలి. ఆ మరుసటిరోజు 100 గ్రాముల థైయోడికార్బ్‌ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.

897
Tags

More News