ప్రస్తుతం పంటల్లో యాజమాన్య పద్ధతులు

Wed,August 22, 2018 10:46 PM

రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఆయా జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. దీంతోఆయా జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో వానకాలం సీజన్‌లో సాగు చేసిన పత్తి, వరి, మక్కజొన్న, మిర్చి , ఇతర అపరాల పంటలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో ఆయా పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలి. లేకపోతే పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
crop
పత్తి పంటలో..పత్తి పంటలో నిలిచిన నీరును సాధ్యమైనంత తొందరగా కాల్వలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని బయటకు పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో చేలలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నేల ఆరిన తరువాత తక్షణం అంతరకృషి చేయాలి. తద్వారా వేర్లకు గాలి, పోషకాలు అందడం ద్వారా మొక్కలు త్వరితగతిన కోలుకుంటాయి. నీరు తీసివేసిన చేలల్లో ఎకరానికి 130 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి మొక్కకు 5-6 సెం.మీ దూరంలో వేసి మట్టి కప్పాలి. అధిక తేమ కలిగిన పరిస్థితి ఉంటే భూమి నుంచి పోషకాలను గ్రహించకపోవడం వలన ఆకులు పసుపు రంగులో మారే అవకాశం ఉంటుంది. ఈ దశలో యూరియా 20 కేజీలు లేదా పొటాషియం నైట్రేట్ 1 లీటర్ నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. దీంతో మొక్కలు సాధారణ స్థాయికి వస్తాయి. భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున ముందుగానే గ్రహించి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30గ్రా, ప్లాంటామైసిన్1 గ్రా 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరు కుళ్లు తెగుళ్లు సైతం ఆశించే అవకాశం ఉన్నది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లేదా, కార్బండిజమ్ 1గ్రా లీటర్ నీటిలో కలిపి మొక్కలకు, మొగుళ్లను తడుపుకోవాలి.

crop2

అపరాల పంటలలో..

ఈ పంటల్లోనూ త్వరితగితిన వర్షపు నీటిని బయటకు పంపించాలి. మొక్కలు త్వరతగతిన తేరుకునేందుకు ఎకరానికి పొటాషియం నైట్రేట్ (13-0-45) 5-10 గ్రాములు మొక్క వయస్సును బట్టీ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పెసర, మినుము పంటల్లో ఆకుమచ్చ తెగులు వ్యాపించే అవకాశం ఉన్నది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లేదా, కార్బండిజమ్ 1గ్రా లేదా, మాంకోజెబ్ 2.5 గ్రా లీటర్ నీటికి కలుపుకొని వారంరోజుల్లో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత లద్దెపురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉందని గ్రహిస్తే నివారణకు థయోడీకార్బ్ 1గ్రా లేదా, ఇమామోక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.

మిర్చి నారుమళ్లు, తోటలలో..

మిర్చి నారుమళ్లు, తోటల్లో ఎట్టి పరిస్థితులలో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. నారుమళ్లలో నారుకుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు గాను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లేదా, రిడోమిల్ ఎం-2.25గ్రా లీటర్ నీటికి కలుపుకొని నారుమళ్లలో పిచికారీ చేసుకోవాలి. ఇప్పటికే నాటిన తోటల్లో కాండం కుళ్లు తెగులు ఆశించి కాండంపైన మచ్చలు ఏర్పడి మొక్కలు కుళ్లిపోయే అవకాశం ఉన్నది. నివారణకు ధయోఫానేట్‌మిథైల్ 1.5గ్రా 10 లీటర్ల నీటకి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. అధిక వర్షాల కారణంగా వేరుకుళ్లు తెగులు సైతం ఆశించే అవకాశం ఉన్నది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటర్ నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి.

వరిలో సస్యరక్షణ చర్యలు

పొలాల్లో నిలిచిన వర్షపు నీరును త్వరితగతిన బయటకు పంపించాలి. ప్రస్తుత పరిస్థిలలకు బట్టి ఎకరానికి 25 కేజీల యూరియా, 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, వేసుకున్నైట్లెతే మొక్కలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అదే విధంగా అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6గ్రా లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
-మద్దెల లక్ష్మయ్య
ఖమ్మం వ్యవసాయం, 901017 23131

నీరు త్వరగా బయటకు పంపించాలి

కొద్దిరోజుల నుంచి ఆయా జిల్లాలో కురిసిన అధిక వర్షాలుకు వర్షపు నీరు పంట పొలాలలోకి చేరింది. ఈ వర్షపు నీటిని సదరు రైతులు కాలువలు, ఇతర మార్గాల ద్వారా త్వరగా బైటికి పంపాలి. లేకపోతే పంటల ఎదుగుదల తగ్గే అవకాశం ఉన్నది. అలాగే కాకుండా అనేక చీడపీడల బెడద ఉంటుంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన వెంటనే పైన సూచించిన విధంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి.
-మధుశేఖర్,వైరా కృషివిజ్ఞాన కేంద్రం సైంటిస్టు, 98661 03797

1443
Tags

More News