లాభసాటి అంజూర సాగు

Thu,August 16, 2018 12:51 AM

చిన్నప్పుడు ఇంట్లో కోళ్లు పెంచిన జ్ఞాపకం తప్ప.. వ్యవసాయం చేసిన అనుభవం అస్సలు లేదు. అయినా మలి వయసులో సాగును ప్రారంభించి అద్భుతాన్నిఆవిష్కరిస్తున్నది పంతంగి రుద్రమ్మ. భర్త, కొడుకు సహకారంతో మూడెకరాల భూమిలో అంజూర సాగు చేపట్టి.. నెలకు కనీసం రూ. 50 వేల దిగుబడిని సాధిస్తున్నది. పంట ఎంపిక నుంచి మొక్కల పెంపకం, కాయ కోయడం, మార్కెటింగ్ వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించడం వల్లనే అరుదైన పంటను సాగు చేసినా మంచి ఫలితాలు వస్తున్నాయి.
Rudramma
నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని మేళ్లదుప్పలపల్లి గ్రామ శివారు ప్రాంతం.. రోడ్డు పక్కనే నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం.. ఏడాది కిందటి వరకు సాధారణ భూమిగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు వచ్చి పోయే వారి దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నది. ఒక్కసారి ఆగి చూడటమే కాదు.. తాజా అంజూర పండ్లను సైతం తోట దగ్గరే కొనుక్కొని పోయేలా చేయడానికి కారణం పంతంగి రుద్రమ్మ అనే మహిళ. నల్లగొండకు చెందిన రుద్రమ్మది చిన్న నాటి నుంచి వ్యవసాయ కుటుంబం కాదు. ఆమె బాల్యంలో వాళ్లింట్లో పెరిగిన కోళ్లు తప్ప వ్యవసాయంతో మరే విధమైన అనుబంధమూ లేదు. భర్త యాదయ్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అత్తగారింట్లోనూ ఆ అవకాశం లభించలేదు. ఉద్యోగం నుంచి భర్త రిటైర్ అయిన ఎనిమిదేళ్ల తర్వాత కాలక్షేపం కోసం వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం.. ఆ భూమిలో పంట సాగును రుద్రమ్మ దగ్గరుండి పర్యవేక్షించడం చకచకా జరిగిపోయాయి.

పంట ఎంపికతోనే సగం విజయం

భూమి కొన్న తర్వాత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న రుద్రమ్మ ఏ పంట వేయాలనే కోణంలో తీక్షణంగా ఆలోచించారు. భర్త, కొడుకు ప్రశాంత్ ఆలోచన మేరకు బత్తాయి, నిమ్మ, దానిమ్మ వాటి కంటే అంజూర పండ్ల సాగు తమ భూమికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఫిగ్ ఫ్రూట్‌గా పిలుచుకునే ఫైకస్ క్యారికా (అంజీరా)కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం వీళ్ల ఆలోచనకు బలం చేకూర్చింది. ఒక్కో మొక్కకు రూ. 50 చొప్పున వెచ్చించి మూడెకరాల కోసం 1500 మొక్కలు గతేడాది జూన్‌లో కర్ణాటకలోని బళ్లా రి నుంచి తెప్పించారు. మొక్కల ఖరీదు, రవా ణా, వర్మీ కంపోస్ట్, డీఏపీ వంటి ఖర్చులతో కలుపుకుని ఒక్కో మొక్కను నాటే వరకు సగటున రూ. 250 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. జిల్లా ఉద్యాన శాఖ సహకారంతో సలహాలు, సూచనలతోపాటు డ్రిప్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నారు. మొక్క రెండు ఫీట్ల ఎత్తు పెరిగిన నాటి నుంచి చిగుర్లు తెంచి వేయడం.. కొమ్మలు రెండు ఫీట్లు పెరిగిన వెంటనే చివర్లు కత్తిరించడం చేయడంతో.. మొక్కలు నాటిన ఏడో నెల నుంచే దిగుబడి మొదలైంది. మూణ్నెళ్లపాటు కాయలను వెంటనే తెంచి వేసి.. 10వ నెల నుంచి దిగుబడిని ప్రారంభించారు.
AKA

సస్యరక్షణ జాగ్రత్తలతో సంపూర్ణం

ఉద్యానశాఖ సూచనల ప్రకారం ఫర్టిలైజర్ ఎరువులు వాడకుండా.. పశువుల పెంటతోపాటు కార్బండిజం, మాంకోజెబ్ మిశ్రమాన్ని శిలీంధ్ర నాశినిగా వాడుతూ తెగుళ్లు రాకుం డా అరికడుతున్నారు. ఏడాదికోసారి హార్డ్‌వుడ్ ప్రూనింగ్ చేయడం ద్వారా ఒక్కో కొమ్మకు 150 నుంచి 200 కాయలుండేలా జాగ్రత్త పడటం వంటివి పాటిస్తున్నారు. రుద్రమ్మ పర్యవేక్షణతోపాటు నిత్యం మరో నలుగురు ఏడాదికాలంగా మూడెకరాల అంజూర తోట సాగులో పాలు పంచుకుంటున్నారు. ప్రారంభంలో రోజుకు 7 నుంచి 10 కేజీలుగా మొదలైన దిగుబడి.. తర్వాత క్రమంగా రోజుకు 50 కేజీల వరకు పెరిగింది. తోట దగ్గర అమ్మడంతోపాటు నల్లగొండ పట్టణంలోని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తూ.. సగటున కేజీకి రూ. 80 వరకు ఆర్జిస్తున్నారు. ఆయుర్వేదిక్‌తోపాటు ఎన్నో సుగుణాలున్న అంజూర పండ్లను వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో కేజీకి రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. ఏడాదిలో 8 నెలలు దిగుబడినిచ్చే ఈ పండ్ల సాగుతో మూడెకరాల తోట ద్వారా ఏడాదికి కనీసం రూ.5 నుంచి 6 లక్షల దిగుబడి పొందగలుగుతున్నారు. కనిష్ఠంగా 15.. గరిష్ఠంగా 20 ఏండ్లపాటు అంజూర దిగుబడి వస్తుంది.
- జూలకంటి రాజేందర్ రెడ్డి నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ
Anujara

కుటుంబ సభ్యుల సహకారంతోనే సాధ్యమైంది

నాకు గతంలో ఎలాంటి వ్యవసాయ అనుభవం లేకపోయినా.. ఈ అంజూర చెట్లను నా పిల్లల లాగనే పెంచి పెద్ద చేస్తున్న. నా భర్త యాద య్య, కొడుకు కోడలు ప్రశాంత్, కోమలి సహకారంతోనే ఈ పని సాధ్యమైంది. ఏడాది నుంచి ప్రతిరోజు ఉదయాన్నే తోటకు వస్తే చీకటి పడే వరకు ఇక్కడే ఉండి ప్రతి పనిని చూసుకుంటున్నా. తాజా పండ్లు కొనుగోలు చేసి తిన్న వాళ్లు చాలా బాగున్నాయని చెప్తున్నారు. బళ్లారి నుంచి మొక్కలు అమ్మిన నర్సరీ నిర్వాహకులు.. ఇక్కడి ఉద్యాన శాఖ అధికారుల సహకారం మరువలేనిది.
-పంతంగి రుద్రమ్మ, మహిళా రైతు

సరైన యాజమాన్య పద్ధతులతోనే విజయం

మల్బరీ కుటుంబానికి చెందిన ఫైకస్ క్యారికా (అంజూర) సాగు సునిశితమైన ప్రక్రియ. జాగ్రత్తగా పర్యవేక్షించాలి. నల్లగొండ జిల్లాలో చాలా అరుదైన సాగును పంతంగి రుద్రమ్మ చేపట్టారు. పలుమార్లు తోటను మా ఉన్నతాధికారులు కూడా సందర్శించారు. ఉద్యానశాఖ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. తోటకు డ్రిప్ మంజూరు చేయడంతోపాటు.. పంట యాజమాన్యం కోసం కూడా ఈ రైతుకు ఏటా రూ. 38 వేల సాయం ప్రభుత్వం నుంచి అందనుంది.
-పిన్నపురెడ్డి అనంతరెడ్డి, ఉద్యానశాఖ అధికారి,8008126723

803
Tags

More News