ఎండుతెగులు నివారణ చర్యలు

Thu,August 16, 2018 12:35 AM

ఇటీవల వచ్చిన భారీ వర్షంతో పత్తి పంటలో నీరు నిలిచిపోయింది. దీంతో ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా గమనించాం. ఈ శిలీంధ్రం ఉధృతి భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎండు తెగులు లక్షణాలు.. నివారణ చర్యలను జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్‌రావు రైతులకు వివరించారు.
pathi-chenu

తెగులు లక్షణాలు..

తెగులు సోకిన వెంటనే పత్తి మొక్క మొదట వడలిపోతుంది. ఈ మొక్కను పీకి వేరును నిలువుగా చీల్చి పరిశీలించినప్పుడు తొలి దశలో వేరు భాగం గోధుమరంగులోకి మారి ఆ తర్వాత ఎరుపు రంగుకు మారి చివరి దశలో నల్లబడిపోతుంది. ఈ విధంగా శిలీంధ్రం వేరును అంటిపెట్టుకుని ఉండ టం వల్ల మొక్క భూమిలో నుంచి పోషక పదార్థాలు వినియోగం లేకపోవడం వల్ల చివరకు మొక్కలు చనిపోతాయి.

నివారణ..

చాలామంది రైతులు మొక్కలు వడలిపోగానే రకరకాల పురుగు మందులు తెగుళ్లకు పిచికారీ చేస్తున్నారు. కానీ ఈ ఎండు తెగులు రావడం వల్ల శిలీంధ్రం భూమిలో ఉండి ఒక మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాపిస్తుంది. కాబట్టి మొదటగా తెగులు బాగా సోకిన మొక్కలను పీకి వేసి తగులబెట్టాలి. తర్వాత తెగులు సోకిన మొక్క భాగంలో, చుట్టూ వరుసల్లో మూడు నాలుగు వరుసల వరకు ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కలకు కూడా నివారణ చర్యలు చేపట్టాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా రిడోమిల్ 2గ్రాములు లేదా కార్బండిజం 1గ్రాము లీటరు నీటికి కలుపుకొని మొక్క మొదట్లో వేరు వ్యవస్థ పూర్తిగా తడిచే విధంగా మందు ద్రావణాన్ని పోయాలి. ఎండు తెగులు ఉధృతిని బట్టి సూచించిన మందులను మార్చుకుంటూ నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు మందు ద్రావణాన్ని పోయాలి. 30కిలోల యూరియాలో సాఫ్ 250 నుంచి 500 గ్రాములను కలిపి మొక్క కు 5సెంటీ మీటర్ల దూరంలో పడేటట్టు వేసుకోవాలి. ఈ తెగులు సోకిన మొక్కలకు వేరు వ్యవస్థ నుంచి పోషక పదార్థాల, నీటి వినియోగం ఉండదు. కాబట్టి వెంటనే యూరియా 20 గ్రాముల లీటరు నీటికి లేదా నీటిలో కరిగే ఎరువుల 19:19:19 లీటరు నీటికి 10గ్రాముల చొప్పన ఐదురోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. పత్తిలో మొక్కలు ఎదుగడం ఆగిపోయి కాండం ఆకులు ఎర్రగా మారుతున్నాయి. ఇది ముఖ్యంగా పోషక లోపం వల్ల జరుగుతుంది. అందువల్ల శిలీంధ్ర నాశిని మందులతో పాటు పోషకాలను నీటిలో కరిగే ఎరువులు 19:19:19 లీటరు నీటికి 10గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి.
-లెంకలపల్లి కుమార్ జమ్మికుంట, 9848643837

755
Tags

More News