పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు

Wed,August 8, 2018 11:14 PM

cotton-pink
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19లక్షల హెక్టార్లలో పత్తిపంట సాగు జరిగింది. మూడేండ్లుగా పత్తిపంటను గులాబీరంగు కాయతొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తున్నది. అయితే ఈ మూడేండ్లలో పంట చివరిదశలో ఆశించి నష్టపరిచింది. కానీ ఈ సంవత్సరం విత్తిన 45-50 రోజుల్లో ఆశిస్తున్న సందర్భం నెలకొన్నది. పూతదశ నుంచే దీని తాకిడి, తద్వారా కలిగే నష్టాన్ని సంబంధిత శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పురుగు ప్రభావంతో గత ఏడాది 30శాతం దిగుబడులు తగ్గినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ముందస్తుగానే పురుగు ఉధృతిని కనిపెట్టి అవసరమైన చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చని ఖమ్మం డాట్‌సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వారిని ఈ నంబర్ 78930 34800లో సంప్రదించవచ్చు

పురుగు లక్షణాలు

తల్లిపురుగు లేత ఆకుల అడుగుభాగాన, లేత కొమ్మలపైన పూమొగ్గలపైన, లేతకాయలపైన, గుడ్లను గుంపులు, గుంపులుగా వదిలిపెడుతుంది. ఈ పురుగు ఒకేసారి సుమారు 150-200 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. గుడ్ల నుంచి వచ్చిన చిన్న చిన్న లార్వాలు కాయలపై సన్నటి రంధ్రాలు చేసి కాయలోనికి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత కాయను పూడ్చి వేసి లోపల గింజలను తింటూ దూదిని నష్టపరుస్తాయి. తద్వారా రంగు నాణ్యతపై ప్రభావం చూపుతాయి. పురుగు లార్వా దశ మ్తొతం కాయలోనే గడటం వల్ల కాయపగిలిన తర్వాత మాత్రమే రైతు నష్టాన్ని గుర్తించే అవకాశం ఉన్నది. పురుగు ఆశించిన కాయలు వృద్ధి చెందకుండా త్వరితగితిన పక్వానికి వచ్చే అవకాశం ఉన్నది.

cotton-pink2

పంట నష్టం ఇలా..

లార్వాలు ఎదిగిన మొగ్గలు, పువ్వుల లోపలి అండాశయాన్ని పుప్పొడిని తినటం ద్వారా పూర్తిగా నష్టం జరుగుతుంది. దీనివల్ల తొలిదశలో ఆశించిన మొగ్గలు, పువ్వులు రాలిపోతాయి. లేతకాయలను ఆశించినప్పడు అవి కూడా రాలిపోవడం లేదా పరిమాణం తగ్గడం కాని జరుగతుంది. తద్వారా కాయలు సరిగ్గా పగులకపోవడం వల్ల గుడ్డికాయలుగా మిగులుతాయి. ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలోని గడ్డిపూలను, కాయలను తెరిచి లోపల భాగాన్ని చూస్తే కాయలోపల చిన్న లేదా పెద్ద సైజు గులాబీ పురుగులను గమనించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పంటను విత్తిన 45 రోజుల నుంచి పంటను నిశితంగా గమనించాలి. ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. మరుసటి రోజునుంచి ఒక్కో బుట్టలో 7-8 తల్లిరెక్కల పురుగులు, 10 శాతం గడ్డిపువ్వులు, 10శాతం మేర పురుగు ఆశించిన కాయలను గమనిస్తే సత్వరం నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. దీంతో అదనంగా మరో నాలుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. లింగాకర్షక బుట్టల ఆధారంగా ఉధృతిని అంచన వేసి నాలుగు ట్రైకోగామా కార్డులను పంట చేనులో అక్కడక్కడ పెట్టుకోవాలి. పురుగు నష్ట పరిమితి స్థాయి దాటిన వెంటనే 5 శాతం వేపకషాయం లేదా, 5 మి.మీ (1500 పీపీఎం) వేపనూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా క్వినాల్‌ఫాస్ 2 మి.మీ లేదా, థయోడికార్బ్1.5 మి.మీ లేదా, ప్రొఫినోఫాస్ 2 మి.మీ లేదా, క్లోరీ పైరీఫాస్ 2.5 మి.మీ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు పంట కాలంలో ఒకటి లేదా రెండు సార్లు సింథటిక్ ఫైరీథ్రాయిడ్ మందులైనా సైఫర్‌మిత్రిన్ 25 శాతం, ఈసీ 1 మి.మీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ముందు చేపట్టాల్సిన పద్ధతులు

పంటమార్పిడి పద్ధతిని ప్రతి రెండు, మూడేండ్లకు ఒకసారి విధిగా పాటించాలి. తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకొని సకాలంలో విత్తుకోవాలి. దీనిద్వారా గులాబీరంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. బీటీ పత్తిని విత్తుకునేటప్పుడు పత్తిచుట్టూ 5 వరుసల్లో నాన్‌బీటీ పత్తిని విధిగా విత్తుకోవాలి. పత్తిపంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి. అదే విధంగా పొలం లేదా చెలకల గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

పంట తీసిన తరువాత

పంటను తీసిన తరువాత గొర్రెలు, లేదా మేకలను మేపుకోవాలి. నీటి వసతి ఉన్నప్పటికి పత్తిపంటను ఏడు నెలలకు మంచి సాగు చేయరాదు. నీటి వసతి ఉంటే రెండవ పంటగా ఇతర ఆరుతడి పంటలను సాగు చేసినైట్లెతే పత్తి పంటకు మించి ఎక్కువ ఆదాయం పొందవచ్చు. పత్తి మొదళ్లను ట్రాక్టర్ షెడ్డర్‌తో గానీ, రోటోవేటర్‌తో గాని భూమిలో కలియదున్నుకోవాలి. పత్తికట్టెను ఇళ్లవద్ద పొయ్యిలో వాడేందుకు ఎట్టి పరిస్థితుల్లో నిల్వచేయరాదు. పంటకు పంటకు మధ్య 4-6 నెలల కాల వ్యవధి ఉండేలా పంట సాగు చేసినప్పుడు మాత్రమే గులాబీరంగు పురుగు ఉధృతిని తగ్గించు కోవచ్చని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
-మద్దెల లక్ష్మణ్
ఖమ్మం వ్యవసాయం, 9010723131

799
Tags

More News