టమాటా, బెండ పంటల్లో తెగుళ్లు - నివారణ

Thu,July 26, 2018 12:16 AM

ప్రస్తుతం రాష్ట్రంలో బెండ, టమాటా సాగులో ఉన్నది. ప్రస్తుత పరిస్థితులు తెగుళ్లు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి. కూరగాయల దిగుబడి, నాణ్యత బాగుండాలి అంటే సకాలంలో తెగుళ్లను గుర్తించి నివారించాలి.
tomato

టమాటా..

విత్తనాన్ని నారుమళ్లలో వేసుకొన్నప్పుడు నారుకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీనివల్ల నారు మడిలో నారు మొక్కల మొదళ్లు మెత్తబడి గుంపులు, గుంపులుగా కుళ్లి చనిపోతాయి. మురుగునీటి సౌకర్యం సరిగా లేనప్పుడు లేక నారు ఒత్తుగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. అయితే మోతాదుకు మించి విత్తనాలు వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి ఈ తెగులు రావడానికి అనుకూల పరిస్థితులు కలిగిస్తుంది.

నివారణ: నారు మడి కోసం ఇసుక నేలలు లేక తేలిక నేలలు ఎన్నుకోవాలి. భూ మట్టం నుంచి 6-8 సెం.మీ ఎత్తైన నారుమళ్లు తయారు చేసుకుని విత్తుకోవాలి. నారు వేయడానికి మందు నారుమడిలో ఎండుగడ్డి లేక చెత్త వేసి కాల్చివేయాలి. దీనివల్ల తెగులును కలుగజేసే శిలీంధ్ర బీజాలు మాడి చనిపోతాయి. విత్తనశుద్ధిని విధిగా పాటించాలి. దీనికి కిలో విత్తనాన్ని 2.5 గ్రా థైరమ్ లేదా మాంకోజెబ్ మందుతో శుద్ధి చేయాలి. ఒక సెంటు నారుమడికి 700 గ్రాములకు మించి విత్తనం చల్లరాదు. నారుపోసిన 10వ రోజు నుంచి ైబ్లెటాక్స్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు తడుపాలి.

ఆకుమాడు తెగులు: ఆకుల మీద, కాండం మీద నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. తెగులు సోకిన కాండాలు విరిగిపోతాయి. ఆకులు కూడా మాడిపోతాయి. కాయల మీద కూడా మచ్చలు ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి.
నివారణ: దీని నివారణకు కార్బండిజమ్‌ను లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

కాయకుళ్లు తెగులు

ఈ తెగులు నేలలోని శిలీంధ్రం వల్ల సోకుతుంది. మొదట కాయలపై నీటి మచ్చలు ఏర్పడి పెద్దవవుతాయి. తద్వారా ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి కాయలు మెత్తబడుతాయి. కాయపై ఉండే పై పొర ఊడిపోతుంది. కాయలు నేలను తాకడం వల్ల ఈ తెగులు వస్తుంది.

నివారణ: కాయలు నేలను తాకకుండా మొక్కలకు ఊత కలిగించాలి. తెగులు సోకిన తర్వాత అయితే ఒక శాతం బోర్డో మిశ్రమం కానీ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ఆకుముడత, వెర్రితెగులు

ఈతెగులు తెల్లదోమల ద్వారా వ్యాపిస్తుం ది. తెగులు సోకిన మొక్కలు కురుచగా ఉం టాయి. ఆకులు చిన్నవై అందులు ముడుచుకొనిపోతాయి. ఆకులు పెళుసుగా మారి ముదురు ఆకుపచ్చ రంగులో కన్పిస్తాయి. తెగులు సోకిన మొక్కలు పూత పూయవు. ఒకవేళ కొంత పూత వచ్చినా కాయలు కాయవు. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలన్నీ గొడ్డు బారిపోతాయి.

నివారణ: దీన్ని నివారించడానికి తెగు లు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి డైమిథోయేట్ లేదా ఫిఫ్రోనిల్ మందును లీటరు నీటికి 2.మి.లీ చొప్పున కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ మందును లీట రు నీటికి 0.3 మి.లీ చొప్పున కానీ కలిపి 2-3సార్లు వారం రోజుల వ్యవధిలో ఇస్తూ బాగా పిచికారీ చేయాలి. దీంతోపాటు వేపనూనెను కూడా వాడుకోవాలి. కానీ వేపు నూనెను ఏ పురుగు మందులోనూ కలిపి వాడకూడదు. వేరుగా పిచికారీ చేసుకోవాలి. దీనికి లీటరు నీటికి 5 మి.లీ చొప్పున కలుపాలి. వేన నూనెతో పాటు లీటరునీటికి ఒ గ్రాము సబ్బు పొడి కానీ కొంత సర్ఫ్ పొడిని కానీ కలుపాలి. లేదా శాండోవిట్ వాడుకోవచ్చు. ఇవి కలుపకుండా వేప నూనె వాడితే ఆకులు మాడిపోయే ప్రమా దం ఉన్నది.

bendakaya

బెండ..

బెండలో మొక్క చిన్న దశ నుంచి కాయ ఏర్పడే వరకు పల్లాకు తెగులు, బూడిద తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది.
పల్లాకు తెగులు: ఈ తెగులు వైరస్ ద్వారా సోకుతుంది. ఈ తెగులు ఆశించిన ఆకులు, ఈనెలు పసుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల ఆకులపై పసుపు, ఆకుపచ్చ రంగుల అల్లిక వలె కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు గిడసబారి ఎదగ వు. కాయలు కూడా కాయవు. ఒకవేళ కాయలు ఏర్పడినా అవి తెల్లగా లేదా లేత పసుపు రంగులోకి మారుతాయి. ఒకవేళ ఈ తెగులు గింజలు మొలిచిన 20 రోజుల్లోపు ఆశిస్తే దిగుబడిలో తీవ్ర నష్టం కలుగుతుంది.
నివారణ: విత్తనాన్ని విత్తుకోక ముందే కిలో విత్తనానికి ఐదు గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తే ముందు పొలంలో ఎకరానికి 100 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. పసుపు రంగు పూసిన అట్టలపై కానీ, డబ్బాలపై కానీ ఆముదం లేక గ్రీసు పూసిన తోటలో పెట్టాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులు ఆశించబడుతాయి. వాటి వృద్ధి తగ్గిపోతుంది. దీంతో తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు.

బూడిద తెగులు: ఈ తెగులు ఆశించిన ఆకులపై బూడిద వంటి పదార్థం కప్పబడి ఉంటుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి.

నివారణ: ఈ తెగులు బెండ పంటకు కొన్నిరకాల కలుపు మొక్కల నుంచి ఆశిస్తుంది. కాబట్టి పొలంలోనూ, పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూడాలి. పంటపై తెగులు కన్పించగానే నీటిలో కరిగే గంధకం పొడిని లీటరు నీటికి 3 గ్రాము ల చొప్పున కలిపి లేదా కెరాథేన్ మందును లేదా హెక్సాకోనజోల్ మందును లీట రు నీటికి ఒక మి.లీ చొప్పున కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి. ఇలా వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేస్తే ఈ తెగులును నివారించవచ్చు.

పురుగుల నివారణ

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల బెండ పంటను రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు ఆశిస్తాయి. దీన్ని నివారించడానికి డైమిథోయేట్ లేదా ఫిప్రొనిల్ లేదా స్పైనోపాడ్‌ను లీటర్ నీటికి 2. మి.లీ చొప్పున కలిపి పంట బాగా తడిచేలా 10 రోజుల వ్యవధి ఇస్తూ 2-3 సార్లు పిచికారీ చేయాలి. బెండ పైరును జూలై లోపు విత్తుకుంటే ఈ తెగులును కొంతవరకు నివారించుకోవచ్చు. కాయతొలిచే పురుగును నివారించడానికి ఎమాయెక్టిన్ టింగోయేట్ మందును లీటరు నీటి కి 0.5 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు చేయాలి.

బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు

ఆకుల మీద చిన్న నీటి మచ్చలు ఏర్పడి తర్వాత అవి గోధుమ రంగులోకి మారుతాయి. అవి క్రమంగా పెద్దవై నల్లబడుతాయి. మచ్చల చుట్టూ పసుపు పచ్చని అంచు ఉంటుంది. తెగులు సోకిన ఆకులు పండుబారి ఎండి రాలిపోతాయి. కాడలపైన, కొమ్మలపై, కాయల పైన కూడా మచ్చలు ఏర్పడుతాయి. కాయలపైన ఏర్పడిన మచ్చలు నల్లగా, ఉబ్బెత్తుగా ఉంటాయి.

నివారణ: ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి విత్తనాలను స్ట్రెప్టోసైక్లిన్ మందు ద్రావణంలో (లీటరు నీటికి 200 మి.గ్రా మందు) 30 నిమిషా లు ముంచి నాటాలి. పంట మీద తెగులు కన్పించిన వెంటనే 2 మి.గ్రా అగ్రిమైసి న్ తో 3 గ్రాములు ైబ్లెటాక్స్‌ను లీటరు నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయా లి. తెగులు తీవ్రతను బట్టి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

వడలు తెగులు

తెగులు సోకిన మొక్కలు మొదట పసుపుపచ్చగా మారి కిందికి వేలాడి తర్వాతచనిపోతాయి. ఆకులు లేని కొమ్మలు మిగిలిపోతాయి. తర్వాత మొక్కంతా ఎండిపోతుంది. తెగులు సోకిన మొక్క కాండాన్ని, వేరును చీల్చి చూస్తే గోధుమరంగు చార లు కన్పిస్తాయి. ఈ తెగులును కలుగజేసే శిలీంధ్ర బీజాలు భూమిలో చాలాకాలం బతికి ఉంటాయి. కాబట్టి పంట వేసిన ప్రతిసారి ఈ తెగులు సోకుతూనే ఉంటుంది.

నివారణ: ఈ తెగులు భూమిలో ఉండే శిలీంధ్రం వల్ల సోకుతుంది. కాబట్టి దీన్ని నివారించడం అంత సులువు కాదు. అయితేకొన్ని సాగు పద్ధతులు పాటించడం వల్ల ఈ తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. మొదటగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. దీనికి టమాటా తర్వాత పెసర లాంటి పంటలను వేసుకోవాలి. లేదా పచ్చి ఆకు పంటను పండించాలి. తెగులు సోకిన పంట నుంచి నీటిని ఆరోగ్యవంతమైన పంటకు ప్రవహించకూడదు. తెగులు సోకిన మొక్కల మొదళ్ల చుట్టూ బోర్డోమిశ్రమంతో కానీ ైబ్లెటాక్స్ మందుతో కానీ తడుపాలి. వేప పిండిని భూమిలో ఆఖరి దుక్కిలో వేసుకుంటే భూమిలో ఉండే శిలీంధ్రాలు, నులి పురుగులు నశిస్తాయి. ట్రైకోడెర్మా విరిడి అనేక కల్చర్‌ను పశువుల ఎరువులో కలిపి 15-20 రోజులు ఉంచిన తర్వాత ఆ ఎరువును భూమిలో వేయాలి.
dr-m-vijaya

208
Tags

More News