చేప పిల్లల ఉత్పత్తి పద్ధతులు

Thu,July 26, 2018 12:14 AM

చేపల పెంపకం ద్వారా అధిక దిగుబడులను సాధించాలంటే మనకు అనువైన రకాలనే పెంచాలి. ఈ అనువైన రకాల పిల్లలను కూడా మనమే ఉత్పత్తి చేసుకొని వాటిని సరైన రీతిలో పెంచడం వల్ల అధిక లాభాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. చేపల పిల్లల ఉత్పత్తిలో అనుసరించాల్సి విధానాలను గురించి వారు తెలిపిన వివరాలు..
fish-production

సహజ పద్ధతి

ఈ విధానం ద్వారా ఎక్కువగా బొచ్చె చేపపిల్లలను ఉత్పత్తి చేస్తారు. తక్కువ కాలం నీరు ఉండే చెరువుల్లో పక్వ దశలో ఉన్న బ్రీడర్ (తల్లి చేపలు)ను వానకాలం చెరువుల్లో కొంచెం నీరు చేరిన తర్వాత వదులాలి. పరివాహక ప్రదేశాల నుంచి నీరు వేగంగా వచ్చే మార్గాల్లో ఈ బ్రీడర్లు ప్రయాణం చేసి ఉత్తేజితం చెంది గుడ్లు పెడుతాయి. చేప పిల్లల అవసరాలను బట్టి బ్రీడర్ల సంఖ్యను నిర్ణయించి వదులాలి. బ్రీడర్‌లను వదిలిన తర్వాత వర్షం కురిసిన ప్రతి రోజూ పరిశీలిస్తుండాలి. గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల దోమ తెర గుడ్డతో చేసిన లాగుడు వలతో పట్టాలి. అలా సేకరించిన గుడ్లను పేర్చినట్లుగా సర్దాలి. 20 గంటల్లో గుడ్ల నుంచి పిల్ల లు బయటకు వస్తాయి. వాటిని రెండ్రోజుల వరకు హాపాల్లో ఉంచాలి. తర్వాత పెరుగడానికి వదులాలి. ఈ చిరు చేపపిల్లలను కావాల్సిన చోటుకు ప్లాస్టిక్ సంచుల్లో నీరు, ప్రాణవాయువు నింపి రవాణా చేస్తారు. గుడ్లను వదిలిన చేపలను చెరువు నుంచి తీసి మళ్లి వేరే బ్రీడర్‌లను గుడ్లు పెట్టించడానికి ఉపయోగించాలి.

హార్మోన్‌ల ఇంజెక్షన్ ప్రేరణతో..

సహజ పద్ధతిలో కావాల్సిన సంఖ్యలో చేప పిల్లలు, మేలు జాతి చేపపిల్లలు దొరక్కపోవడం వల్ల రైతులు ఆందోళన చెందాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 1975లో కటక్‌లోని కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ పిట్యూటరీ గ్రంథి రసాన్ని ఇంజెక్షన్‌ల ద్వారా ఇచ్చి ప్రేరేపిత అండోత్పత్తి పద్ధతి ద్వారా బొచ్చె జాతి చేపలతో గుడ్లు పెట్టించడాన్ని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి ద్వారా అవసరం మేరకు స్వచ్ఛమైన జాతి పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు.

fish-production2

బ్రీడర్‌ల ఎంపిక:

బాగా పరిపక్వ దశకు చేరిన చేపలను సేకరించి చెరువులో వేసి వాటికి సరపడా ఆహారం అందేలా చూడాలి. దీనివల్ల అవి వానకాలం నాటికి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుడ్లు పెట్టే నాటికి బ్రీడర్ల వయస్పు కనీసం రెండున్నరేళ్ళు ఉండాలి. బాగా ఎదిగిన బ్రీడర్ చేపలో మగ చేప మొప్ప వెనుకనున్న రెక్క మీద బొడిపెలుగా మారి గరుకుగా ఉంటుంది. అదే ఆడ చేప అయితే సన్నగా ఉంటుంది.

ప్రేరణ:

పిట్యూటరీ గ్రంథి ద్వారా తయారు చేయబడిన హార్మోన్ మార్కెట్‌లో లభ్యమయ్యే ఓవాప్రిమ్ లేదా ఓవాటైడ్‌లను ప్రేరకాలుగా ఉపయోగించి చేపపిల్లలను ఉత్పత్తి చేయవచ్చు.

గుడ్లను పెట్టించే విధానం:

ఇందుకోసం ముందుగా చెరువులో ఒక మూల ను ఎంచుకోవాలి. బ్రీడింగ్ హాపాలను గుడ్లను పెట్టించేందుకు ఉపయోగించాలి.

ఇంజెక్షన్ చేసే విధానం:

వానకాలం రాగానే పర్వంలో ఉన్న ఆడ, మగ బ్రీడర్లను చెరువుల నుంచి జాగ్రత్తగా సేకరించి కొద్ది గంటల ముందు తయారు చేసుకు న్న పిట్యూటరీ హార్మోన్‌లను గానీ ఓవాప్రిమ్‌ల ను గానీ బ్రీడర్ తోకబాగం కండరానికి ఇంజెక్ష న్ ద్వారా ఇవ్వాలి. సామాన్యంగా ఆడ బ్రీడర్‌కు కిలో బరువుకు 3 మి.గ్రా పిట్యూటరీ గ్రంథి హార్మోన్‌ను లేదా ఓవాప్రిమ్‌లను గాని మొదటి విడతగా ఇవ్వాలి. ఈ విడతలో మగ బ్రీడర్లకు ఇంజెక్షన్ ఇచ్చే అవసరం లేదు. ఇంజెక్షన్ ఇచ్చిన ఆడ బ్రీడర్‌ను ఇంజెక్షన్ ఇవ్వని రెండు మగ బ్రీడర్‌లను నీళ్ళ లో మూత గల హాపాల్లో ఉంచాలి. మొదటి ఇంజెక్షన్‌ను సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇవ్వాలి. మళ్లీ ఆరు గంటల సమయం లో అర్ధరాత్రి 12 గంటల వరకు రెండో విడత ఇంజెక్షన్ ఆడ బ్రీడర్‌కు ఆరు లేదా ఎనిమిది మి.గ్రా చొప్పున మగ బ్రీడర్‌కు మూడు మి.గ్రా చొప్పు న ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన మూడు, ఆరు గంటల తర్వాత ఈ హార్మోన్ ప్రభావం వల్ల ప్రేరేపన పొందిన ఆడ, మగ బ్రీడర్లు గుడ్లను వీర్యంను కలిపి వదులుతా యి. గుడ్లు వదిలిన 8-10 గంటలకు హాపాల నుంచి బ్రీడర్‌ను తీసి మళ్ళీ చెరువులో వదులుకోవాలి.

తగు జాగ్రత్తలు పాటించాలి

చేపపిల్లలను ఉత్పత్తి చేసేటప్పుడు తగు జాగత్త్రలు పాటించాలి. బ్రీడర్లకు హార్మోన్ ఇంజెక్షన్ ఎక్కడపడితే అక్కడ కాకుండా తోక కండరానికి మాత్రమే ఇవ్వాలి. ఆడ బ్రీడర్ ఒక కిలో బరువుకు 3 మి. గ్రాములు ఇవ్వాలి. మొదటి విడత అయితే మగ బ్రీడర్‌కు ఇంజెక్షన్ ఇవ్వకూడదు. మొదటి ఇడత వేసిన ఆరు గంటల తర్వాత రెండో విడత ఇవ్వాలి. రెండో విడతలో ఆడ బ్రీడర్‌కు ఆరు లేదా ఎనిమిది మి.గ్రాములు, మగ బ్రీడర్‌కు అయితే 3 మి.గ్రాములు ఇవ్వాలి. తదుపరి ఇవి పెట్టిన గుడ్లను బకెట్ల సాయంతో హాచిం హాపాలలోకి మార్చుకోవాలి. ఇవి పిల్లలు అయిన తర్వాత మూడో రోజు నర్సరీలోకి మార్చుకోవాలి.
- బూర్గు లవకుమార్,
కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి

గుడ్ల నుంచి చేపపిల్లల విడుదల: హాపాల నుంచి గుడ్లను బకెట్‌ల సాయంతో తీసి ముందే అమర్చుకున్న హాచిం హాపాలలోకి మార్చుకోవాలి. 4 కిలోల బరువున్న బొచ్చె 8 లక్షల గుడ్లను పెట్టగలదు. డబుల్ హాపా దోమతెర గుడ్ల సైజు పొడవు 150, వెడల్పు 75, లోతు 45 సెం.మీలు ఉన్న దాంట్లో 75 వేల నుంచి ఒక లక్ష గుడ్లను వేసి పిల్లలను చేయించవచ్చు. వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి 15-20 గుంటల్లో చేపపిల్లలను బయటకు వచ్చి దోమ తెర గుడ్ల రంధ్రాల నుంచి బయటకు హాపాలలోకి వస్తాయి. పిల్లలు అయిన తర్వాత మూడో రోజు పిల్లలను నర్సరీలోకి మార్చుకోవాలి.

బంగారు తీగ: ఈ చేపకు హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వకుండానే చెరువులోనే గుడ్లను పెడతాయి. కానీ ఎక్కువ గుడ్లు పెట్టడానికి ఒకొక్కప్పుడు ఇంజెక్షన్‌లు ఇవ్వడం అవసరం. బంగారు తీగ గుడ్లు చిన్నగా ఉండి నాచుమొక్కలను అంటుకునే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల బ్రీడింగ్ హాపాల్లో నాచుమొక్కలను పరిచి పర్వంగా ఉన్న ఒకే ఆడ చేపను రెండు మగ చేపలను కలిపి విడిచి పెట్టాలి. కొన్నిగంటల తర్వాత సహజమైన ప్రేరణ వల్ల విపరీతంగా విడిచిన గుడ్లు నాచుమొక్కను అంటుకొని ఉంటాయి. ఈ తర్వాత చేపపిల్లలను బ్రీడింగ్ హాపా నుంచి తీసి వేరే చెరువులో వదలాలి. బొచ్చె చేప జాతిలో మాదిరిగా కాక కామన్ కార్ప్ గుడ్లు రెండు, మూడురోజులుగా పిల్లలుగా రూపొందుతాయి. ఈ విధమైన ఉత్పత్తి ద్వారా స్వల్ప వ్యవధిలో కోట్ల కొలది ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది.
-నట్టె కోటేశ్వర్‌రావు,
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా, 9989944945

748
Tags

More News