ఆర్థిక భరోసా బోడ కాకర

Wed,July 11, 2018 11:24 PM

కూరగాయల పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన పంట ఆగాకర (బోడకాకర). ఒకప్పుడు ఈ తీగ జాతి పంట అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా పండేది. రానురాను ఈ పంటకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. దీనివల్ల రైతులు ఈ పంటను చిన్న చిన్న కమతాల్లో సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
boda-kakarakaya

ఆగారకలో రెండు జాతులుంటాయి

1. మైమోర్డియా చైనెన్‌సిస్, 2. మైమోర్డియో డయోకా
తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనబడే జాతి మైమోర్డియా డయో కా. దీని కాయలు పెద్దవిగా ఉంటాయి. 25 నుంచి 40గ్రాములు బరువు ఉంటాయి. పూలు పసుపు వర్ణంలో ఉండి సాయంత్రం పూస్తాయి.

పంట కాలం

మే/జూన్ నుంచి అక్టోబర్/నవంబర్ వరకు ఉంటాయి. తర్వాత తీగ చనిపోతుంది. దుంప భూమిలో సుప్తావస్థలో ఉంటుంది. మళ్లీ మే/జూన్‌లో మొలకెత్తుతుంది.

విత్తన లభ్యత

ఈ పంట అటవీ ప్రాంతంలో సాధారణంగా ఉండేది. దీనికి మార్కెట్‌లో విత్తనం లభించదు. చిన్న చిన్న దుంపలు గాని, పండిన కాయల నుంచి విత్తనాలను సేకరించుకోవాలి. సాధారణంగా ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరం. సాధారణంగా మొక్కల సంఖ్యను బట్టి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. కాని దీనిలో మొలక శాతం 8-10శాతం మాత్రమే. అందువల్ల ఎక్కువ విత్తనం అవసరం. అంతేకాకుండా మొక్కల్లో ఆడమొక్కలు, మగ మొక్కలు వేరు వేరుగా ఉంటాయి. అవి మనకు పూత పూసిన సమయంలోనే గుర్తించడానికి వీలుంటుంది. అందుకని పూత సమయంలో మగ వాటిని గుర్తించి 10శాతం మాత్రమే ఉండేటట్లు చేసి మిగతా వాటిని తీసివేయాలి.

దుంపల ద్వారా సాగు

ఆగాకర మొక్కతీగలు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటాయి. ఆ తరువాత తీగలు చనిపోతాయి. భూమిలోనే దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. అయితే జూన్ -అక్టోబర్ మధ్యలో ఎక్కువగా పూసే ఆడ మొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకోవాలి. వీటి దుంపలు సేకరించుకొని నాటుకోవాలి. మరుసటి ఏడాది వీటి ద్వారా ఎక్కువ దుంపలను వృద్ధి చేసుకోవాడానికి వీలుంటుంది.

దుంపల సేకరణలో జాగ్రత్తలు

సాధారణంగా ఆకులు ఒకే తమ్మెతో తీగలు ఎక్కువ దిగుబడి ఉంటుంది. 2.5కిలోలు మొక్కకు ఇ స్తుంది. అదే ఆకులు 3-5తమ్మెలుగా ఉన్నటువంటి తీగలు తక్కువ దిగుబడి అంటే 1.0-1.5కిలోలు మొక్క ఇస్తుంది. కాబట్టి మొదటి రకం ఎంచుకొని సాగు చేస్తే అధికంగా దిగుబడి వస్తాయి.

దుంపలు నాటడం

సాలుకు సాలుకు, మొక్కకు మొక్కకు మధ్య 2X2 మీటర్ల దూరంలో దుంపలను నాటుకోవాలి. అదే విత్తనమైతే ప్రతి గుంతలో 10-15 విత్తనాలు వేయాలి. అందులో నుంచి 3-5 పిలుకలు / మొక్కలు 40-45 రోజుల్లో వస్తాయి. దీన్ని సాధారణంగా వెజిటబుల్ చికెన్ అని అంటారు. పంట 45 నుంచి 50రోజుల్లో పూతకు వస్తుంది. పూత నుంచి కాయ కాయడానికి వారం రోజులు పడుతుంది. వారానికి రెండుసార్లు కోతకు వస్తుంది. ప్రతి కోతకు ఎకరం 40-50 కిలోలు వస్తాయి. సాధారణంగా 15-20 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది.

పందిరి

భూమికి 4-6 అడుగుల ఎత్తులో కొబ్బరితాడు / జె.ఐ వైర్లతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై తీగ పారిస్తే నాణ్యత, దిగుబడి పెరుగుతుంది.

boda-kakarakaya2

ఎకరానికి ఆదాయం

విత్తనం / దుంపల ఖర్చు = రూ.2,000
(కొంచెం కష్టబడి అటవీ ప్రాంతంలో
సంపాదిస్తే ఖర్చు ఉండదు.)
పొలం తయారీ = రూ. 5,000
పురుగు / ఎరువులు = రూ. 8,000
కూలీల ఖర్చు / రవాణా = రూ. 10,000
దిగుబడి
దిగుబడి = 20క్వింటాలకు (2,000 కిలోలు)
కిలో ధర = రూ.120 (మార్కెట్ ధర రూ.200)
ఆదాయం = రూ. 2,40,000
నికర ఆదాయం రూ.2,15,000 ఎకరంలో
- గుండెల రాజు
మహబూబాబాద్, 72889 85757

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు

అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉండే బోడ కాకరలో విశిష్ట ఔషధ గుణాలు, పోష క విలువలు ఉన్నాయి. దీంతో మార్కెట్‌లో డిమాండ్ ఉన్నది. కిలో రూ.160 నుంచి రూ.200 ధర పలుకుతుంది. ఈ పంట సాగు చేసిన రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఆర్థికంగా లాభాలను పొందవచ్చు. వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.
- కె. సూర్యనారాయణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మహబూబాబాద్
83744 49066 టోల్ ఫ్రీ నెంబర్ 18004250519

1137
Tags

More News