ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన చర్యలు

Wed,June 27, 2018 11:57 PM

ఉద్యానపంటల సాగుకు జూన్, జూలై నెలలు అనువుగా ఉంటాయని ఉద్యాన అధికారులు తెలుపుతున్నారు. నూతన తోటల సాగుతో పాటు, ఇప్పటికే సాగులో ఉన్న పండ్లు, కూరగాయల తోటల్లో తగు చర్యలు చేపట్టాలంటున్నారు. కూరగాయల సాగుకు ముందస్తుగానే దుక్కులలో తగు మోతాదులో ఎరువులను వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మధిర నియోజకవర్గ ఉద్యాన అధికారి బీవీ రమణ గారిని ఈ నంబర్ ద్వారా 8374449402 సంప్రదించవచ్చు.
Mango-tree

మామిడి తోటలో..

మామిడి తోటల్లో పడి ఉన్న టెంకలను ఏరివేసి భూమిలో ఫాలీడాల్ పొడి మందును చెట్ల పాదుల్లో వేసి కలియబెట్టాలి. దీనివల్ల పిండినల్లిని నివారించవచ్చు. లీటరు నీటికి 3గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్‌తో కలిపిన ద్రావణాన్ని చెట్ల చుట్టూ పోసి ఆకు మచ్చ, ఎండు తెగుళ్లను నివారించవచ్చు. సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను చెట్టు మొదలుకు 1.5 మీ దూరంలో గాడి చేసి ఎరువులను వేయాలి. జింక్ ఎరువును భాస్వరంతో కలుపకుండా విడిగా నత్రజని, పొటాష్ ఎరువులతో కలిపి వేసుకోవాలి. దీనివల్ల జింక్ ధాతు లోపాన్ని నివారించవచ్చు.

Lemon

నిమ్మ తోటలో..

నిమ్మ తోటలో పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అలాగే కలుపు యాజమాన్యం చేపట్టాలి. ఎండుపుల్లను కత్తిరించాలి. 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్, 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ 10 లీ. నీటితో కలిపి కత్తిరించిన భాగం బాగా తడిచేలా పిచికారీ చేస్తే గజ్జి తెగులు నివారించవచ్చు. వేరుకుళ్లు తెగులు నివారణకు చెట్ల పాదుల్లో 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పోయాలి. చెట్ల మొదళ్లకు బోర్డో పేస్టును పూతగా పూయాలి.

Mirapa

మిరపలో..

మిరపలో దృఢమైన, ఆరోగ్యమైన నారు కోసం విత్తనశుద్ధి చేయాలి. ఎత్తు నారుమడుల్లో నారు పెంచాలి. ఒక మీ. వెడల్పు, 40 మీటరు పొడవు, 15 సెం. మీ ఎత్తు చేసిన (ఒక సెంటు విస్తీర్ణం) మడిలో ఒక ఎకరానికి సరిపోయే నారును పెంచుకోవచ్చు. మడుల చుట్టూ మురుగు నీరు పోవడానికి వీలుగా 30 సెం. మీ వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. సెంటు నారుమడికి 650 గ్రా. చొప్పున విత్తనం వేసుకోవాలి. రసంపీల్చే పురుగుల నివారణకు ముందుగా విత్తనశుద్ధి చేయకపోతే సెంటు నారుమడికి 80 గ్రా. చొప్పున ఫిప్రోనిల్ 0.3 జి గుళికలు వేసుకోవాలి. గత 2-3 ఏండ్లుగా వైరస్ తెగుళ్ల ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా పొలం గట్ల వెంబడి ఉన్న కలుపు మొక్కలను నిర్మూలించి శుభ్రం చేసుకోవాలి. వైరస్ ఉధృతిని తగ్గించడానికి నారు దశ నుంచే రసం పీల్చే పురుగులు సోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశం ఉంటే రసం పీల్చే పురుగులను నివారించుటకు నెట్‌హౌస్‌లలో నారు పెంచుకోవచ్చు. నారుమళ్లలో నారుకుళ్లు తెగులు నివారణకు ముందు జాగ్రత్తగా విత్తిన 9వ రోజు, 15వ రోజు, 21వ రోజులలో 1 లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున కలిపిన మందు ద్రావణంతో నారుమళ్లు బాగా తడిచేటట్లు పోయాలి.

Onione

ఉల్లి నారుమళ్లలో..

ఇప్పటికే ఉల్లి నారు పోసిన రైతాంగం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. నారుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారుమడి తయారైతే ప్రధాన పొలాన్ని 2-3 సార్లు దుక్కి దున్నాలి. తర్వాత ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 30-40 కిలోల నత్రజని, 24-32 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. ఉల్లి నాటే ముందు పెండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.3 నుంచి 1.5 లీ లేదా ఆక్సీఫ్లోరోఫిన్ 23.5 శాతం 200 మి.లీ చొప్పున ఏదో ఒక దానిని పిచికారీ చేయాలి. లేదా నాటిన 2, 3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సీప్లోరోఫిన్ 23.5 శాతం 200 లీ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- మద్దెల లక్ష్మయ్య, ఖమ్మం వ్యవసాయం, 9010723131

దానిమ్మ తోటలో..

దానిమ్మ తోటలకు ప్రస్తుతం పూర్తిస్థాయి విశ్రాంతిని ఇవ్వాలి. కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వకం, ఎరువులు వేయడం లాంటివి చేయకూడదు. కానీ 1 శాతం బోర్డో మిశ్రమం మందును 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేస్తే బ్యాక్టీరియా ఎండు తెగులును అదుపులో ఉంచవచ్చును.
-బివీ రమణ మధిర నియోజకవర్గ ఉద్యాన అధికారి

601
Tags

More News