భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు

Wed,June 27, 2018 11:52 PM

-పొలం చుట్టూ మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి
-పచ్చిరొట్ట పైర్లను పూత దశలో కలియదున్నాలి
-ముదురు నారును నాటాలి

ప్రస్తుత వానకాలం పంటగా వరిని సాగు చేసే రైతులు చౌడు నేలలు కలిగి ఉన్నట్లయితే వరిపైరు సక్రమంగా నిలదొక్కుకోలేక ఎర్రబడి, ఎదుగుదల లోపించి దిగుబడులు బాగా తగ్గి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈ చౌడు నేలలు ఉండటం వల్ల పంట దిగుబడులు బాగా రాక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో రైతులు ఎలాగైనా ఈ భూములలో మంచి దిగుబడులు సాధించాలన్న ఆకాంక్షతో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా చౌడు భూములు రానురాను పెరిగిపోతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక నేలల్లో రైతులు వరినాటడానికి ముందు పాటించవలసిన పద్ధతులను గురించి నిపుణులు వివరించారు. ఆ వివరాలు...
raithubadi
-ఈ భూముల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి పొలం చుట్టూ మురుగు నీరు కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి.
-సున్నం పాలు ఎక్కువగా ఉంటే గంధకం వేయాలి.
-పచ్చిరొట్ట పైరులు వేసి పూత సమయంలో నేలల్లో కలియదున్నాలి. అవకాశం లేని చోట కంపోస్ట్ లేదా పశువుల ఎరువు వేయాలి.
-భూమిని ఎక్కువగా దమ్ము చేయకూడదు. ఎక్కువసార్లు దమ్ము చేస్తే పొలం బుడగెత్తి మొక్కలు సరిగా నిలదొక్కుకోవు.
-మాత్రమే నాటాలి. దగ్గర దగ్గరగా కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి.
-మొక్క తొలిదశలో, పూత దశలో లవణాల వల్ల వరి మొక్కలకు హాని కలుగుతుంది. కాబట్టి పొలంలో నీరు ఎక్కువగా పెట్టాలి. అప్పుడప్పుడు పాత నీరు తీసివేసి కొత్త నీరు పెట్టాలి.
-ఈ నేలలకు అనువైన రకాలు వికాస్, సీఎస్‌ఆర్ 13 వంటివి నాటుకోవాలి.
-చెరుకు ఫ్యాక్టరీ నుండి వ్యర్థ పదార్థంగా మిగిలే ప్రెస్‌మడ్‌ను కూడా జిప్సం కు బదులుగా వాడవచ్చు. హెక్టారుకు 2 నుంచి 3 టన్నులు వేయాలి.
-ఈ భూముల్లో జింక్‌లోపం బాగా కన్పిస్తుంది కాబట్టి ఎకరాకు 20-40 కిలో ల వరకు జింక్‌సల్ఫేట్‌ను వేయాలి. పైపాటుగా పైరుపై జింక్‌లోపం గమనిస్తే 0.2శాతం జింక్‌సల్ఫేట్ పిచికారీ చేయాలి. (లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున)
-భూసార పరీక్షకు అనుగుణంగా రసాయనిక ఎరువులు వాడాలి. భాస్వరం ను సూఫర్‌ఫాస్పేట్ రూపంలో వేయాలి. ఇందులో కాల్షియం, గంధకం ఉండడం వలన చౌడు విరగడానికి ఉపయోగపడుతుంది.
-పాల చౌడు నేలలైతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను వేయకూడదు.
-నట్టె కోటేశ్వర్‌రావు,గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,989944945

ఇష్టంవచ్చినట్టు ఎరువులు వద్దు

చౌడు భూముల్లో ఇష్ట వచ్చినట్లుగా కాకుండా ఎరువులను భూసార పరీక్షలను అనుసరించి వాడాలి. అవసరానికి తగ్గట్టుగా జిప్సం, గంధకాలను వేయాలి. ముందుగా పచ్చిరొట్ట పైరులను వేసి అవి పూత దశలోకి వచ్చినప్పుడు నేలల్లో కలియదున్నాలి. అలాగే అవకాశం ఉంటే పశువు ల ఎరువును వేస్తే మంచిది. పొలం పొట్టదశలో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా పెట్టి తదుపరి తీసివేసి కొత్త నీటిని పెట్టాలి. ఇలాంటి మెళుకువలను పాటిస్త్తే సమస్యాత్మక నేలల్లోనూ వరిని సాగు చేసి మంచి ఫలితాలు పొందవచ్చు.
-టి.యాదగిరిరెడ్డి, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి.
9440481279

486
Tags

More News