ఆసరాగా ఆకుకూరలు

Thu,June 21, 2018 03:10 AM

వానకాలం వచ్చేసింది.. రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.. ఈ యేడు రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందజేయడం, రైతుబీమాను కూడా వర్తింపజేయబోతుండడంతో మరింత ఉత్సాహంగా ఏరువాకకు కదిలారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో వరి, పత్తి, మక్కజొన్న పంటలు అధికంగా సాగు చేస్తారు. అయితే రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు.. వీరికి ఉండేదే ఒకటి నుంచి ఐదెకరాల పొలం... వీరిలో కూడా అధిక మందికి ఉన్న పొలం రెండెకరాల లోపే..! రెండెకరాలున్న రైతులు పెద్ద రైతుల మాదిరిగా మొత్తం వరి వేయడం వల్ల ఆరునెలల వరకు ఎలాంటి ఆదాయం ఉండదు. పైగా మందులు, కలుపు, కోతకు అదనపు ఖర్చు పెట్టుకోవాలి. ఇలా కాకుండా ఎకరా వరి వేసి.. మిగతా పొలంలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకుంటే భారం తగ్గడమే కాదు ఆదాయమూ వస్తుంది. ముఖ్యంగా తక్కువ కాలపరిమితి, తక్కువ పెట్టుబడి కలిగిన ఆకుకూరలైతే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
poodina
మార్కెట్లో తాజా ఆకుకూరలకు భలే డిమాండ్ ఉంటుంది.. ఆకుకూరల్లో ఐరన్‌తో పాటు కండ్లకు మేలు చేసే ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.. ఆకుకూరలు ఆరోగ్య సూత్రాలని వాటిని విరివిగా తినాలని డాక్టర్లే చెబుతుంటారు. కొత్తిమీర, పుదీనా హైబ్రిడ్ రకాలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతున్నా.. మంచి వాసన, రుచికరంగా ఉండే దేశీయ పంటలకే డిమాండ్ అధికం. వినియోగదారులు స్థానికంగా పండించిన ఆకుకూరలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం రైతులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని, రైతులు నీటిని సక్రమంగా వాడుకొని సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పచ్చకూరలు పసిడి పంటలే..!

అనుకూల నేలలు.. సాగు పద్ధతులు..

రాష్ట్రంలో అధికంగా ఎర్ర, నల్లరేగడి నేలల్లో ఇవి పండించవచ్చు. కాకపోతే నీటి యాజమాన్యంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. నల్లనేలలైతే 5 రోజులకో సారి.. ఎర్రనేలల్లో 3 రోజులకో సారి నీళ్లు పెట్టాలి. ఆకుకూరలు సాగు చేసే పద్ధతి చాలా సుల భం.. పంట రకాలన్ని బట్టి కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. విత్తనాల రూపంలో ఉండే కొత్తిమీర(ధనియా లు), పాలకూర, గంగవాయిలి(పాయిల్ కూర), మెంతి(పెద్దది, చిన్నది), పుంటి(గోంగూర), తోట, చుక్క, బచ్చల తదితరాల ఆకుకూరల పంటల సాగుకు ముందుగా దుక్కిని సిద్ధం చేసుకొని మడులుగా విభజించాలి. విత్తనశుద్ధి చేసుకొని ( కిలో విత్తనానికి 2.5 గ్రాములు కార్బండిజమ్( ఎమ్-45) కలిపి) కాసేపు ఆరబెట్టి చేనుల్లో పలుచగా చల్లుకోవాలి. దుక్కిమందు కూడా వెంటనే వేసుకోవచ్చు. నీటిని తర్వాత రోజు కూడా పెట్టుకోవచ్చు. వేరుజాతికి చెందిన పుదీనా అయితే దుక్కిని చిన్నచిన్న మడులుగా చేసి.. ముందుగానే నీరు పెట్టాలి.. దుక్కిమందు చల్లుకొని వరినారు వేసిన విధంగా వేర్లను భూమిలోకి చొప్పించాలి.

ఎరువుల వినియోగం

ఆకుకూరల సాగులో సేంద్రియ ఎరువులైన వర్మీకంపోస్టు, కోడి, పశువుల ఎరువులు ప్రధాన భూమికను పోషిస్తాయి. దుక్కులు లోతుగా దున్నుకున్న తర్వాత ఎకరాకు 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు (4నుంచి 5 ట్రాక్టర్లు), కోడి ఎరువైతే 3 నుంచి 4 టన్నులు వేసుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు లభించడంతో పాటు భూసారం పరిరక్షించబడుతుంది. దుక్కులను మడులుగా, చిన్నచిన్న ఆరాలుగా తయారు చేసుకొని.. దుక్కిమందు జల్లుకోవాలి. తర్వాత విత్తనాలు/నారు వేసుకోవాలి. దుక్కిమందులో ముఖ్యంగా నత్రజని, పొటాష్, పాస్పరస్ కలిసి ఉన్న డీఏపీ+యూరియాను సమపాళ్లుగా కలిపి, లేదా ఇవే మూలకాలు ఉన్న 17-17-17 ఎరువు కాని (ఎకరాకు 150 కేజీల చొప్పున(మూడు బస్తాలు) వేయవచ్చు. పంట వేసిన తర్వా త 20 నుంచి 25 రోజుల మధ్య (మొక్కపై పడకుండా చూసుకోవాలి) ఈ మందులు మరోసారి వేసుకుంటే.. పంట సరైన సమయంలో చేతికొస్తుంది.

చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలు

సాధారణంగా ఆకుకూరల కాలపరిమితి తక్కువ కాబట్టి చీడపీడలు పెద్దగా సోకవు. సోకినా చిన్నపాటి జాగ్రత్తలతో నివారించవచ్చు. కొత్తిమీర, మెంతి, పుంటి కూరలు చాలావరకు ఎలాంటి క్రిమీ సంహారక మందులు పిచికారీ చేయకుండానే పండుతాయి. వేపాకు రాలే సమయంలో కాస్త పసుపు, ఎరువు తెగు ళ్లు సోకుతుంటాయి.. కార్బండిజమ్, బావిస్టిన్ మందులను ఒకసారి పిచికారీ చేస్తే సరిపోతుంది. పాల, చుక్క, గంగవాయిలి, తోట, పూదీనాలకు తెలుపు, నలుపు దోమ, ఆకుతొలిచే పురుగులు సోకుతుంటా యి. ఎసిఫేట్, సైపర్ మిత్రిన్, బెంజేట్ వంటి మందులను వీటిని నివారించవచ్చు. పూదీనాకు నలుపు రోగం అధికంగా వస్తుంటుంది. కష్టోడియా, అమిష్టా ర్, క్యాబ్రియోటాప్ వంటి మందులతో దీన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదా ముందుగానే పంట వేసిన 20 రోజుల్లో వేపనూనెతో పిచికారీ చేయడంతో ఎలాంటి తెగుళ్లు రాకుండా చేయవచ్చు. పుదీనా, పాలకూరల్లో రెండో కోతనుంచి వేర్లపై వేపపిండి చల్లితే చీడపీడలు ఆశించవు.

కూలీలు, మార్కెటింగ్ సదుపాయాలు

ఆకుకూరల సాగు చిన్న, సన్నకారు రైతులకు అనుకూ లం.. ప్రయోజనకరం కూడా..! కూలీల అవసరం పెద్ద గా ఉండదు. కుటుంబ సభ్యులే అన్ని పనులు చేసుకోవచ్చు. బీడుపైనే కలుపు మందును పిచికారీ చేస్తే కలు పు బెడద కూడా ఉండదు. ఆకుకూరలను కట్టలుగా కట్టి స్థానికంగా ఉన్న రైతు బజార్లు, మార్కెట్లు, గ్రామా ల్లో ఉన్న చిన్నపాటి మార్కెట్లు, అంగళ్లలోనూ విక్రయించుకోవచ్చు. ధర కూడా సీజన్ బట్టి పాల, పుంటి, మెంతి, పూదీనా, తోట, చుక్క కూరలకు (100 కట్టలకు రూ. 40 నుంచి రూ. 100 వరకు) పలుకుతుం ది. కొత్తిమీరకు మాత్రం ఎప్పుడూ ధర ఉంటుంది.. (100 కట్టలకు రూ. 50 నుంచి 150 వరకు) పలుకుతుంది. రిలయన్స్, మోర్, హెరిటేజ్ తదితర సూపర్ మార్కెట్లు సైతం రైతుల వద్ద నుంచి నేరుగా కొంటున్నాయి. పూదీనాను సౌందర్య లేపపాల్లో వాడుతుంటారు.. అలాంటి సంస్థలతో రైతులు ఒప్పందాలు చేసుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలి. పుదీనా, పుంటి ఎక్కువగా పండించే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు (సాస్, చట్నీల తయారీ) ఏర్పాటు చేయా లి. మార్కెట్లలో నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు విరివిగా ఏర్పాటు చేయాలి.

కాల పరిమితి..

ఆకుకూరలు కాలపరిమితి కనిష్ఠంగా 45 రోజులు గరిష్ఠంగా 2 నెలలు దాటదు. కొత్తిమీర 12 రోజుల్లో మొలకెత్తి 45 రోజుల్లో చేతికొస్తుంది.. వేర్లతో సహా తొలగించి మార్కెటింగ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ధర లేకుంటే చేనులో అలాగే వదిలేసినా ధనియాలు పండుతాయి. పుంటి, మెంతి, చుక్క, తోట తదితర కూరలు కూడా దాదాపు కొత్తిమీర మాదిరిగా కాలపరిమితి, దిగుబడి ఉంటుంది. పాల కూర, పుదీనాను వేర్లపైభాగం వరకు కోత కోస్తారు. వేర్లను అలాగే ఉంచి మళ్లీ నీళ్లు, ఎరువులు క్రమం తప్పకుండా అందిస్తే 45 రోజుల్లో రెండో సారి పంట చేతికొస్తుంది. ఇలా పాల కూరను 6 నుంచి 8 నెలల వరకు పుదీనాను 3 ఏండ్ల వరకు కూడా ఉంచుకోవచ్చు. చిన్నమెంతులు మాత్రం వేసిన రెండు వారాల్లోనే పంట చేతికొస్తుంది.
- జూకంటి నరేందర్ 9989382510

605
Tags

More News