వరిలో నూతన రకాలు

Wed,June 13, 2018 10:44 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని వివిధ వరి పరిశోధనా స్థానాల్లో రూపకల్పన చేయబడి పరిశీలన దశలో ఉన్న వరి విత్తనాలతో పాటు కొన్ని విడుదలైన రకాలను కూడా సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో గల కృషి విజ్ఙాన కేంద్రంలో సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగు చేయబడుతున్న నూతన వంగడాల గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వాటిలోని రకాలు, గుణగణాలకు సంబందించిన సమాచారాన్ని అందించారు. వీటి అదనపు సమాచారం కోసం 9440481279 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
paddy

జేజీఎల్ 18047

ఈ రకాన్ని వానకాలం, యాసంగి పంటలుగా సాగు చేయడానికి అనుకూలం. దీని పంటకాలం 120 రోజు లు. గింజ సన్నగా, పొడువుగా ఉంటుంది. కోత సమయంలో గింజ రాలడం 1010తో పోల్చితే తక్కువ. దీన్ని సాధారణంగా బతుకమ్మ రకం అంటారు.

కెఎన్‌ఎమ్ 118

ఈ రకాన్ని వానకాలం, యాసంగిలలో సాగు చేయవచ్చు. దీని పంటకాలం 120-125 రోజులు. అగ్గితెగులును తట్టుకుంటుంది. సన్నరకం, గింజ పొడువు. కోత సమయంలో గింజ రాలడం తక్కువ. దీన్ని కూనారం సన్నాలు అనే పేరుతో పిలుస్తారు.

డబ్ల్యూజిఎల్ 347

ఈ రకాన్ని సైతం వానకాలం, యాసంగిలలో సాగు చేయవచ్చు. పంటకాలం 125-130 రోజులు. చలిని తట్టుకునే స్వభావం కలిగిన సన్నరకం. దీనిని సోమనాథ్ అనే పేరుతో పిలుస్తుంటారు.

డబ్ల్యూజిఎల్ 505

దీన్ని కూడా రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఉల్లికోడును తట్టుకోగల సన్నరకం.

బిపిటి 2615

ఈ రకాన్ని రెండు సీజన్‌లలో సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120 రోజులు. సుడిదోమను తట్టుకోగల సన్నరకం.

ఆర్‌ఎన్‌ఆర్ 2458

దీన్ని వానకాలం పంటగా సాగు చేసేందుకు అనుకూ లం. పంటకాలం 135 రోజులు. అగ్గితెగులుకు తట్టుకునే సన్నరకం. దీనికి కృష్ణ పేరు పెట్టారు.

ఆర్‌ఎన్‌ఆర్ 15038

వానకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. పంటకాలం 125 రోజులు. ఇది సన్నరకం.

ఆర్‌ఎన్‌ఆర్ 15048 ఈ రకాన్ని వానకాలం పంటగా అయితే ఆలస్యంగాను, యాసంగి పంటగాను సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఇది అగ్గితెగులును తట్టుకునే రకం. ఇతర చీడపీడల సమస్య కూడా తక్కువ. తెలంగాణ సోన అని పేరు పెట్టారు. ఈ రకంలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు ఈ రకం బియ్యం చాలా అనుకూలం.

ఆర్‌ఎన్‌ఆర్ 11718

ఈ రకం మూడవ సంవత్సరం చిరు సంచుల దశలో ఉన్నది. మధ్యస్థ గింజ రకం. వివిధ చీడపీడలను తట్టుకోవడంతో పాటు చౌడు నేలల్లో కూడా అధిక దిగుబడులు ఇచ్చే రకం.

జేజీఎల్ 1118

దీన్ని రెండు సీజన్‌లలోనూ నాటుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఇది ఉల్లికోడును తట్టుకుంటుంది. సన్నరకం. ఆలస్యంగా నాటుకోవడానికి అనువైనది.

జేజీఎల్ 11727

ఈ రకాన్ని వానకాలం యాసంగిలలో సాగు చేసుకునేందుకు అనువైనది. పంటకాలం 135 రోజులు. ఇది ఉల్లికోడు, అగ్గితెగులు, ఎండాకు తెగులును తట్టుకునే సన్నరకం.

డబ్ల్యూజిఎల్ 283

ఇది యాసంగి పంటగా సాగు చేసుకునేందుకు అనువైన రకం. పంటకాలం 125 రోజులు. గింజ సన్నగా, పొడువుగా ఉంటుంది. సుడిదోమను, చలిని తట్టుకుంటుంది.

డబ్ల్యూజిఎల్ 32100

ఇది వానకాలం పంటగా సాగుచేసేందుకు అనువైన సన్నరకం. పంటకాలం 135 రోజులు. దీన్ని సాధారణంగా వరంగల్ సన్నాలు అంటారు.

డబ్ల్యూజిఎల్ 3912

ఇది వానకాలం పంటగా సాగు చేసేందుకు అనుకూలం. పంటకాలం 135 రోజులు. ఉల్లికోడును తట్టుకుంటుం ది. గింజ సన్నగా, పొడువుగా ఉంటుంది.

డబ్ల్యూజిఎల్ 44

ఇది వానకాలానికి అనుకూలం. పంటకాలం 140 రోజులు. ఉల్లికోడును తట్టుకుంటుంది. గింజ మధ్యస్థ రకం. చేను మీద పడిపోదు.

డబ్ల్యూజిఎల్ 14

వానకాలానికి అనుకూలం. పంటకాలం 135 రోజులు. బాక్టీరియా, ఎండాకు తెగులును తట్టుకునే సన్నరకం.
గమనిక: ఆర్‌ఎన్‌ఆర్ అంటే రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానమని, డబ్ల్యూజిఎల్ అంటే వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానమని, జేజీఎల్ అంటే జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానమని, కెఎన్‌ఎమ్ అంటే కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానమని రైతులు అర్థం చేసుకోవాలి.
-నట్టె కోటేశ్వర్‌రావు,
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా, 9989944945.

380
Tags

More News